పగలు డంపింగ్‌... రాత్రి లిఫ్టింగ్‌

Sand Mafia in East Godavari - Sakshi

బడా నేతల కనుసన్నల్లో ఇసుక రవాణా

ఎన్నికలు సమీపిస్తుండడంతో మరింత బరితెగింపు

వినియోగదారుల జేబులకు చిల్లు

ఉచితంగా అందిస్తామంటున్న ఇసుక ధరలు చుక్కలనంటుతున్నాయి. ర్యాంపులో లారీ లోడింగ్‌ నుంచి గమ్యస్థానం చేరే వరకూ ప్రతిచోటా ధర రెట్టింపు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాన్ని వెక్కిరిస్తోంది. దీంతో వినియోగదారులు జేబులు గుల్లవుతున్నాయి. ఎన్నికల సీజన్‌ మొదలు కానుండడంతో అధికార పార్టీ పెద్దలు బరి తెగిస్తున్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు బడా కంపెనీలు, నిర్మాణ సంస్థలతో నేరుగా ఒప్పందాలు చేసుకుని లారీల కొద్దీ ఇసుకను తరలిస్తూ ఎన్నికల ఖర్చుల కోసం ముందస్తుగా కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారు.

తూర్పుగోదావరి, అమలాపురం: రావులపాలెం, ఆలమూరు, కపిలేశ్వరపురం, కొత్తపేట ఇసుక ర్యాంపుల నుంచి అమలాపురానికి రెండు యూనిట్ల లారీ ఇసుకకు అవుతున్న ఖర్చు రూ.8 వేల పైమాటే. కాకినాడకు కూడా ఇదే ధర. తుని వంటి ప్రాంతాలకు తరలించాలంటే రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చవుతోంది. వాస్తవం ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం ఉచితంగా ఇసుకను అందజేస్తున్నామని గొప్పలకు పోతోంది. ఇక్కడే కాదు మిగిలిన ర్యాంపుల్లో సైతం ఇదే దందా. ఇసుక ర్యాంపులో రెండు యూనిట్ల లోడింగ్‌ ఛార్జీ రూ.475, నదిలో బాటకు లారీకి రూ.150 చొప్పున ధర నిర్ణయించారు. అయితే ఇక్కడ లోడింగ్‌కు రూ.900  చొప్పున వసూలు చేస్తున్నారు. దీనికి బాట ఛార్జి అదనం. ర్యాంపు నుంచి ఇసుక బయటకు అంటే ర్యాంపు ఉన్న గ్రామానికి చేరవేయడానికి లారీ కిరాయి రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కిలోమీటరుకు రూ.40 చొప్పున వసూలు చేయాలన్నది ప్రభుత్వ నిబంధన. కానీ దీనికి పది రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇలా లారీ లోడింగ్‌ నుంచి అన్‌లోడింగ్‌ వరకు అధిక ధరలు బహిరంగంగానే వసూలు చేస్తున్నారు.

పగలు నిల్వ చేసి...
ఇసుకను రహస్య ప్రదేశాల్లో పగలు నిల్వ చేయడం, రాత్రుళ్లు తరలించడం జిల్లాలో షరామామూలు వ్యవహారంగా మారింది. రెండు యూనిట్ల లారీకైనా.. ఐదు యూనిట్ల లారీకైనా డీజిల్‌ ఖర్చు వ్యతాసం రూ.వెయ్యి మాత్రమే ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని నేతల సిఫార్సుల మేరకు స్థానికంగా ఇసుక దందాలు చేసేవారు పగలు ర్యాంపునకు సమీపంలో భారీగా ఇసుకను నిల్వ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఐదు యూనిట్ల లారీల ద్వారా అమలాపురం, కాకినాడ, భీమవరం వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైవే అ«థారిటీ ఆధ్వర్యంలో సాగుతున్న రహదారుల విస్తరణ, పోర్టు, ఇతర పరిశ్రమల్లో నిర్మాణాలు, భారీ భవంతులు నిర్మాణాలు చేసేవారితో అధికార పార్టీ నేతలే నేరుగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులు,  ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే, జిల్లా సహకార సంఘాలకు చెందిన ఒక కీలక నేత కనుసన్నల్లో ఈ దందా సాగుతోంది. రాత్రి వేళల్లో నేతలకు చెందిన వాహనాలు వెళ్లేటప్పుడు ఎక్కడా నిలుపుదల చేయవద్దని పోలీసులకు, మైనింగ్‌ శాఖ అధికారులకు అనధికార ఆదేశాలు వెళుతున్నాయి. దీంతో వారు చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. ఐదు యూనిట్ల లారీతో ఇసుక రవాణా చేస్తూ అడ్డుగోలుగా సొమ్ములు చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top