సిక్కోలు జీవధార..వంశధార!

సిక్కోలు జీవధార..వంశధార! - Sakshi


జీవన ప్రమాణాలు పెంచే జీవనాడి

జగన్‌ ప్రభుత్వంలో రాజన్న ఆశయం సాకారం

మొండిగా ముందుకెళ్లడం వల్లే అనుకూల తీర్పు

ఏవో సాకులతో బ్యారేజీ నిర్మాణం వాయిదా వద్దు

ఇక ఒడిశా జలవివాదాలు సృష్టించే చాన్స్‌ లేదు

‘నేరడి’ బ్యారేజీ ఘనత రాజన్నదే
‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాడు మొండికేసి హిరమండలం రిజర్వాయరు, కాట్రగడ వద్ద సైడ్‌వియర్‌ నిర్మాణానికి ముందుకెళ్లకుంటే ఒడిశా ప్రభుత్వం ఈ వివాదాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లేది కాదు... అలా వంశధార జలవివాదాల ట్రిబ్యునల్‌ ఏర్పాటయ్యేదీ కాదు... మరి ఆ ట్రిబ్యునల్‌ ఏర్పాటు గాకుంటే ఈరోజు తీర్పు మనకు అనుకూలంగా తెచ్చుకోనూలేం... ఈ వివాదం నెపంతో ఎప్పటిలాగే టీడీపీ ప్రభుత్వం వంశధార ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కనబెట్టేసేది. అందుకు భిన్నంగా సిక్కోలు జిల్లా ప్రజల ఆర్థిక స్థితిగతులను, జీవన ప్రమాణాలను అనూహ్యంగా మార్చేసే శక్తి వంశధార ప్రాజెక్టుకు ఉంది. దీన్ని సాకారం చేసిన రాజశేఖరుడే ముమ్మాటికీ అపర భగీరథుడు. ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో తలచుకుంటే ఎలాంటి ప్రాజెక్టు అయినా పూర్తి అవుతుందని చెప్పడానికి ఆయనే నిదర్శనం...’ అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తన మనసులో మాటను ఆవిష్కరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే....సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘వంశధార, నాగావళి జీవనదులు కావు. వర్షాకాలంలో ఉద్ధృతంగా నీటి ప్రవాహం ఎంత సహజమో, మధ్యమధ్యలో ప్రవాహం తగ్గిపోయి కనిపించడం అంతే సహజం. నేనూ రైతు కుటుంబం నుంచి వచ్చినవాడినే. ఖరీఫ్‌లో వరిఆకు తీసి, దమ్ము చేసుకొని ఉభాలకు దిగుదామనే సమయానికి నీరు అందేది కాదు. ఒక్కోసారి ఎలాగో ఉభాలు పూర్తిచేసి గట్టెక్కినా తర్వాత పొలాల్లో చుక్కనీరు కనిపించేది కాదు. పక్కనే నది ఉన్నా అది కష్టకాలంలో ఉపయోగపడట్లేదనే బాధ నాలోనే కాదు ప్రజలందరిలోనూ ఉండేది. నదీజలాలు సద్వినియోగమైతే ఉభయ గోదావరి జిల్లాలకు దీటుగా వ్యవసాయంలో బంగారం పండించగలిగిన గడ్డ ఇది. ఆ రోజు కోసం నా చిన్నప్పటి నుంచి కలలు కనేవాడిని. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని నెరవేర్చుకునే అవకాశం కలిగింది. ఆయన అకాల మరణం తో ఒడుదొడుకులు ఎదురైనా ఆయన కుమారుడు జగన్‌ ద్వారానైనా ప్రాజెక్టును పూర్తి చేయించుకుంటామనే నమ్మకం నాకుంది.ఆది నుంచి ఒడిశా అభ్యంతరాలే...

వాస్తవానికి ఒడిశాలో జన్మించి జిల్లాలోకి ప్రవహిస్తున్న వంశధార నదీ జలాలను చెరో సగం వాడుకోవడానికి 1962లోనే ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ నాటి నుంచీ ఒడిశా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల తమ భూభాగంలో నష్టం జరుగుతుందనేది ప్రధాన వాదన. 2004 సంవత్సరం వరకూ శ్రీకాకుళం జిల్లా పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వాలు ఒడిశా అభ్యంతరాలను పరిష్కరించే దిశగా ఎలాంటి కృషి చేయలేదు. వంశధార ప్రాజెక్టుకు నిధులు ఎందుకు ఇవ్వలేదని అడిగినవారికి ఒడిశా అభ్యంతరాలను సాకుగా చూపిస్తూ వచ్చాయి. జలగం వెంగళరావు హయాంలో గొట్టా దగ్గర రిజర్వాయర్‌ గాకుండా బ్యారేజీ నిర్మించారు. ఎడమ ప్రధాన కాలువ ఆయకట్టు కింద లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందింది. అప్పట్లో వెంగళరావుకు సిక్కోలు ప్రజలు జేజేలు పలికారు.రిజర్వాయర్‌తోనే ఉపయోగం...

చాలామందికి తెలియని విషయమేమిటంటే రిజర్వాయరు లేకుండా బ్యారేజీ నిర్మిస్తే నదిలో నీరు వచ్చినప్పుడు మాత్రమే ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. వరద వచ్చినా నిల్వ చేసుకోవడానికి వీలుండదు. దిగువకు వదిలేయాల్సిందే. గొట్టా బ్యారేజీ కింద ఉన్న ఆయకట్టుకు ఖరీఫ్‌లో కూడా సకాలంలో నీరు అందక పొలాలు ఎండిపోవడం, చివరి భూములకు నీరు అందకపోవడం తరుచుగా సంభవిస్తోంది.రైతు మేలెరిగిన రాజన్న

ఈ రాష్ట్రంలో ఎక్కువ మందికి ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించేది వ్యవసాయం ఒక్కటేనని నమ్మిన వ్యక్తి రాజశేఖరరెడ్డి. వ్యవసాయం గొప్పగా జీవన ప్రమాణాలను పెంచలేకపోవచ్చేమో కానీ ప్రజల ఆకలి తీర్చడానికి, జిల్లా నుంచి వలసలు నిరోధించడానికి భరోసా ఇస్తుందని నమ్మారు. వ్యవసాయానికి సాగునీరు ఉండాలి. ఈ రాష్ట్రంలో భూమి ఉంది. నీరూ ఉంది. ఆ నీరును సాగుభూమికి మళ్లించే నాయకత్వమే లోపించింది. 2001 నుంచి 2003 వరకూ రైతుల బలవన్మరణాలు విపరీతంగా సంభవించాయి. వరుస కరువులతో ఎండిపోతున్న పొలాలను చూసి పురుగు మందు తాగి చనిపోతున్నవారి సంఖ్య ఏటా పెరిగిపోయింది. దేశంలోనే అత్యధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్య ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయి. 2003 సంవత్సరంలో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ సాగిన ‘మహాప్రస్థానం’ పాదయాత్రలో ఇవన్నీ వైఎస్‌ కళ్లారా చూశారు.జలయజ్ఞంలో వంశధారకు చోటు...

వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో అధికారంలోకి వచ్చాక జలయజ్ఞం ప్రారంభించారు. పెద్ద ఎత్తున నిధులు వెచ్చించడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పటికీ వంశధార ప్రాజెక్టుపై ఒడిశా అభ్యంతరాలు అలాగే ఉన్నాయి. జలయజ్ఞంలో వంశధార ప్రాజెక్టును మంజూరు చేయగలిగితే అత్యంత వెనుకబడిన, ఏళ్లతరబడి నిర్లక్ష్యానికి గురైన శ్రీకాకుళం జిల్లాకు గొప్ప మేలు జరుగుతుందని రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన వంశధార రిజర్వాయరు నిర్మాణానికి అంగీకరించారు. కానీ నిర్మాణానికి ఒడిశా అంగీకరించలేదు కాబట్టి ప్రత్యామ్నాయ మోడల్‌ కోసం చూశారు. జిల్లాకు చెందిన ప్రముఖ ఇంజినీరు సీఆర్‌ఎం పట్నాయక్‌ వంటి పెద్దలను సంప్రదించాను.అనధికారికంగానే ఆయన ఇచ్చిన మోడల్‌ను వైఎస్‌ దగ్గరకు మేము తీసుకెళ్లాం. అత్యున్నతమైన ఇంజినీరింగ్‌ నిపుణులతో ఆ మోడల్‌ సాధ్యాసాధ్యాలను చర్చించారు. ఒడిశాకు ఇబ్బంది లేకుండా, బ్యారేజీ నిర్మాణం లేకుండా సైడ్‌ వియర్‌ కట్టుకొని దానిద్వారా వరదనీరు తీసుకోవాలని నిర్ణయించారు. ఆ వెంటనే టెండర్లు పిలిచి నిధులు ఇచ్చేశారు. పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు తోటపల్లికి భారీగా నిధులివ్వడంతో ఆ ప్రాజెక్టు పనులు శరవేగంతో ఊపందుకున్నాయి. మహేంద్ర తనయ నదిపై మధ్య తరహా ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకూ శంకుస్థాపన చేశారు. మడ్డువలస ప్రాజెక్టు విస్తరణకూ నిధులు మంజూరు చేశారు. ఇతర జిల్లాల్లాగే శ్రీకాకుళం జిల్లాకూ సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున చోటు లభించింది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులను భుజానకెత్తుకున్న వైఎస్‌ను అపర భగీరథుడు అని జిల్లా ప్రజలు కీర్తించారు. ఊరూరా సంబరాలు చేసుకున్నారు.మధ్యంతర తీర్పుతో సానుకూలం...

ట్రిబ్యునల్‌ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. 8 టీఎంసీలు మాత్రమే తీసుకొనేలా సైడ్‌వియర్‌ నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. ఆరోజు రాజశేఖరరెడ్డి తెగువతో సైడ్‌వియర్‌ను తెరపైకి తెచ్చి వంశధార ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడం వల్లే ట్రిబ్యునల్‌లో సానుకూల ఆదేశాలు తెచ్చుకోగలిగాం. లేదంటే రెండు రాష్టాల మధ్య జలవివాదం ఎప్పటికీ తెరపడేది కాదు. రిజర్వాయర్, వరద కాలువల నిర్మాణానికి రాజశేఖరరెడ్డే అనుమతి ఇచ్చేశారు. వివాదాస్పదమైన నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా ఇప్పుడు స్పష్టత వచ్చేంది. కుడివైపు హెడ్‌ రెగ్యులేటరీ నిర్మాణ వ్యయం పూర్తిగా భరించాలని ఆంధ్రప్రదేశ్‌కు, ఎడమవైపు హెడ్‌రెగ్యులేటరీని నిర్మించుకోమని ఒడిశాకు ఆదేశాలొచ్చాయి. బ్యారేజీ నిర్మాణం ఖర్చును ఆయకట్టు నిష్పత్తి ప్రకారం భరించాల్సి ఉంది. భవిష్యత్తులో బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యాక సైడ్‌వియర్‌ను మూసేయాలని చెప్పింది. పర్యవేక్షణకు ఒక కమిటీ కూడా ఏర్పాటవుతుంది. ఈ కమిటీ కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటుచేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆ కార్యాలయాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే ఏర్పాటు చేయాలని నేను డిమాండు చేస్తున్నా.వాటిని సాకుగా చూపించొద్దు...

బ్యారేజీ వల్ల ముంపునకు గురయ్యేది 116 ఎకరాలని ప్రాథమిక అంచనా. అక్కడ పునరావాసం, నష్టపరిహారం, ప్రత్యామ్నాయ భూసేకరణ తదితర ప్రక్రియలన్నింటికీ ప్రస్తుతం అమల్లో ఉన్న 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఖర్చు భరించాల్సి ఉంది. అయితే బ్యారేజీ నిర్మాణానికి నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించేందుకు ఒడిశా ప్రభుత్వం ఆసక్తి చూపకపోవచ్చు. దీన్ని సాకుగా చూపించి తప్పించుకోకుండా ఆనాటి రాజశేఖరరెడ్డి ఆశయాన్ని నెరవేర్చే కార్యక్రమానికి వెంటనే కార్యరంగంలోకి దిగాలి. ఇదేమీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తలకుమించిన భారమేమీ కాదు. మహాఅయితే ఈ వ్యయమంతా రూ.2 వేల కోట్లకు మించకపోవచ్చు. ఆ మొత్తాన్ని భరించి బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఒడిశా ప్రభుత్వం నుంచి రాబట్టుకోవచ్చు. అలాగాకుండా ఒడిశా నిధులొచ్చాకే పనులు ప్రారంభించాలనుకుంటే పని పూర్తికాదు. ఏవో సాకులతో నాన్చే పనిగాకుండా వెంటనే ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఒకవేళ పూర్తిచేయకపోతే జగన్‌ అధికారంలోకి వచ్చాక రాజశేఖరరెడ్డి ఆశయాన్ని తప్పక నెరవేర్చుకుంటాం.ఒడిశా అభ్యంతరాలతో...

అప్పటివరకూ నేరడి బ్యారేజీని మాత్రమే ముంపు సాకుతో ఒడిశా అభ్యంతరం చెబుతూ వచ్చింది. తీరా వంశధార స్టేజ్‌–2 పనులు ప్రారంభమైన తర్వాత సైడ్‌వియర్‌ నిర్మాణంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. శాశ్వత పరిష్కారం చూపించే ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ట్రిబ్యునల్‌ ఏర్పాటయ్యే సమయానికి వైఎస్‌ అకాల మరణం చెందారు. ఆయన కలలు సాకారం కావాలంటే వంశధార ప్రాజెక్టు ఆగిపోకూడదు. ఎందుకంటే 2.55 లక్షల ఎకరాల్లో ఆయకట్టు స్థిరీకరణకు, రెండు లక్షల ఎకరాల్లో రెండో పంటకు సాగునీరు అందించేందుకు, వందల గ్రామాల్లో ప్రజలకు తాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు అవసరం. శ్రీకాకుళం జిల్లాకు ఇదో జీవన్మరణ సమస్య కూడా. ట్రిబ్యునల్‌ తీర్పు చాలా కీలకం. అందుకే మన రాష్ట్రం తరఫున వాదనలు వినిపించడానికి జలవివాదాల్లో నిపుణుడైన వైద్యనాథ్‌న్‌ను నియమించాం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top