ఆళ్లగడ్డలో సాక్షి విలేకరిపై దాడి

Sakshi journalist attacked in kurnool

మంత్రి అఖిలప్రియ అనుచరులమంటూ హల్‌చల్

దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు

ఆళ్లగడ్డ టౌన్‌/కర్నూలు సిటీ/సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సాక్షి దినపత్రిక విలేకరి కృష్ణయ్యపై గురువారం గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. పట్టణంలోని కృష్ణయ్య నివాసంలోకి సుమారు ఆరుగురు వెళ్లి.. ‘మా మంత్రి అఖిలప్రియపై వ్యతిరేక వార్తలు రాస్తావా?’ అంటూ ఆయన్ను బయటకు ఈడ్చుకుంటూ వచ్చి తీవ్రంగా కొట్టారు. ఇంట్లోని వస్తువులు, ఫర్నిచర్, కంప్యూటర్‌ ధ్వంసం చేశారు. దీన్ని గమనించిన కాలనీవాసులు దుండగులను ప్రతిఘటించి కృష్ణయ్యను కాపాడారు. ఈ దాడిపై కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేశారు. పవన్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ జర్నలిస్టులు గురువారం డీఎస్పీ చక్రవర్తిని కలసి.. జర్నలిస్టులపై దాడులు అమానుషమని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దాడులు అప్రజాస్వామికం: జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామికమని జర్నలిస్టు, ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు. సాక్షి విలేకరిపై దాడికి నిరసనగా శుక్రవారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జర్నలిస్టు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వారు పత్రికల్లో వచ్చే కథనాలకు ఖండన ఇచ్చుకోవచ్చని, అలా కాకుండా అనుచరుల ద్వారా దాడులు చేసే సంస్కృతి సరైన విధానం కాదని హితవు పలికారు. ఆందోళనలో ఏపీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజేఎఫ్, ఏపీజేఎఫ్‌ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top