వంచనపై జరగాలి వార్‌

Sakshi Interview With Prakasam District Development Forum Chairman Chunduri Rangarao

గడిచిన నాలుగున్నరేళ్లలో జిల్లా అభివృద్ధి శూన్యం

జిల్లా రైతాంగానికి ప్రభుత్వ బాకీ రూ.12,030 కోట్లు

‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు

‘గారడీ మాటలతో కాలం గడిపారు. టక్కరి వ్యవహారాలతో ప్రజలను మభ్యపెట్టారు. జిల్లాలో అభివృద్ధికి కంటకులుగా మారారు. ఐదేళ్లు కరువుతో జిల్లా రైతాంగంతో పాటు ప్రజలు అతలాకుతలమయ్యారు. ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో జిల్లాలో అభివృద్ధి శూన్యం. జిల్లా రైతాంగానికి రూ.12,030 కోట్లను టీడీపీ ప్రభుత్వం బాకీ పడింది. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంకా కొనసాగించాల్నా..? అందుకే ముందు ప్రజల్లో మార్పు రావాలి. వంచనపై వార్‌ ప్రకటించాలి. జిల్లా అభివృద్ధికి కంటకులుగా మారిన వారిని ఘోరంగా ఓడించాలి’ అని జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయనతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి...

ప్రశ్న : జిల్లా ప్రజలకు జీవధార అయిన వెలిగొండ ప్రాజెక్టు పనులు ఎప్పటికి పూర్తికావచ్చు..?
జవాబు : ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు పలు జిల్లాల ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు జీవధారే. పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగునీటితో పాటు ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు రక్షితనీటిని అందించేది వెలిగొండ ప్రాజెక్టే. దాంతో పాటు పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడే విధంగా దీని రూపకల్పన జరిగింది. ఈ ప్రాజెక్టుకు 1996లో చంద్రబాబు సీఎం హోదాలో పునాధి రాయి వేశారు. 2004లో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంత వరకు పట్టించుకోలేదు. ఆ తర్వాత 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండకు రూ.5 వేల కోట్లకుపైగా వెచ్చించి దాదాపు 75 శాతానికిపైగా పనులు పూర్తిచేశారు. తిరిగి చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, ఈ ఐదేళ్లలో కనీసం 3 కిలోమీటర్లు కూడా సొరంగాలు తవ్వలేదు. ఇలాగే నత్తనడకన పనులు జరిగితే ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో ఐదేళ్లు పడుతుంది.

ప్రశ్న : జామాయిల్, సుబాబుల్‌ రైతుల పరిస్థితిపై మీ పోరాటం ఏమైంది..?
జవాబు : 2013 నుంచి జామాయిల్, సుబాబుల్‌ రైతుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాం. ఆ ఏడాదిలో చంద్రబాబునాయుడు చీమకుర్తి ప్రాంతంలో పాదయాత్ర చేశారు. అప్పట్లో జామాయిల్‌ రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. టన్ను ధర మద్దతు ధర కంటే రూ.400 తక్కువగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్దతు ధర ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంఘ ప్రతినిధులం కలిశాం. కానీ, 2013లో జామాయిల్‌ టన్ను ధర రూ.4,000, సుబాబుల్‌  ధర రూ.3,800 ఉండగా, అది కాస్తా ఇంకా క్షీణించి టన్ను ధర రూ.2,800 నుంచి రూ.2,500కు పడిపోయింది. ఎన్నోసార్లు మంత్రులు, అధికారులను కలిసినా ప్రయోజనం లేదు. పేపర్‌ మిల్లుల వాళ్లు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై రైతులకు ధర లేకుండా చేశారు.

ప్రశ్న : రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగేనా..?
జవాబు : చంద్రబాబు వెలిగొండకు 1996లో పునాధి రాయి వేశారు. దానిని 2004 వరకు మరిచిపోయారు. అదేవిధంగా రామాయపట్నంలో మేజరు పోర్టు, నౌకా నిర్మాణ కేంద్రం కోసం కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే చంద్రబాబు మాత్రం ఎన్నికలు వస్తుండేసరికి తూతూమంత్రంగా పునాధి రాయి వేసి వదిలేశారు. జిల్లా ప్రజలను మభ్యపెట్టడానికే ఈ పునాధి రాయి. ఇదంతా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

ప్రశ్న : ఒంగోలు డెయిరీ పరిస్థితి ఏమిటి..?
జవాబు : డెయిరీని అంపశయ్య ఎక్కించిన ఘనత తెలుగుదేశం పాలకులదే. టీడీపీ పాలకమండలి చేతిలో డెయిరీ ఉన్నప్పటికీ నిలువునా నిర్వీర్యం చేశారు. రోజుకు 1.30 లక్షల లీటర్ల పాల సేకరణ కాస్తా చివరకు 3 వేల లీటర్లకు పడిపోయిందంటే ఏ స్థాయికి కూల్చేశారో అర్థమవుతోంది. జిల్లాలో దాదాపు 40 వేల కుటుంబాలు పాల సేకరణ మీద ఆధారపడితే.. ఆయా కుటుంబాల మహిళా రైతులను నిలువునా ముంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే.

ప్రశ్న : సాగర్‌ కుడి కాలువ నీటిని సాగుకు ఎందుకు ఇవ్వలేదు..?
జవాబు : జిల్లా రైతాంగాన్ని పాలకులు, అధికారులు నిలువునా మోసం చేశారు. 2018 సెప్టెంబర్‌ 2 నాటికి సాగర్‌లో 314 టీఎంసీల నీరుంది. వాస్తవానికి జిల్లా రైతాంగానికి 53 టీఎంసీల నిఖర జలాలు వాడుకునేందుకు హక్కు ఉంది. అయినా, ఫిబ్రవరి 15న కాలువ కట్టేసే నాటికి 30.69 టీఎంసీలు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. తీరా చూస్తే 22 టీఎంసీలు కూడా ఇవ్వలేదని తేలింది. 4.50 లక్షల ఎకరాలు సాగర్‌ కుడి కాలువ కింద సాగు కావాల్సి ఉంటే.. కేవలం 90 వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగుచేయాలని హుకుం జారీ చేసిన అధికారులు.. పూర్తిస్థాయిలో రైతులను ఆదుకోలేదు. వేసిన వరి పైర్లు కూడా ఎండిపోయాయి.

ప్రశ్న : జిల్లాలో ఐదేళ్లపాటు పంటల సాగు ఎలా ఉంది..?
జవాబు : ఐదేళ్లూ జిల్లాలో కరువు తాండవిస్తూనే ఉంది. సాధారణ విస్తీర్ణం కూడా సాగు కాలేదు. ప్రతి సంవత్సరం ఖరీఫ్, రబీలో కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటిస్తూనే ఉంది. కానీ, పంట దిగుబడులు, ఉత్పత్తులు రికార్డు స్థాయిలో వచ్చాయని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.

ప్రశ్న : ఏ వర్గానికైనా ఈ ప్రభుత్వంలో మేలు జరిగిందా..?
జవాబు : ఏ ఒక్క వర్గానికీ ప్రయోజనం కలగలేదు. పామూరులో నిమ్జ్‌ ఇప్పటికే ఏర్పాటు అయి ఉంటే రామాయపట్నంలో మేజరు పోర్టు, నౌకా నిర్మాణ కేంద్రం పూర్తియి ఉంటే ఈ రెండింటి అనుసంధానంతో జిల్లాలోని నిరుద్యోగులతో పాటు ఆయా ప్రాంతాల ప్రజలు ఉపాధి పొందేవారు. కానీ, అవేమీ జరగలేదు. ఇక రైతుల పరిస్థితి అగమ్యగోచరం.

ప్రశ్న : జిల్లాలో పరిశ్రమలు, నిమ్స్‌ పరిస్థితి ఏమిటి..?
జిల్లాపై చంద్రబాబు ప్రభుత్వం కనీసం దృష్టిపెట్టిన పాపాన పోలేదనడానికి ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడమే నిదర్శనం. కనిగిరి నియోజకవర్గంలోని పామూరు వద్ద నిమ్జ్‌ను యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ తర్వాత బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా భూములను గుర్తించి పరిశ్రమలకు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఒక్క ఎకరా కూడా కేటాయించలేదు. అందుకోసం కేంద్రం ఒక నోడల్‌ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసి 5 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా రూపకల్పన చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంగిత జ్ఙానం లేదు. కేంద్రం అవకాశం కల్పించినా దానిని సద్వినియోగం చేసుకోవటానికి వెనకాడారు. ఎందుకంటే అందులో వీరికి వాటాలేమీ రావు. మొత్తానికి నిమ్జ్‌ను అటకెక్కించారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్‌దీ అదే పరిస్థితి. మంత్రి శిద్దా ఘోరంగా విఫలమయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top