రాష్ట్రాన్ని చంద్రబాబు చీకట్లోకి నెట్టేశారు

Sajjala Ramakrishna Reddy Slams Chandrababu naidu - Sakshi

ప్రతి వర్గాన్నీ వేధించి, బాధించి బాబు పాలన సాగిస్తున్నారు

ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ కష్టపడుతున్నారు

జగన్‌ను సీఎం చేసుకుంటే తెలుగువారి గుండెల్లో నిలిచిపోతారు

వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల

రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి

నెల్లూరు(సెంట్రల్‌): తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్, జిల్లా పరిశీలకులు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో మాజీ కార్పొరేటర్‌ పిండి సురేష్‌ వైఎస్సార్‌సీపీలో చేరుతున్న సందర్భంగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో   ఆదివారం ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరుసిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ వేధింపులు, దుర్మార్గాలు సాగుతున్నాయన్నారు.  ఇటువంటి సమయంలో అధికార పార్టీని వదులుకుని ప్రతిపక్షపార్టీలో పిండి సురేష్‌ చేరడం అభినందించతగ్గ విషయం అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నారనిగుర్తు చేశారు.

ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజల కోసం పనిచేసే వారని, ఆర్భాటాలు, హంగులు కావాలనుకునే వారు పార్టీ నుంచి వెళ్లిపోయారన్నారు. నెల్లూరు అర్బన్, రూరల్‌ ఎమ్మెల్యేలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారని గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉండేందుకు పార్టీలో చేరుతున్న వారిని చూస్తుంటే ప్రతి ఒక్కరితో నూతనోత్తేజం వస్తుందన్నారు. కొద్ది నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయన్నారు.  చంద్రబాబు అబద్ధపు హామీలు, మోదీ, పవన్‌తో జత కట్టి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు.  ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు, వేల కోట్లు కుమ్మరించినా చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. తప్పకుండా అందరి ఆశీర్వాదాలతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తరువాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన సంక్షేమ మహాయజ్ఞాన్ని పూర్తి చేస్తారన్నారు. దీంతోనే తెలుగు వారి గుండెల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

మోసం చేశారు
నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. అక్కడ వైఎస్సార్‌సీపీ చక్రం తిప్పే వీలు ఉంటుందన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి గతంలో అవకాశం ఇస్తే అన్నివర్గాలను నట్టేట ముంచారని విమర్శించారు. వందల హామీలిచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. టీడీపీ అధినేత ప్రజాస్వామ్యాన్ని భుష్టుపట్టిస్తూ విలువల గురించి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసింది కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇవ్వడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు నాలుగు సంవత్సరాలు బీజేపీతో కాపురం చేసి ఇప్పుడు తమపై నెపం వేయాలని చూస్తుండటం దారుణమన్నారు. ప్రస్తుతం తన స్వార్థం కోసం సిగ్గులేకుండా కాంగ్రెస్‌తో జత కట్టారని విమర్శించారు. ప్రత్యేకహోదా వద్దు ప్యాకేజీ కావాలని చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. ఇప్పుడు మాట మార్చి హోదా పేరుతో దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఆనాడు ఎన్నో అపవాదులు వేశారని, అయితే ఆయన సీఎం అయిన తర్వాత ప్రజాసంక్షేమ పాలన సాగించారని గుర్తుచేశారు. ప్రస్తుతం అందరూ ఒక్కటిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కానీ జగన్‌ ఎంతో ధైర్యంగా ప్రజాసంకల్ప యాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని చెప్పారు. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. చంద్రబాబు నయవంచన పాలనకు రానున్న ఎన్నికల్లో బుద్ది చెప్పి వైఎస్‌ జగన్‌ను గెలిపించుకుందామన్నారు.

సీఎంను చేసుకుందాం
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరం సైనికుల్లా కష్టపడి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకుందామన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారం ఉందని భయపెడితే చేరికలు ఆగవన్నారు. సభ ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీ నాయకులు ఎన్నో అడ్డంకులు సృష్టించారని, పోలీసులపై ఒత్తిడి తెచ్చి భయపెట్టాలని చూడటం సిగ్గుచేటన్నారు. త్వరలోనే అందరికి గుణపాఠం చెప్పే రోజు వస్తుందన్నారు. పార్టీలో చేరిన ప్రతిఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ పిండి సురేష్‌ చేరికతో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. రూరల్‌ నియోజవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. నగరంలో మాత్రం రూ.కోట్లు ఉన్న వ్యక్తి తాను పోటీ చేస్తానని వస్తున్నారన్నారు. ఎన్ని రూ.కోట్లు కుమ్మరించినా ప్రజల ఆశీర్వాదం ఉండాలనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తెచ్చేందుకు అందరం కష్టపడదామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, ఫ్లోర్‌లీడర్‌ పి.రూప్‌కుమార్‌ యాదవ్, తాటి వెంకటేశ్వర్లు, బొబ్బల శ్రీనివాస్‌యాదవ్, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్‌లు, నాయకులు పాల్గొన్నారు. వడ్లమూడి సతీష్, గాధం మునిరాజశేఖర్, నారపనేని శ్రీనివాసులు, గాదిరాజు రమణయ్య, కమతం ప్రసాద్‌ తదితరులు పార్టీలో చేరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top