సీఎం దీక్ష... ప్రయాణికులకు శిక్ష

RTC Busses Delayed In East Godavari - Sakshi

ధర్మ పోరాట దీక్ష పేరుతో చంద్రబాబు హంగామా

స్వామికార్యంలో ఆర్టీసీ ముందస్తు సమాచారం లేకుండా జిల్లాలో నిలిపేసిన బస్సులు

విశాఖకు 350 బస్సుల తరలింపు బస్సుల్లేక  నరకం చూసిన ఏజెన్సీ వాసులు

గంటల తరబడి బస్సులు  రాక ఇబ్బందులు పడ్డ పల్లె, పట్టణ వాసులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: చిత్రంలో బారులు తీరిన ప్రయాణికులను చూశారా? బస్సు కోసం పడ్డ అవస్థలివి. రాజమహేంద్రవరంలోని కాకినాడ నాన్‌స్టాప్‌ కౌంటర్‌ వద్ద ప్రయాణికులు క్యూకట్టారు. ఉన్న అరకొర బస్సుల్లో టిక్కెట్‌ దొరుకుతుందో లేదోనని గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడ్డారు. సాధారణంగా ప్రతి 15నిమిషాలకు ఒక బస్సు ఉండేది. అలాంటిది మంగళవారం గంటైనా బస్సు దొరకని పరిస్థితి. సీఎం దీక్షకని ఎక్కువ బస్సులు వెళ్లిపోవడంతో తక్కువ సంఖ్యలో సర్వీసులు తిరగడం వల్ల సమయానికి గమ్యస్థానానికి చేరుకోక ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.

రాజవొమ్మంగి బస్టాప్‌లో కూడా ప్రయాణికులు ఈ విధంగా పడిగాపులు కాశారు. విశాఖలో ధర్మపోరాట దీక్ష పేరుతో చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారానికి ఆర్టీసీ బస్సులన్నీ పంపించడంతో ఇక్కడ సర్వీసులు రద్దయి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఏజెన్సీ మండలమని చూడకుండా.... ప్రత్యామ్నాయం ఉండదని తెలిసీ కూడా సీఎం పర్యటన పేరుతో బస్సులన్నీ తిప్పేయడంతో రాజవొమ్మంగి మండలం వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కిక్కిరిసిన ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి,  రిస్క్‌ ప్రయాణం చేశారు.

ఈ రెండు చోట్లే కాదు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఇదే పరిస్థితి నెలకొంది. ధర్మపోరాట దీక్ష పేరుతో సీఎం చేస్తున్న హంగామా కోసం జిల్లా నుంచి 350 ఆర్టీసీ బస్సులను తరలించారు. ఇందులో పల్లె వెలుగు బస్సులు 180 వరకు ఉన్నట్టు సమాచారం. సీఎం దీక్షకు దాదాపు 1,150 బస్సులు వినియోగించగా అందులో మన జిల్లాకు సంబంధించి 350 బస్సులుండటం విశేషం. జిల్లాలో ఉన్న సగం బస్సులు విశాఖకు తరలిపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఏజెన్సీకి వెళ్లే బస్సులు దాదాపు నిలిపేశారు. దీంతో పట్టణ, పల్లె ప్రాంత ప్రజలతో పాటు గిరిజనులు అత్యధికంగా ఇబ్బంది పడ్డారు.

ఆ మధ్య ప్రత్యేక హోదా కోసం విపక్షాలు బంద్‌ చేపడితే ఆర్టీసీకి రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని, బంద్‌లు శ్రేయస్కరం కాదని, బస్సులు నిలిపేయడం వల్ల ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారని, ప్రజలకు ఇబ్బందుల్లేకుండా నిరసనలు తెలియజేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఉద్బోధించారు. మరీ, ఇప్పుడాయన చేసిందేంటని ప్రజలు నిలదీస్తున్నారు. బంద్‌ తలపెడితే ముందుగా ప్రజలకు సమాచారం ఉంటుంది. ఆ రోజు బస్సులు, ఇతరత్రా సౌకర్యాలుండవని ప్రయాణికులు మానసికంగా సిద్ధమవుతారు. దీంతో పెద్దగా ఇబ్బంది పడ్డారని చెప్పడానికి ఉండదు. కానీ, ధర్మ పోరాట దీక్ష పేరుతో బస్సులు తరలించే విషయమై ముందస్తుగా ఎటువంటి ప్రకటనలు చేయలేదు.

కొంత అసౌకర్యం ఉంటుందని ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా అకస్మికంగా జిల్లాలో ఉన్న సగానికిపైగా బస్సులను విశాఖకు పంపించేయడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. రాజానగరం, ద్వారపూడికి సాధారణంగా రోజుకి 10 బస్సులు తిరుగుతాయి. కానీ, మంగళ వారం కేవలం రెండే బస్సులు నడిచాయి. పది బస్సుల రద్దీని రెండు బస్సులు తట్టుకోవడమంటే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ రెండు చోట్లే కాదు అడ్డతీగల, మారేడుమిల్లి, ఏలేశ్వరం, రాజవొమ్మంగి, రంపచోడవరం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే ప్రజలు మరింత ఇబ్బందులకు గురయ్యారు. అక్కడికెళ్లే బస్సులలో అత్యధికం నిలిపేయడంతో ప్రయాణికులు నరకం చూశారు. ప్రభుత్వాన్ని తిట్టుకున్నారు. తమను కష్టాలకు గురిచేసిన వారికి పుట్టగతులుండవని శాపనార్థాలు పెట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top