ఊరెళితే.. ఊడ్చేశారు..

బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు చోరీలు

42 కాసుల బంగారు వస్తువులు, రూ.1.10లక్షల నగదు అపహరణ

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్‌ : ‘‘ఇల్లు విడిచి ఊళ్లకు  వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ ఇంటికి సీపీ కెమెరాలు పెట్టి భద్రత కల్పిస్తాం’’ అంటూ అర్బన్‌ ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు మొత్తుకుంటున్నా ప్రజలు వినకపోవడంతో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రెండు ఇళ్లల్లో సుమారు 42 కాసుల బంగారపువస్తువులు, రూ,1.10 లక్షల నగదు చోరీకి గురైంది. పోలీసుల కథనం ప్ర కారం.. మోరంపూడి సాయిదీపికనగర్‌కు చెందిన శిరంశెట్టి తాతా రావు కుటుంబసభ్యులతో కలసి గతనెల 25న కృష్ణాజిల్లా పామ ర్రు వెళ్ళారు. శనివారం ఇంటికి తిరిగి వచ్చేసరికి 22 కాసుల విలువైన బంగారపు వస్తువులు, రూ.80వేలు నగదు చోరీకి గురయ్యాయి. తూర్పు రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న పట్టయ్య అపార్టుమెంట్‌లో నివసిస్తున్న సిద్ధా సింహాచలం అనంతపురంలో ఉద్యోగం చేస్తుంటాడు.

అతడి భార్య వరలక్ష్మి పిల్లలతో కలిసి అపార్టుమెంటులో ఉంటుంది. దసరా సెలవులకు వరలక్ష్మి పిల్లలతో కలిసి అనంతపురం వెళ్లింది. శనివారం ఉదయం ఇంటి తలుపులు తీసి ఉండడంతో ఎదురు ఫ్లాట్‌వారు సమాచారం అందించడం వరలక్ష్మి సోదరుడు పడాల రాజేష్‌ వచ్చి చూడగా బీరువాలోని 20 కాసుల విలువైన బంగారపు వస్తువులు, రూ.30వేల నగదు చోరీకి గురయ్యాయి. సంఘటన స్థలాన్ని పోలీసుఅధికారులు పరిశీలించగా, క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. శిరంశెట్టి సత్యనారాయణ, పడాల రాజేష్‌ల ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top