పోలీసుల పేరుతో దోపిడీ

పోలీసుల పేరుతో దోపిడీ - Sakshi


యువకుడి వద్ద సొత్తు లాక్కున్న కేసులో వీడిన మిస్టరీ

ఐదుగురు వ్యక్తులతోపాటు

ఓ గ్రూప్ డ్యాన్సర్ అరెస్టు

రూ.2 లక్షల విలువైన బంగారం స్వాధీనం


 

విజయవాడ : పోలీసుల పేరుతో బెదిరించి దోపిడీకి పాల్పడిన ఘటనలో కీలక సూత్రధారితోపాటు మరో నలుగురు వ్యక్తులు, హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను కొత్తపేట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారినుంచి రూ.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశ్చిమ ఏసీపీ రాఘవరావు ఈ వివరాలు తెలియజేశారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన చిట్టినాడి రాము(28) హైదరాబాద్‌లో సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. భీమవరానికే చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్పన్న మధు(26)పై అతడి కళ్లు పడ్డాడు.



మధు ద్వారా తన ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన మజ్జి పద్మ(25)తో కలిసి పథకం రూపొందించాడు. వితంతువైన పద్మకు కుమార్తె ఉంది. జీవనం కోసం టీవీ సీరియళ్లలో నటించడంతోపాటు సినిమాల్లో గ్రూప్ డ్యాన్సర్‌గా పనిచేస్తుంటుంది. రాము తన పథకాన్ని అమలు చేసే క్రమంలో అప్పుడప్పుడూ పద్మతో మధుకు ఫోన్ చేయిస్తుండేవాడు. ఇందులో భాగంగా ఈనెల ఆరోతేదీన తాను విజయవాడ వస్తున్నానని పద్మ మధుకు చెప్పింది. ఇద్దరూ నగరంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నగరానికి వచ్చిన తరువాత కొత్తూరు తాడేపల్లిలోని మామిడితోటలోకి వెళ్లారు. వీరిద్దరూ కలుసుకుంటున్న విషయాన్ని రాము నగర శివారు ప్రాంతాలకు చెందిన తన స్నేహితులకు చెప్పాడు. మధును బెదిరించి అతడి వద్ద సొమ్ము దోచుకోవాలని చెప్పాడు. మధు, పద్మ ఏకాంతంగా ఉన్న సమయంలో కొత్తూరు తాడేపల్లికి చెందిన అనుమోలు రాజేష్(26), జక్కంపూడికి చెందిన అంబటి సుబ్బారావు(26), షాబాద్‌కు చెందిన తోట సాయి దుర్గారావు అక్కడకు వచ్చారు. పోలీసులమని బెదిరించారు. ఈ ముఠాలో సభ్యుడైన అజిత్‌సింగ్‌నగర్ వాసి వెనిగెల శ్రీనివాసరావు(45) ఈ ముగ్గురితోపాటు అక్కడకు వచ్చి, తోటకు సమీపంలోనే తచ్చాడుతున్నాడు. ముఠా సభ్యులు మధును బెదిరిస్తున్న సమయంలో పద్మ కొద్ది దూరంలో ఉన్న శ్రీనివాసరావును చూపించి తన బాబాయి అని చెప్పింది. అతడి వద్దకు వెళుతున్నానని చెప్పి అక్కడినుంచి తప్పుకుంది. శ్రీనివాసరావుతో కలిసి అక్కడినుంచి జారుకుంది. దీంతో రాజేష్, సుబ్బారావు, సాయిదుర్గారావు కలిసి మధును బెదిరించి అతడి వద్ద ఉన్న ఎనిమిది కాసుల బంగారాన్ని దోచుకున్నారు. ఈ ఘటనపై బాధితుడు అదేరోజు రాత్రి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ రాఘవరావు తెలిపారు. వారి నుంచి రూ.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుల తరఫు బంధువులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. దోపిడీకి పాల్పడిన వారంతా జల్సాలకు అలవాటు పడి విచ్చలవిడిగా సొమ్ము ఖర్చు చేస్తుంటారని ఏసీపీ పేర్కొన్నారు. సమావేశంలో కొత్తపేట సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై శ్యామ్‌సుందర్, సిబ్బంది పాల్గొన్నారు.  

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top