ఇద్దర్ని బలిగొన్న లారీ


జంగారెడ్డిగూడెం రూరల్ : రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృత్యువు రూపంలో వచ్చిన లారీ ఇద్దరిని బలిగొంది. ఈ హృదయవిదారక ఘటన జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో గురువారం జరిగింది.  మంగిశెట్టిగూడెం నుంచి గురువారం బత్తుల రాంబాబు(30), ఆయన కూతురు వరుస అయిన కాకుళ్ల ప్రమీల (19) మోటార్‌సైకిల్‌పై ఖమ్మంజిల్లా దమ్మపేట మండలం కొరుసుగూడెం వెళ్తుండగా, తాడువాయి వద్ద ఎదురుగా వస్తున్న లారీ వీరిని ఢీకొట్టింది. లారీ వీరిద్దరి తలలపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మరణించారు. వారిద్దరి తలలు నుజ్జునుజ్జయ్యాయి. లారీ వేగంగా మోటార్‌సైకిల్‌పైకి దూసుకొచ్చిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మృతదేహాలను జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

 జీడితోటకు వెళ్తుండగా ప్రమాదం

 జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెంకు చెందిన బత్తుల రాంబాబుకు జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టిగూడెంకు చెందిన ధనలక్ష్మి( దండెమ్మ)తో వివాహమైంది. ధనలక్ష్మి గర్భిణి కావడంతో ప్రసవం కోసం ఇటీవల  పుట్టిల్లు మంగిశెట్టిగూడెంకు వచ్చింది. ఆమెకు వారం క్రితమే బాబు పుట్టి మృతిచెందాడు. ఈ నేపథ్యంలో ధనలక్ష్మి పుట్టింటివద్దే ఉంటోంది.

 

 రాంబాబు ఖమ్మంజిల్లా దమ్మపేట మండలం కొరుసుగూడెంలో జీడి తోటను సాగుచేస్తున్నాడు. భార్యనుచూసేందుకు మంగిశెట్టిగూడెం వచ్చి రాంబాబు తిరిగి జీడి తోటకు వెళ్తుండగా, ఆయనకు కూతురు వరుస అయిన కాకుళ్ల ప్రమీల కూడా ఆయనతో బయలుదేరింది. వీరిద్దరూ మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అసలే బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ధనలక్ష్మి ఇప్పుడు రాంబాబు  కూడా మరణించడంతో తీవ్రంగా రోదిస్తోంది.

 

 సెలవులు కావడంతో జీడి తోటకు వెళ్తూ..

 జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టిగూడెంకు చెందిన కాకుళ్ల శ్రీను కుమార్తె ప్రమీలను ఆమె పెద్దమ్మ, పెదనాన్న నాగయ్య, దుర్గమ్మ పెంచుకుంటున్నారు. ప్రమీల వేగవరం నోవా విద్యాసంస్థల్లో బీకాం మొదటి సంవత్సరం చదువుతూ ఇటీవలే పరీక్షలు రాసింది.  ప్రస్తుతం సెలవులు కావడంతో బాబాయ్ రాంబాబుతో ప్రమీల జీడితోటకు వెళ్లేందుకు పయనమైంది.రోడ్డుప్రమాదంలో మరణించింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. ప్రమీల తన దుస్తులతోపాటు తినుబండారాలను కూడా వెంటపెట్టుకుంది. ఘటనా స్థలంలో ఇవన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top