ఉలికి పాటు!

Road Accidents in Anantapur - Sakshi

వెల్దుర్తి ప్రమాదం గుణపాఠం నేర్పేనా?

జిల్లాలోనూ తరచూ రోడ్డు ప్రమాదాలు

నిలువరించలేకపోతున్న పోలీసులు

కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద తుఫాన్‌ వాహనాన్ని ఓల్వో బస్సు ఢీకొన్న ప్రమాదంలో 16 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. జిల్లాలో గుంతకల్లు పట్టణంలో నిశ్చాతార్థ వేడుకలకు హాజరై తిరిగి తెలంగాణలోని గద్వాలకు వెళ్తుండగా వెల్దుర్థి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన జిల్లా యంత్రాంగానికి కూడా గుణపాఠంగా మారబోతోంది. జిల్లాలో తరుచూ రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గడిచిన వారం రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందగా... 32 మంది క్షతగాత్రులుగా మారినట్లు ఎస్పీ అశోక్‌కుమార్‌ అధికారికంగా ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో రోడ్డు ప్రమాదాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.  

అనంతపురం సెంట్రల్‌: వెల్దుర్తి రోడ్డు ప్రమాదం తరహాలో అనంతపురం జిల్లాలో గతంలో అనేక ఘటనలు జరిగాయి. గతేడాది ఆగస్టు 24న రొద్ద మండలం సత్తారుపల్లి వద్ద రెండు గూడ్సు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఎల్‌.తిమ్మాపురం, లక్షానుపల్లి గ్రామాలకు చెందిన పది మంది మృతి చెందారు. మూడేళ్ల క్రితం పెనుకొండ మండలం మడకశిర ఘాట్‌రోడ్డులో గొర్రెలఫాం వద్ద ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు లోయలో పడిన ఘటనలో ఏకంగా 15 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులుగా మిగిలిన వారు నేటికీ అచేతనావస్థలో ఉన్నారు. ఈ నెల రెండో తేదీన బుక్కరాయసముద్రం మండలం బి.కొత్తపల్లి వద్ద పోలీసు హైవే పెట్రోలింగ్‌ వాహనం అడ్డురావడంతో తప్పించబోయి అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్డు ప్రమాదాలు జిల్లాలో అనేకం చోటు చేసుకున్నాయి.

ప్రముఖులు సైతం..
ప్రముఖులను సైతం రోడ్డు ప్రమాదాలు పొట్టన పెట్టుకున్నాయి. రెండేళ్ల క్రితం పామిడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జేఎన్‌టీయూ వీసీ సర్కార్‌ మృతి దుర్మరణం చెందారు. గత నెలలో గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్‌ విష్ణువర్దన్‌రెడ్డి మరణించారు. గతేడాది నగర శివారులోని శిల్పారామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మెప్మా అధికారి కృష్ణమూర్తి మృతి చెందగా, మున్సిపల్‌ అదనపు కమిషనర్‌ తీవ్రంగా గాయపడ్డారు. మూడేళ్ల క్రితం వడియంపేట జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో అదనపు జాయింట్‌ కలెక్టర్‌ చెన్నకేశవులు ప్రాణాలు కోల్పోయారు.  
రాష్ట్ర, జాతీయ రహదారుల్లో వేగ నియంత్రణ చేయడం పోలీసులకు సాధ్యం కాకపోవడం వలనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.  కనీసం 100 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు నిబంధనలపై ప్రజల్లో అవగాహన కొరవడింది. రోడ్డు ప్రమాదాల రూపంలో సగటున ఏటా 600 మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 1500 మంది పైచిలుకు మంది వికలాంగులుగా తయారవుతున్నారు. ఈ లెక్కలు పోలీసుశాఖ అధికారులు అధికారికంగా చెబుతున్నవే. గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు చాలామటుకు పరిగణనలోకి రావడం లేదు. దీన్ని బట్టి చూస్తే బాధిత కుటుంబాలు ఎంత క్షోభను అనుభవిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.  

కొరవడుతున్న అవగాహన
రోడ్డు ప్రమాదాల నిలువరించడంలో పోలీసులు, రోడ్డు రవాణా అధికారులు విఫలమవుతున్నారు. రోడ్లు భవనాల శాఖ, నేషనల్‌హైవే ఇంజినీర్ల లోపాలు కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. సుదీర్ఘ వైశాల్యమున్న జిల్లాలో మూడు జాతీయ రహదారులు, మూడు రాష్ట్రీయ రహదారులు, పలు గ్రామీణ రోడ్లు ఉన్నాయి. వందల కిలోమీటర్ల పొడువున అనేక పట్టణాలు, గ్రామాలను కలుపుకొని ఇతర జిల్లాలు, రాష్టాలకు వెళ్తున్నాయి. ముఖ్యంగా అత్యంత పొడవైన జాతీయ రహదారి 44 జిల్లాలో గుత్తి నుంచి పెనుకొండ వరకు వెళ్తోంది. ఈ రహదారుల గుండా వేలాది మంది వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే రోడ్డు నిర్మాణాల్లో లోపాలు, రోడ్డు నిబంధనలపై వాహనదారులకు అవగాహన లేకపోవడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top