ఘోర రోడ్డు ప్రమాదం

road accident in East Godavari district - Sakshi

టిప్పరు–ఆటో ఢీ 

నలుగురి మృతి

తొమ్మిదిమందికి గాయాలు 

రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు వారివి. అయినా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలనే తపనతో రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలల్లో చేర్పించి అప్పుడప్పుడు వారిని పలకరించి సరదాగా గడిపి వస్తుంటారు. ఎప్పటిలానే విద్యార్థుల తల్లిదండ్రులంతా కలసి ఆటోలో బయలుదేరగా మార్గం మధ్యలోని వారిని విధి చిదిమేసింది. కన్న పేగుల దరికి చేరకుండానే టిప్పర్‌ రూపంలో ఎదురుగా వచ్చిన మృత్యు శకటం నలుగురిని బలితీసుకుంది.  కత్తిపూడి జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఈ ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. బెండపూడికి చెందిన నలుగురు మృత్యు వాతపడగా మరో తొమ్మిది మంది తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో భార్యాభర్తలు ఘటనా స్థలంలోనే కన్నుమూయడం కలచివేసింది. వసతి గృహంలో చదువుకుంటున్న పిల్లలకు ఈ విషయం తెలిసి కన్నీరుమున్నీరయ్యారు. శుక్రవారం వేకువ జామున చింతూరు వద్ద జరిగిన వ్యాన్‌ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన మరవక ముందే ఈ విషాద వార్త జిల్లా వాసులను కలచివేసింది. 

కత్తిపూడి (రౌతులపూడి): కత్తిపూడిలో 16 నెంబరు జాతీయ రహదారిలోని స్థానిక పెట్రోల్‌బంకు సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు మృతిచెందగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న అన్నవరం ఎస్సై కె.పార్థసార«థి ఘటనా స్థలానికి తన సిబ్బందితో వచ్చి ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం తుని, ప్రత్తిపాడు ఏరియా ఆస్పత్రులకు అంబులెన్సుపై తరలించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. 

తొండంగి మండలం బెండపూడి గ్రామానికి చెందిన పదమూడు మంది ప్రయాణికులు జగ్గంపేటలోని రెసిడెన్షియల్‌ హాస్టలో చదువుతున్న తమ పిల్లలను చూడడానికి శనివారం ఆటోపై బయలుదేరారు. కత్తిపూడి పెట్రోల్‌బంకు సమీపంలో అకస్మాత్తుగా ఎడమవైపు మట్టిరోడ్డు నుంచి జాతీయ రహదారి ఎక్కుతున్న క్వారీ టిప్పర్‌ రాజమహేంద్రవరంవైపు సరైన మార్గంలో వెళ్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. 

ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ నేలపాటి శ్రీను (35), అతని భార్య నేలపాటి నాగవేణి (32) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన 11 మందిలో మాచర్ల లోవ, బొద్దా చంద్రశేఖర్, బొద్దా నాగమణి, మాచర్ల సింహాచలం, బత్తిన సుభాషిణిలను 108 ఎన్‌హెచ్‌ 5 అంబులెన్స్‌పై మెరుగైన వైద్యం కోసం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చెక్కా సూర్యకాంతం, చెక్కా వెంకటరమణ, బులిపే అప్పారావు, బులిపే భవాని, నేలపాటి సందీప్‌ (క్రిష్‌)లను ప్రత్తిపాడు ఏరియా ఆస్పత్రికి అంబులెన్సుపై మెరుగైన చికిత్స కోసం తరలించారు.  బొద్దా సంధ్య అనే చిన్నారికి స్థానిక ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. 

తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందిన మాచర్ల లోవ (35) చికిత్స పొందుతూ మృతిచెందగా మిగిలిన నలుగురిలో బొద్దా చంద్రశేఖర్, బొద్దా నాగమణి, మాచర్ల సింహాచలం, బత్తిన సుభాషిణిలను అక్కడ వైద్యుల సూచనలు మేరకు తుని నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వీరిలో బొద్ద చంద్రశేఖర్‌ (45) అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. నేలపాటి శ్రీను, అతని భార్య నాగమణిల మృతదేహాలను ప్రత్తిపాడు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. అలాగే తునిలో చికిత్స పొందుతూ మృతిచెందిన మాచర్ల లోవ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం తమ బంధువులకు అందజేశారు. ఎస్సై పార్థసారథి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఉలిక్కిపడ్డ కత్తిపూడి
జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంతో కత్తిపూడి గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాద స్థలంలో నుజ్జయిన ఆటో పక్కనే చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు, తీవ్రగాయాలతో ఉన్న క్షతగ్రాత్రులను చూసి ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మార్మోగింది. ఈ ప్రమాదంతో బంధువులు, స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

పిల్లలను పలకరిద్దామని పై లోకానికి..
తొండంగి (తుని): రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు వారివి. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలల్లో చదివిస్తున్న తమ పిల్లల్ని పలకరించేందుకు వెళ్లిన వారు మార్గం మధ్యలోనే తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. శనివారం కత్తిపూడి జాతీయరహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో బెండపూడికి చెందిన నలుగురు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. వీరంతా బెండపూడి గ్రామం కొత్త హరిజనపేటకు చెందిన వారు. బంధువుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నేలపాటి శ్రీనివాస్, నాగవేణిలకు సురేఖ, కమల్‌ సందీప్‌లు సంతానం. శ్రీనివాస్‌ పాసింజర్‌ ఆటోను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమార్తెను జగ్గంపేట ఏపీ రెసిడెన్షియల్‌ వసతి గృహంలో పదో తరగతి చదివిస్తున్నారు.

 సందీప్‌ కత్తిపూడి సమీపంలో రిఫరల్‌ స్కూల్‌లో చదువుతున్నాడు. భార్య నాగమణితో కలిసి శ్రీనివాస్, కుమారుడు సందీప్‌లు కలిసి ముగ్గురూ ఆటోలో సురేఖను చూసేందుకు వెళ్లగా, వీరితోపాటు మాచర్ల సుబ్బారావు భార్య లోవకుమారి (మృతురాలు) తన కుమార్తె రాణి జగ్గంపేటలోనే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దీంతో లోవకుమారి కూడా శ్రీనివాస్‌ ఆటోలోనే బయలుదేరింది. వారి పిల్లలకు ఇష్టమైన తినుబండారాలు తయారు చేసి వారితో తీసుకువెళ్లారు. లోవకుమారి తోడికోడలు మాచర్ల సింహాచలం కూడా చిన్న కుమార్తె వేణు ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుండటంతో ఆమె కూడా ఇదే ఆటోలో బయలుదేరింది. అలాగే చంద్రశేఖర్‌తోపాటు అతని భార్య నాగమణి, చిన్న కుమార్తె సంజన కలిసి పెద్ద కుమార్తె ప్రియాంకను చూసేందుకు బయలుదేరారు.

 ఇక చెక్కా వెంకటరమణ, సూర్యకాంతం, బులిపే అప్పారావు, బులిపే భవాని, బత్తిన సుభాషిణి కూడా తమ కుమార్తెలను పలకిరించేందుకు అదే ఆటోలో బయలుదేరారు. ఈ 13 మంది ఆటోలో బెండపూడి నుంచి బయలుదేరారు. శనివారం నాటి ఘటనలో గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతులు, క్షతగాత్రుల రోదనలతో గ్రామం శోక సంద్రమైంది. కాగా మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు తమకు ఆర్థిక సాయం అందించాలని సంఘటన స్థలం వద్ద ఆందోళన చేశారు. దీంతో బెండపూడి గ్రామపెద్దల సమక్షంలో మృతులు ఒకొక్కరికీ రూ.5లక్షల చొప్పున చెల్లించేందుకు, క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చులు భరించేందుకు సంస్థ యాజమాన్యం గ్రామపెద్దలకు హామీఇచ్చారు.

కొడుకూ, కోడలు దూరమైపోయారు..
పోషిస్తాడనుకున్న ఒక్కగానొక్క కొడుకూ, కోడలిని తమకు లేకుండా భగవంతుడు దూరం చేసాడని శ్రీనివాస్‌ తండ్రి కామేశ్వరరావు, తల్లి సింహాచలం రోదిస్తున్న తీరు చూపరులను కంట తడిపెట్టించింది. 

తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోయి..
శ్రీనివాస్, నాగవేణి ఆటో ప్రమాదంలో ఒకేసారి మృతి చెందడంతో కుమార్తె సురేఖ, సందీప్‌ తల్లిదండ్రులను కోల్పోయారు. నన్ను చూసేందుకు బయలుదేరి తిరిగి రానిలోకాలకు పోయారా అంటూ సురేఖ తీవ్రంగా ఏడుస్తుంటే చూసే వారి గుండె తరుక్కుపోయింది. తల్లిదండ్రులు దూరమైన నాకు తోడుగా ఉన్నావను కుంటే నువ్వుకూడా వెళ్లిపోయావా అక్కా అంటూ నాగవేణి చెల్లి అపర్ణ తీవ్రంగా బాధపడింది. ఇతర కుటుంబసభ్యులంతా సంఘటనా çస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. 

ఎమ్మెల్యే దాడిశెట్టి పరామర్శ..
రోడ్డు ప్రమాద ఘటనపై తుని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విచారం వ్యక్తంచేశారు. విశాఖపట్నంలో ఉన్న తనకు పార్టీనాయకులు సమాచారం అందించారన్నారు. పేదవర్గాలకు చెందిన మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేందుకు 
కృషిచేస్తామన్నారు.

క్షతగాత్రులకు ప్రత్తిపాడులో చికిత్స

విషణ్ణవదనాలతో మృతుల బంధువులు
కుటుంబాలకు ఆర్డీఓ పరామర్శ

ప్రత్తిపాడు: కత్తిపూడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రుల్లో ఐదుగురిని చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు. తొండంగి మండలం బెండపూడికి చెందిన క్షతగాత్రులు బులిపే భవాని, చెక్కా సూర్యకాంతం, నేలపాటి కమల్‌ సందీప్, చెక్కా వెంకటరమణ, బులిపే అప్పారావులకు సీహెచ్‌సీ వైద్యాధికారిణి విజయ చికిత్స అందించారు. మృతి చెందిన ఆటో డ్రైవర్‌ నేలపాటి శ్రీను, నాగవేణి దంపతుల మృతదేహాలను సాయంత్రం శవపరీక్షకై ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు. పెద్దాపురం ఆర్డీఓ వి.విశ్వేశ్వరరావు మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి, జరిగిన సంఘటనపై ఆరా తీశారు. డీఎస్పీ చిలకా వెంకట రామారావు, ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు, తహసీల్దార్‌ కె.నాగమల్లేశ్వరరావు, అన్నవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం ఎస్సైలు పార్థసారధి, ఎం.అశోక్, అప్పలనాయుడు 
తదితరులున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top