ఆ ఓటర్లు 18 ఏళ్లు నిండినవారే..

RO Jayalaxmi Inquiry on TDP Leaders Allegations - Sakshi

సంగాంలో మైనర్ల ఓట్లు పడ్డాయని టీడీపీ నేత ఆరోపణ

వివరాలు కోరిన జిల్లా కలెక్టర్‌

విచారణలో అంతా మేజర్లేనని గుర్తించిన ఆర్‌ఓ

శ్రీకాకుళం, రాజాం/వంగర: వంగర మండలం సంగాంలో ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌పై బుధవారం రాజాం నియోజకవర్గ ఎన్నికల అధికారి జి.జయదేవి దర్యాప్తు చేశారు. ఈ గ్రామంలో 43, 44 పోలింగ్‌ కేంద్రాల్లో 25 మంది మైనర్లు ఓటు వేశారని, ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేత బొడ్రోతు శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్‌కు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌ రాజాం ఎన్నికల అధికారికి ఈ తంతుపై పరిశీలనలు జరపాలని ఆదేశించగా, ఆర్‌ఓతోపాటు వంగర మండల రెవెన్యూ అధికారులు, పోలింగ్‌ నిర్వహించిన పీఓలు ఓటర్ల వివరాలపై ఆరా తీశారు. ఫిర్యాదులో పేర్కొన్న 25 మంది ఓటర్ల వివరాలతోపాటు ఆధార్, రేషన్, పదోతరగతి ధ్రువీకరణ పత్రాలు వంటివి పరిశీలించగా వీరంతా 18 ఏళ్లు నిండినవారని తేలింది. ఈమేరకు వారు ఓటు హక్కు పొందిన సమయంలో దరఖాస్తు చేసుకున్న ధ్రువీకరణ పత్రాలతోపాటు ఓటు వేసేందుకు వచ్చిన సమయంలో తీసుకొచ్చిన ఆధార్, ఓటరు ఐడీ కార్డులను కూడా నెట్‌లో పరిశీలించినట్లు ఆర్‌ఓ తెలిపారు. అనంతరం రాజాం  తహశీల్దార్‌ కార్యాలయంలో మరో మారు పరిశీలనలు జరిపి వీరంతా 18 ఏళ్లు నిండిన ఓటర్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు నివేదికలు తయారుచేసి జిల్లా అధికారులుకు అందిస్తున్నామని అన్నారు.

అత్యుత్సాహంతోనే..
పోలింగ్‌ జరిగి ఐదురోజులు గడిచిన తరువాత సంగాంలో ఓటింగ్‌పై ఆ  పంచాయతీకి చెందిన టీడీపీ నేత మైనర్‌ ఓటర్లు ఓటు వేశారని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంపట్ల గ్రామస్తులతోపాటు మండలానికి చెందిన పలువురు సీనియర్‌ సిటిజన్‌లు మండిపడుతున్నారు.
సంగాం గ్రామంలో గతంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలకు వీలుండేది కాదని, ఏ వర్గానికి చెందిన పెద్ద వ్యక్తి ఆ వర్గానికి చెందిన ఓట్లు మొత్తం వాళ్లే వేసుకునేవారని గ్రామస్తులు తెలిపారు.
ఈ దఫా ఎన్నికల్లో అలా కాకుండా ప్రతీ ఓటరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లు చేసినా ఇలా ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు ఇలా ఫిర్యాదులు చేస్తున్నారని కూడా ప్రజలు బాహాటంగానే మండిపడుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top