కేసు కావాలా..ఇసుక కావాలా..

Revenue Department Panchayat On Sieged Sand - Sakshi

సీజ్‌ చేసిన ఇసుకపై రెవెన్యూ అధికారుల ప్రైవేట్‌ పంచాయితీ

ఇసుక తరలింపులో మరో కోణం

రెవెన్యూ అధికారుల ఇళ్ల నిర్మాణానికి ఇసుక తరలింపు

ఆవేదన వ్యక్తం చేస్తున్న ట్రాక్టర్ల యజమానులు

బొబ్బిలి: పై చిత్రంలో ఇసుకను చూపిస్తున్న వ్యక్తి పేరు రాంబార్కి రామారావు. ఇతనిది గొల్లపల్లి. ట్రాక్టర్‌ను నడపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈనెల 23న దాడితల్లి కాలనీ, నాయుడు కాలనీలకు చెందిన మరో రెండు ట్రాక్టర్లతో బాడంగి మండలం హరిజనపాల్తేరులోని ఇసుక రేవు నుంచి ఇసుక తీసుకువస్తున్నారు. ఈ మూడు ట్రాక్టర్లను బొబ్బిలి మండలం అలజంగి చెట్టు (జంక్షన్‌) వద్ద రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఇసుకను, ట్రాక్టర్లనూ సీజ్‌ చేస్తున్నామంటూ బొబ్బిలి తరలించారు. అక్కడే అసలు కథ మారింది. కేసుల మాట పక్కన బెట్టి ట్రాక్టర్ల యజమానులతో రెవెన్యూ అధికారులు పంచాయితీ పెట్టారు. కేసు రాస్తే మీకు రూ.10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు అవుతుంది.

ఎందుకీ బాధ? ఇసుకను మా వాళ్లు ఇళ్లు కట్టుకుంటున్న చోట అన్‌లోడ్‌ చేసి వెళ్లిపోండి... అని ఓ అధికారి ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో ఇసుకను తీసుకెళ్లి సాహితీనగర్‌లోని ఇంటి నిర్మాణం జరుపుకుంటున్న చోట అన్‌లోడ్‌ చేసి వెళ్లిపోయారు. ఈ సెటిల్మెంట్‌ అంతా ఆర్‌ఐలు, డీటీల సమక్షంలోనే జరిగిందని, తాము కష్టపడి లోడ్‌ చేసి తీసుకువెళ్తున్న ఇసుకను అన్యాయంగా ఇలా అన్‌లోడ్‌ చేయించారని బాధితుడు రామారావు చెబుతున్నారు. ఇది రాజకీయంగా జరిగిందా లేక అధికారుల ఆదేశాలతోనే జరిగిందా అన్న విషయాలను వెలికితీయాలని ట్రాక్టర్ల యజమానులు కోరుతున్నారు.

ఇతర అవసరాలకు..
వాస్తవానికి సీజ్‌ చేసిన ఇసుకను ప్రభుత్వ భవన నిర్మాణాలకు వినియోగించాల్సి ఉన్నప్పటికీ.. ఇక్కడి రెవెన్యూ అధికారులు తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఇసుక తరలింపును అడ్డుకోవద్దని ఇసుక ఉచితమనీ కలెక్టర్‌తో పాటు గనుల శాఖ సహాయ సంచాలకులు ప్రకటిస్తున్నా ట్రాక్టర్ల యజమానులకు వేధింపులు తప్పడం లేదు. జిల్లాలో ఇసుక ఉచితమైనా కేసుల పేరిట దౌర్జన్యాలు నడుస్తున్నాయి.

అవసరాలుంటే ఇసుక రీచ్‌ లేకున్నా తరలించొచ్చు
గతంలో ఇసుక రీచ్‌ల వద్దే ఇసుకను పట్టుకోవాలన్న ఆదేశాలుండేవి. కానీ అవసరాలు ఎక్కువ కావడంతో ఆ నిబంధనను సడలించారు. అయినప్పటకి ఇసుక ట్రాక్టర్ల యజమానులపై బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 62 ఇసుక రీచ్‌లు ఉండగా సుమారు 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక  లభ్యమవుతోంది. గతేడాది అనుమతి లేని  ఇసుక రీచ్‌ల నుంచి తరలించిన ఇసుకను పలు చోట్ల సీజ్‌ చేశారు. ఆయా ఇసుక నిల్వలను ప్రభుత్వ భవనాల నిర్మాణానికి తరలించాలని ఆదేశాలున్నా ఎక్కడో తప్ప అటువంటి ప్రక్రియ అమలు కావడం లేదు. మరి ఇసుకను ఏం చేశారో అధికారులకే తెలియాలి.

డీటీ ఇంటి వద్ద వేయించారు..
బొబ్బిలి డిప్యూటీ తహసీల్దార్‌ నిర్మిస్తున్న ఇంటి వద్ద ఇసుక వేయించారు. లేకుంటే కేసు అవుతుందని, ఇది మీకు ఇబ్బందవుతుందనీ మరో డీటీ చెప్పారు. గత్యంతరం లేక ఇసుకను వేశాం. ఇది అన్యాయం. ఎందుకిలా మాతో ఆడుకుంటున్నారో అర్థం కావడం లేదు.– రాంబార్కి రామారావు, ట్రాక్టర్‌ యజమాని, గొల్లపల్లి

 చర్యలు తీసుకోవాలి..
జిల్లాలో ఇసుక రవాణా అంతా ఉచితం. సీజ్‌ చేసే విధానమే లేదు. ఎక్కడయినా వాల్టాకు నష్టం కలిగించే రీతిలో పెద్ద ఎత్తున నిల్వలుంటేనే సీజ్‌ చేయాలి. ఇప్పటికే సీనరేజీలను లక్ష్యాల మేరకు వసూలు చేశాం.   రీచ్‌ లేకపోయినా అవసరాలను బట్టి ఇసుక తరలించుకోవచు.–ఎస్‌కేవీ సత్యనారాయణ, ఏడీ, మైన్స్‌ అండ్‌ జియాలజీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top