ఇంటింటికీ నవోదయం

Ravali Jagan Kavali Jagan in Kurnool - Sakshi

ఐదు విడతల్లో కొనసాగనున్న కార్యక్రమం

మొదటి విడతలో 50 బూత్‌ల్లో వైఎస్సార్‌సీపీ ప్రచారం

నవరత్నాలతో కలిగే లాభాలను ప్రజలకు వివరించనున్న నేతలు

టీడీపీ అవినీతి, అక్రమాలపై ప్రజలను చైతన్య పరచడమే లక్ష్యం

నేటి నుంచి రావాలి జగన్‌..కావాలి జగన్‌

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పిలుపు మేరకు.. ప్రజలను చైతన్య పరిచేందుకు ‘రావాలి జగన్, కావాలి జగన్‌’ అనే కార్యక్రమానికి నేటి(సోమవారం) నుంచి ఆ పార్టీ నేతలు శ్రీకారం చుట్టనున్నారు. నవరత్నాల పథకాలతో కలిగే లాభాలను ఇంటింటికీ తిరిగి వివరించనున్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు పోలింగ్‌ బూత్‌ల్లో కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. బూత్‌లో ఉండే ప్రతి కుటుంబంతో వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.  

ప్రతి ఇంటికీ నవరత్నాలు చేరడమే లక్ష్యం...
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు.. ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గ్రామదర్శిని పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రావాలి జగన్, కావాలి జగన్‌ కార్యక్రమంతో నవరత్నాల పథకాలతో కలిగే లబ్ధిని ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఐదు విడతలుగా సెప్టెంబర్‌ 17 నుంచి 2019 జనవరి వరకు కొనసాగిస్తారు. మొత్తం ఐదు విడతల్లో నిర్వహణకు పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో విడతలో 50 అసెంబ్లీ పోలింగు బూత్‌ల్లో కార్యక్రమం కొనసాగుతుంది. ఆ లెక్కన ఐదు విడతల్లో అసెంబ్లీ నియోజకవర్గంలోఉండే 200 నుంచి 250 బూత్‌ల్లోని ప్రతి కుటుంబాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సందర్శిస్తారు.   

14 నియోజకవర్గాల్లో నిర్వహణకు సిద్ధం...
జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రావాలి జగన్, కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తలు ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు. వారంలో ఐదు రోజులపాటు కార్యక్రమం కొనసాగుతుంది. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ సమన్వయ కర్తలు, ప్రధాన కార్యదర్శులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొనాలని ఆదేశాలు వచ్చాయి.   

నవ రత్నాలతో ఇదీ లబ్ధి...
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవరత్నాలతో ఒక్కో కుటుంబానికి ఏడాదికి కనీసం రూ. లక్షల నుంచి 5 లక్షల వరకు లబ్ధి లభించనున్నది.  
వైఎస్‌ఆర్‌ రైతు భరోసాలో ప్రతి సంవత్సరం ఒక్కో కుటుంబం రూ.12,500 నుంచి రూ.లక్ష వరకు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది. ఇందులో పెట్టుబడి కోసం వచ్చే రూ.50 వేలలో ప్రతి యేడు మేలో రూ.12500తోపాటు ఉచిత బోర్లు, ఉచిత విద్యుత్, సున్నా వడ్డీకే రుణాలు, ట్రాక్టర్ల రోడ్‌ ట్యాక్స్‌ ఎత్తివేతలతో లబ్ధి లక్షల రూపాయల్లోకి వెళ్లిపోతోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో భాగంగా ప్రతి విద్యార్థికి రూ. లక్ష నుంచి 1.50 లక్షల వరకు(ఫీజు ఎంతైతే అంతా)తోపాటు మెస్‌ చార్జీల కోసం రూ.20 వేలను ఇస్తారు.  
మెడికల్‌ బిల్లు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తారు. సంవత్సరానికి రూ.లక్ష నుంచి 10 లక్షల వరకు రోగికి అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. దీనితోపాటు కిడ్నీ రోగులకు ఏడాదికి రూ.10 వేలు పెన్షన్‌ ఇస్తే సుమారు 1.20 లక్షలు లబ్ధి వస్తుంది.
జలయజ్ఞంతో వచ్చే ఫలాలు లక్షలాది రైతుకుటుంబాలకు వెలకట్టలేని లబ్ధిగా మిగులుతుంది.
మద్యపాన నిషేధం లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషాన్ని నింపుతుంది.
అమ్మ ఒడిలో పిల్లలను బడికి పంపితే  ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తారు.  
వైఎస్సార్‌ చేయూతలో నాలుగేళ్లలో రూ.75 వేలు 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు లబ్ధిచేకూరుతుంది.  
వైఎస్‌ఆర్‌ ఆసరాతో ఎన్నికల రోజు వరకు అక్కాచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇవ్వడంతో పాటు సున్నా, పావలా వడ్డీకే రుణాలు ఇప్పిస్తుండడంతో ప్రతి మహిళకు ఏడాదికి రూ.50వేల వరకు లబ్ధి చేకూరనున్నది.  
పేదలందరికీ ఇళ్లు పథకంలో వినియోగించుకుంటే రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది.
పింఛన్ల పెంపులో సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి రూ.24 వేల నుంచి 45 వేలు లబ్ధి చూకుతుంది (ఇంట్లో ఇద్దరు లబ్ధి దారులు ఉంటే).

ప్రజలను చైతన్యంచేయడానికే
రావాలి జగన్, కావాలి జగన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. నవరత్నాల పథకాలతో కలిగే లబ్ధితోపాటు టీడీపీ అవినీతి, అక్రమాలు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరచడమే లక్ష్యం. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఓట్లు వేస్తే నవరత్నాలతో లక్షల రూపాయల లబ్ధిని పొందరలేరని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. – బీవై రామయ్య, వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top