ఆదుకో అన్నా..!

Rajam People Sharing Their Problems to YS jagan - Sakshi

జగనన్నకు వినతుల వెల్లువ

కష్టాలు చెప్పుకున్ననిరుపేదలు

శ్రీకాకుళం :కష్టాలు చెప్పుకున్నారు.. కన్నీళ్లుపెట్టుకున్నారు.. మీరే ఆదుకోవాలంటూ మొరపెట్టుకున్నారు.. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలంటూ నాలుగున్నరేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం జరిగిన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.
– ప్రజా సంకల్పయాత్ర బృందం

అధికార పార్టీవారికే ఇళ్లు
రాజాం మున్సిపాల్టీలోని డోలపేట పెద్ద వీధిలో అధికార పార్టీ వారికే ఇళ్లు మంజూరు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 100 మంది ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకుంటే వారిలో అధికార పార్టీకి చెందిన 15 మందికి మాత్రమే ఇళ్లు మంజూరు చేశారు. మిగతా వారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారని తిరస్కరించారు. ప్రస్తుతం పక్కా ఇళ్లు లేక అవస్థలు పడుతున్నాం.
– డోల వెంకటరమణ,డోలపేట, రాజాం మండలం

కక్షసాధింపు చర్యలు
మా కుమారుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నాడని పొగిరి గ్రామపంచాయతీ ప్రజా ప్రతినిధులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడంటూ పోలీస్‌స్టేషన్‌లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. మా కుమారుడు ఇబ్బందులు పడుతున్నాడు. ఆదుకోవాలయ్యా        – పొదిరి పార్వతి, పొగిరి గ్రామం, రాజాం మండలం

65 ఏళ్లుదాటినా పింఛన్‌ లేదు..
అయ్యా మా  ముసలోడికి 65 ఏళ్లుపైనే. రెండు సంవత్సరాల క్రితం పాము కరవడంతో ప్రస్తుతం మంచానికే పరిమితం అయ్యాడు. పింఛన్‌ కోసం గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.  –  గొట్టపు ఆదెమ్మ,అంతకాపల్లి, రాజాం మండలం

డబ్బులిస్తేనే ఉద్యోగం..
అయ్యా.. డబ్బులిస్తేనే రాజాం మున్సిపాల్టీలో పారిశుద్ధ్య కార్మిక ఉద్యో గం ఇస్తున్నారు. పదేళ్లుగా మున్సిపాల్టీలో పారి శుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రస్తుత పాలకులు డబ్బులు తీసుకుని కొందరికి ఉద్యోగాలు ఇచ్చి విధుల్లో ఉన్న మమ్మల్ని తొలగించా రు. ప్రస్తుతం జీవనాధారం లేక రోడ్డున పడ్డాం.
– సిరిపురం అనసూయమ్మ, ఎస్సీకాలనీ, మెంటిపేట, రాజాం మండలం

పింఛన్‌ లేక పాట్లు
నా కుమార్తె లోలు గు ఉమామహేశ్వరి(16) పుట్టుక నుంచి దివ్యాంగురాలు. మూగ,చెవుడు అంగవైకల్యంతో బాధపడుతోంది. కుమార్తెకు ఇంత వరకు పింఛన్‌ మంజూరు కాలేదు. నా కుమారుడు లోలుగు గణేష్‌ డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగ అవకాశం రాలేదు. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత మా సమస్యలు తీర్చాలి.– లోలుగు చిన్నమ్మడు,పొగిరి గ్రామం, రాజాం మండలం.

ఉపాధి కోల్పోయాం..
అన్నా.. మా కాలనీలో 30 మంది విద్యార్థులున్న పాఠశాలను ప్రభుత్వం ఎత్తివేసింది. పాఠశాలను గ్రామంలో ఉన్న బడిలో కలిపివేయడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మధ్యాహ్న భోజన వంట నిర్వాహకురాలిగా పనిచేశాను. పాఠశాల ఎత్తివేయడంతో ఉపాధి కోల్పోయాను.–  గెడ్డాపు నాగమణి,వి.ఆర్‌.అగ్రహారం, రాజాం మండలం

పింఛన్‌ మంజూరు కానివ్వడం లేదు
ఏడాదిన్నర నుంచి బోధకాలు వ్యాధితో బాధపడుతున్నాను. ఆరోగ్యం సహకరించకపోవడంతో కూలి పనులకు వెళ్లలేకపోతున్నాను. నా భర్త పారంనాయుడు వ్యవసాయ పనుల ద్వారా తెచ్చిన కూలి డబ్బులతో ముగ్గురు పిల్లలు, మేము జీవనం సాగించాల్సి వస్తోంది. నాకు పింఛన్‌ మంజూరు చేయడానికి టీడీపీ నేతలు నిరాకరిస్తున్నారు. పెన్షన్‌ మంజూరయ్యేలా ఆదుకోవాలన్నా.
– చిత్తిరి విజయలక్ష్మి,పొగిరి గ్రామం, రాజాం మండలం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top