చినుకమ్మా.. ఒక్కసారి వచ్చిపోవే!

Rainfall Down In PSR Nellore - Sakshi

మేఘాల దోబూచులాట

అడుగంటుతున్న భూగర్భ జలాలు

మూడేళ్లుగా సాధారణ వర్షపాతమే

ఆకాశం మేఘావృతమై ఉంటుంది.  వారం రోజులుగా కరి మేఘాలను చూసి వర్షాలు పడతాయని ఆశగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. మేఘాలు మాత్రం చినుకు చిందించకుండా మాయమై పోతున్నాయి.  మేఘాలు కూడా పడమటి గాలులకు ఆవిరైపోతున్నాయి. దీంతో వర్షాలుకురవడం లేదు. రుతుపవనాలు, బంగాళాఖాతంలోఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పక్క రాష్ట్రాలు, జిల్లాల్లో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. జిల్లాలో మాత్రం చిన్నపాటి జల్లులతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. వారం రోజులుగా జిల్లాలో 4 ఎంఎం వర్షపాతం నమోదైంది. జిల్లాలో విస్తారంగావర్షాలు కురిసి మూడేళ్లు అవుతోంది.

నెల్లూరు(పొగతోట): జిల్లాలో గతేడాది సగటున 182.5 మి.మీ. వర్షం కురిసింది. ప్రస్తుతం 88.6 మి.మీ. వర్షపాతం మత్రమే నమోదైంది. 51 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. సాగు విస్తీర్ణం కుడా 44 వేల హెక్టార్లకు పడిపోయింది. మూడేళ్ల నుంచి వర్షపాతం తక్కువగా నమోదు అవుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. 100 అడుగుల లోతులో నీరు వచ్చే బోర్లల్లో రెండు వందల అడుగులు తవ్విన నీరు అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడనం ఏర్పడిన దాని వల్ల కేరళ, కర్ణాటక, ఒడిశాలో అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో 2015లో అధిక వర్షాలు కురిశాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చెన్నైకు సమీపంలో అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారితే జిల్లాకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉంది.

తీరం వెంబడి పవర్‌ ప్రాజెక్ట్‌లు అధికంగా నిర్మించారు. దాంతో పాటు వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. దీని ప్రభావం వల్ల ఆకాశం మేఘావృతమైన వర్షాలు కురవడం లేదు. కొద్దిపాటి జల్లులు కురిసినా వాటి వల్ల ప్రయోజనం ఉండడంలేదు. జిల్లాలో 3,400లకు పైగా చెరువులు ఉన్నాయి. చెరువులు, ఒకటి రెండు మినహా అధిక శాతం చెరువులు, కుంటలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. నల్లటి మేఘాలు వస్తే వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. జిల్లాలో సోమశిల ప్రాజెక్ట్, కండలేరు జలశయం అందుబాటులో ఉన్నాయి. గతేడాది జిల్లాకు ఎగువ జిల్లాల్లో కురిసిన వర్షాలకు జలశయాల్లో నీరు చేరింది. దీంతో ఆ నీటితో గత సీజన్‌లో పంటలు పండించారు. ఈ సంవత్సరం కూడా వర్షాలు తక్కువగా ఉన్నాయి. వర్షాలు కురవకపోతే ఎగువ నుంచి వచ్చే నీటి కోసం జిల్లా రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. వర్షాలు లేకపోవడంతో గతేడాది సాగు విస్తీర్ణం తగ్గించారు. ఈ సంవత్సరం కూడా  అదే పరిస్థితి వస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉంది. వర్షాలు కురిస్తే అధికారులతో పని లేకుండా ప్రజలు పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంది. వర్షాలు తక్కువగా పడితే రైతులు అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది.

పడమటి గాలులతో పరారు
రుతుపవనాలు, అల్పపీడన ప్రభావం వల్ల ఏర్పడిన మేఘాలు పడమటి గాలుల దెబ్బకు పరారైపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 40 రోజులపై నుంచి పడమటి గాలులు వీస్తున్నాయి. గాలులతోపాటు ఉష్ణాగ్రతలు కూడా అధికంగా ఉండడంతో మేఘాలు వర్షించకుండానే ఆవిరైపోతున్నాయి. పడమటి గాలులతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top