వారిని బాబు సర్కార్‌ గాలికొదిలేసింది: రఘవీరా

వారిని బాబు సర్కార్‌ గాలికొదిలేసింది: రఘవీరా


హైదరాబాద్‌సిటీ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. కౌలు రైతులను చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ఠ్రంలో 5 లక్షల హెక్టార్ల వరిసాగు తగ్గిందని ఆరోపించారు. నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. వారం లోపల రైతు సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే సోమవారం నుంచి  జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసనలు చేపడతామని హెచ్చరించారు.రాజధానిలో మొదలైన కబ్జాలు ఇప్పుడు రాష్ట్రం అంతా విస్తరించాయన్నారు. విశాఖలో వేల కోట్ల రూపాయల భూములను సీఎం కుమారుడు లోకేష్‌, మంత్రులు దొచుకుంటున్నారని ఆరోపించారు. హుద్హుద్‌ తుఫాన్ లో కొట్టుకు పోయిన భూముల డాక్యుమెంట్స్ ను టీడీపీ నేతలు తమ అక్రమాలకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఒక్క విశాఖలోనే రూ.లక్ష కోట్ల భూకుంభకోణం జరిగిందని, సిట్ ను రెండు గ్రామాల స్కామ్ కు పరిమిత చేస్తూ.. కేసు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. సిట్ తో జరిగేది శూన్యమన్నారు. హైకోర్టు పర్యవేక్షణ లో సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలని లేదంటే సీబీఐతో విచారణ చేయించాలని అడిగారు. విశాఖ కలెక్టర్ పై సీఎం వత్తిడి చేస్తున్నారని, చినబాబు జ్యోక్యంతో కలెక్టర్ స్వేచ్చగా వ్యవహరించలేక పోతున్నారని చెప్పారు. మా దగ్గర ఉన్న ఆధారాలను రేపు కలెక్టర్ కు ఇస్తామని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. విశాఖ బ్రాండ్  ఇమేజ్ ను  తండ్రీ కుమారులు, పాతర వేస్తున్నారని ఆరోపించారు.

Back to Top