చిత్తూరు బిడ్డను... నీ అంతు చూస్తా..!

Pulivarthi Nani Fired on Dalit Leader In Chittoor - Sakshi

అవిలాలలో పులివర్తి నాని వీరంగం

దళిత నేతపై దాడికి యత్నం

తేల్చుకుందాం అంటూ తిరగబడ్డ దళిత నేత

భయాందోళనకు గురైన స్థానిక మహిళలు

పోలీస్‌స్టేషన్‌ ఎదుటే ఘటన

‘ నేను చిత్తూరు బిడ్డను...నీ అంతు చూస్తా. నాకే అడ్డువస్తారా? ఏమనుకుంటున్నారు..నేను ఎంతవరకైనా పోతాను.  ఏమైనా చేస్తాను.’ అంటూ ఊగిపోతు కారు డాష్‌బోర్డును బద్దలు కొడుతూ ఓ నాయకుడు అర్ధరాత్రి వీరంగం వేశారు. నిన్న మొన్నటి దాక అనుచరులు దౌర్జన్యాలకు దిగితే నేడు నేరుగా ఆయనే రంగంలోకి దిగారు. భీతావహం సృష్టించారు. ఇంతకు ఈ నేత ఎవరా అని ఆలోచిస్తున్నారా? చిత్తూరు నుంచి చంద్రగిరికి దిగుమతి అయిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని. గురువారం రాత్రి తిరుపతి రూరల్‌ మండలం అవిలాలలో ఓ దళిత నేతపై ఆయన వేసిన వీరంగాన్ని చూసిన మహిళలు భీతిల్లిపోయారు.

చిత్తూరు , తిరుపతి రూరల్‌: చంద్రగిరి టీడీపీ ఇన్‌చార్జ్‌ పులివర్తినాని మరోమారు తన ప్రవృత్తిని చాటుకున్నారు. దళితనేతపై దౌర్జన్యానికి దిగారు. వివరాలిలా... తిరుపతి రూరల్‌ మండలం అవిలాల పంచాయతీకి చెందిన హరినాథ్‌ వైఎస్సార్‌సీపీ నాయకుడుగా ఉన్నారు. రకరకాల ప్రలోభాలు పెట్టడంలో దిట్టలైన టీడీపీ నాయకులు ఈయనకు కూడా గాలం వేశారు. రెండు రోజుల క్రితం టీడీపీ కండువా వేశాడు. అయితే  బలవంతంగా కండువా వేశారని తనను ఆరా తీసిన వైఎస్సార్‌సీపీ నాయకులకు హరినాథ్‌ సమాధానం చెప్పారు.  వైఎస్సార్‌సీపీలోనే కొనసాగటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పటంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమక్షంలో గురువారం సాయంత్రం తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు.

విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని స్వయంగా హరినాథ్‌ ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉండటాన్ని చూసి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకుడు శ్రీరాములతో హరినాథ్‌ మాట్లాడుతున్నారు. అయితే అక్కడికి చేరుకున్న నాని, హరినాథ్‌ను తన వెంట రావాలంటూ హుకుం జారీ చేయటంతో మంచి పద్దతి కాదంటూ శ్రీరాములు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నాని రెచ్చిపోయారు. తాను కూర్చుని ఉన్న కారు డాష్‌ బోర్డును బద్దలు కొడుతూ‘‘ చిత్తూరు బిడ్డను నేను, నీ అంతు చూస్తా...ఎంత వరకైన పోతాను..అంటూ దళిత నేత శ్రీరాములుపైకి దూసుకెళ్లారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ఎక్కడ నుంచో దిగుమతి అయి ఇక్కడ అల్లర్లు సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోమని శ్రీరాములు కూడా సమాధానం ఇచ్చారు. మీ రౌడియిజం చిత్తూరులో నడుస్తుందేమో కాని చంద్రగిరిలో కుదరదని తేల్చిచెప్పారు. దీంతో కొద్ది ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత నాని అరుపులు, కేకలు విని స్థానిక మహిళలు భితిల్లారు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. పోలిసులు రావటంతో ఇరువర్గాలు వెనుదిరిగారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top