జననేతకు బ్రహ్మరథం

public support to YS Jagan's Praja Sankalpa Yatra  - Sakshi

కర్నూలు జిల్లాలో ముగిసిన ప్రజాసంకల్ప యాత్ర

అవ్వాతాతల దీవెనలు.. అక్కాచెల్లెళ్ల మంగళహారతులు.. యువత కేరింతలు.. అలసిన పాదాలకు ఊరూరా ముద్దబంతుల పాన్పులు.. అన్నొస్తున్నాడు.. అంటూ పిల్లా పాపలు మొదలు అన్ని వర్గాల ప్రజలు జననేతకు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర సాగిన రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల దూరం నుంచి జనం భారీగా తరలి వచ్చారు. దారిపొడవునా జనమే జనం.. మిద్దెలు, మేడలు కిక్కిరిసిపోయాయి.   కేరింతలతో యువత..మా రాజన్న బిడ్డే అంటూ అవ్వా తాతలు, అడిగో అన్న  అంటూ అక్కా చెల్లెళ్లు జగన్‌ వద్దకు వెళ్లి కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. కూలీలు, రైతులు పనులు మానేసి మరీ గంటల తరబడి తమ అభిమాన నేత కోసం వేచి చూసి ఆత్మీయతను చాటుకున్నారు. చిరునవ్వుతో మాట కలుపుతూ.. కరచాలనం చేస్తూ.. అందరికీ అండగా ఉంటానని భరోసా కల్పిస్తూ జగన్‌ ముందుకు సాగారు.  

సాక్షి ప్రతినిధి, కర్నూలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు కర్నూలు జిల్లాలో అడుగడుగునా జనం నీరాజనం పలికారు. అధికార తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, అవినీతిని ఎదుర్కొనేందుకు కదనరంగమై జగన్‌తో పాటు లక్షలాది అడుగులు ముందుకు సాగాయి. ప్రతి చోటా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమస్యలను నివేదించారు. ప్రజలు చెప్పే సమస్యలను జగన్‌ సావధానంగా వింటూ... వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. జిల్లాలో నవంబరు 14వ తేదీ మొదలైన పాదయాత్ర డిసెంబరు 3వ తేదీ వరకూ సాగింది. మొత్తం 18 రోజుల పాటు సాగిన పాదయాత్రలో జిల్లాలోని 7 నియోజకవర్గాలు, 14 మండలాల్లోని 66 గ్రామాల్లో మొత్తం 263 కిలోమీటర్ల మేర జగన్‌ పాదయాత్ర చేశారు. వైఎస్సార్‌ జిల్లా నుంచి కర్నూలు జిల్లాలోకి చాగలమర్రి మండలం వద్ద పాదయాత్ర ప్రవేశించింది. చాగలమర్రి మండలం గొడిగనూరు గ్రామం వద్ద పాదయాత్ర 100 కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పూలతో ముగ్గులు వేసి ప్రజలు స్వాగతం పలికారు. 200 కిలోమీటర్ల పాదయాత్ర బేతంచర్ల మండంలోని ముద్దవరం గ్రామం వద్ద పూర్తి అయ్యింది. ఇందుకు గుర్తుగా మొక్కను నాటి నీరు పోశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం బి.అగ్రహారం వద్ద 300 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. ఈ సందర్భంగా జగన్‌ మొక్కను నాటారు.   

ఆ కూడళ్లు.. జన సంద్రాలే..  
బేతంచర్ల, వెల్దుర్తి, కోడుమూరులో సాగిన పాదయాత్ర సందర్భంగా ఆ పక్కనే వెళ్తున్న లారీలు, ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులంతా కేరింతలు కొట్టారు. కిటీకీల్లోంచి చేతులు, తలలూ బయటపెట్టి ‘అన్నా...’ అంటూ కేకలేశారు. జగన్‌ వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. కోడుమూరులో బండెనక బండికట్టి రైతులు ఘన స్వాగతం పలికారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ట్రాక్టర్‌లో మహిళలు కిక్కిరిసి కూర్చొని మరీ అభిమాన నేతను చూసేందుకు వచ్చారు. జగన్‌ను చూడ్డంతోనే ఒక్కసారిగా ఆనందంతో ఊగిపోయారు. కరచాలనం కోసం అక్కడి నుంచి పోటీపడ్డారు. పత్తికొండ నియోజకవర్గంలో సాగిన యాత్రలో వృద్ధులు.. ఇతరుల సాయంతో జగన్‌ను చూసేందుకు తరలి వచ్చారు. పత్తికొండ మొదలు.. బసినేపల్లి వరకు రహదారులన్నీ బంతి పూలతో పచ్చగా మారాయనడం అతిశయోక్తి కాదు. గ్రామ గ్రామాన జనం స్వచ్ఛందంగా ఆత్మీయ స్వాగతం పలికారు.  

అన్ని వర్గాలకు చేరువ... 
ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వారితో ముఖాముఖితో పాటు సదస్సులను నిర్వహించారు. ప్రధానంగా మహిళలు, బీసీలు, రైతులు, ఉపాధి కూలీలు, క్వారీ కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా గిట్టుబాటు ధర లేదని, రుణమాఫీ కాలేదని, ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని, నీరు ఇవ్వడం లేదని రైతులు జగన్‌ దృష్టికి  తీసుకువచ్చారు. అదేవిధంగా టీడీపీ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తోందని పలు బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. నాలుగు నెలలుగా కూలి డబ్బులు ఇవ్వలేదని ఉపాధి కూలీలు జగన్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సమస్యలకు పరిష్కారాలు చూపడంతో పాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశాన్ని కూడా జగన్‌ వారికి వివరిస్తూ ముందుకు కదిలారు.

 నవంబర్‌ 14న చాగలమర్రిలోని ముత్యాలపాడు బస్టాండ్‌లో, 15న ఆళ్లగడ్డలో సభకు జనం భారీగా తరలివచ్చారు. 19న బనగానపల్లెలో, 21న బేతంచెర్ల బస్టాండ్‌ సర్కిల్‌లో జరిగిన సభలు ఇసుక వేస్తే రాలనంతగా జనసంద్రంగా మారాయి.  28వ తేదీన గోనెగండ్లలో, 30న ఆస్పరి మండలంలోని బిల్లేకల్‌లో, డిసెంబరు 1వ తేదీన పత్తికొండలో నిర్వహించిన సభలకు జనం పోటెత్తారు. ఈ సభల్లో జగన్‌ ప్రసంగం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. నవంబర్‌ 14న చాగలమర్రి మండలం గొడిగనూరులో, 15న పెద్దకోట కందుకూరు, 21న బేతంచర్ల మండలం కొలుములపల్లి, 22న ముద్దవరం, పెండేకల్‌ గ్రామాలు, 26న కృష్ణగిరి మండలం ఎర్రగుడి, వెంకటగిరి గ్రామాలు, 27న కోడుమూరు మండలం వర్కూరు ఎస్సీ కాలనీలో, 30న ఆస్పరి మండలం కైరుప్పల గ్రామాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాలను జగన్‌ ఆవిష్కరించారు.  

అనేక సమస్యలు.. పరిష్కారాలు.. 
పాదయాత్ర సందర్భంగా జగన్‌ ముందు అనేక మంది పలు సమస్యలను ప్రస్తావించారు. ప్రధానంగా పింఛన్లు రావడం లేదని, ఇళ్లు లేవని, రేషన్‌కార్డులు లేవని పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని, రుణమాఫీ కాలేదని, ఇన్‌పుట్‌ సబ్సిడీ రాలేదని, నకిలీ విత్తనాలు వస్తున్నాయని రైతులు నివేదించారు. తమ రుణాలు మాఫీ కాలేదని, బ్యాంకులు అప్పులు కట్టాలని ఒత్తిళ్లు తెస్తున్నాయని డ్వాక్రా మహిళలు వాపోయారు. సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలని  రైతులు విన్నవించారు. ఈ సందర్భంగా జగన్‌ పలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హంద్రీ–నీవా నుంచి దద్దనాల చెరువుకు నీరందిస్తామని, విద్యుత్‌ చార్జీలు, రాయల్టీ పెంపు వల్ల మూతపడ్డ క్వారీ పరిశ్రమలను ఆదుకోవడంతో పాటు వీధిన పడ్డ కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. నాపరాయి పరిశ్రమకు విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని స్పష్టం చేశారు. 

డోన్‌ను మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని, గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ప్రతీ రైతుకు పెట్టుబడి కింద ఏటా రూ.12,500 అందజేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు ఏకంగా రూ.3 వేల పింఛను ఇస్తామని స్పష్టం చేశారు. మొత్తం మీద జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గుండ్రేవులతో పాటు రాజోలి, జొలదరసి రిజర్వాయర్లను నిర్మిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇబ్బందిగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని (సీపీసీ)ని రద్దు చేస్తానని స్పష్టీకరించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు తిరిగి రాజన్న రాజ్యం కోసం జగన్‌ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ జిల్లా ఎన్నటికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పెట్టని కోట అని చాటిచెప్పడానికి సిద్ధమని స్పష్టీకరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top