నిరసన జ్వాల

PSR Nellore YSRCP Leaders Protests Against Attck On YS jagan - Sakshi

జననేత జగన్‌పై హత్యాయత్నం భద్రతా వైఫల్యమే!

ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో రక్షణ లేదా?

డీజీపీ ప్రకటనపై విమర్శల వెల్లువ

మంత్రుల వ్యాఖ్యలపైనా మండిపాటు

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు

సూళ్లూరుపేట, గూడూరులో పార్టీ నేతల అరెస్ట్‌

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  విశాఖలో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం, ఈ ఘటన తర్వాత డీజీపీ, మంత్రుల వ్యాఖ్యలపై జిల్లాలో నిరసనలు పెల్లుబికాయి. వైఎస్సార్‌సీపీ అధినేతకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజకీయ పక్షాలతో పాటు సామాన్య ప్రజలు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతకే భద్రత లేకపోతే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని, హత్నాయత్నం వెనుక ఉన్న కుట్రదారుల పేర్లు బహిర్గతం చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్నాయత్నం జరిగిందన్న సమాచారంతో జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలు ధరంచి నిరసనలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండట గట్టారు. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. జగన్‌ త్వరగా కోలుకోవాలని దేవాలయాల్లో జగన్‌ ఆరోగ్యంగా ఉండాలని కొబ్బరి కాయులు కొట్టి మొక్కుకున్నారు.  

కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పట్టణంలోని ట్రంకురోడ్డులో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి, ఆనంతరం ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి గ్రామ దేవత కలుగోళశాంభవి అమ్మవారి దేవస్థానంలో 1001 కొబ్బరి కాయులు కొట్టి జగన్‌ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. జగన్‌పై దాడికి సీఎం చంద్రబాబునాయుడు నైతిక బా«ధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతకే భద్రత కల్పించలేకపోవటం సిగ్గు మాలిన చర్య అని ధ్వజమెత్తారు.

సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో నాయుడుపేట పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి, వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు పలువుర్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగిలిన మండలాల్లో పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి నేతృత్వంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించని ప్రభుత్వం ఉండటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు.  
నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్నాయత్నం ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో సీబీఐ విచారణ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.  
కోవూరులో పార్టీ రాష్ట్ర ప్రధాన కారదర్శి, సమన్వయకర్త నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నిరసన ర్యాలీ నిర్వహించి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నిరసన తెలిపారు. చంద్రబాబునాయుడు సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గూడూరులో పార్టీ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ నేతృత్వంలో క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో బైఠాయించి రాస్తారాకో చేశారు. ఈ సందర్భంగా మేరిగ మురళీతో పాటు పార్టీ నేత ఎల్లసిరి గోపాలరెడ్డిని మరికొంత మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
నెల్లూరు నగరంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్‌ నేతృత్వంలో గాంధీబొమ్మ సెంటర్‌ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. రూప్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ దాడిని ఖండిచాల్సిన మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సిగ్గు మాలిన చర్య అని విమర్శించారు. ప్రజల దివెనలు ఉన్నంత వరకు జగన్‌పై ఎన్ని కుట్రలు చేసినా ఆయనకు ఏమీ కాదని చెప్పారు.
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపు మేరకు ఆత్మకూరు పట్టణంతో పాటు అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
వెంకటగిరి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త ఆనం రామనారాయణరెడ్డి పిలుపుమేరకు వెంకటగిరి పట్టణంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న దివంతగత వైఎస్సార్‌ విగ్రహం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మిగిలిన మండలాల్లోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.
ఉదయగిరి నియోజవకవర్గం పార్టీ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖరరెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఉదయగిరితో పాటు మిగిలిన చోట్ల మానవహారాలు, నిరసన ర్యాలీలు నిర్వహించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top