బాధితుల కులమతాలను మార్చేస్తారా?

Protest on forehead case - Sakshi

ఇది శిరోముండనం నిందితులను కాపాడే ఎత్తుగడ

అమలాపురంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ర్యాలీ, నిరసన

అమలాపురం టౌన్‌: శిరోముండనం కేసులో నిందితులను కాపాడే ఎత్తుగడతో కేసును కొత్త మలుపు తిప్పుతూ బాధితుల కుల మాతాలను మార్చేస్తారా? అంటూ ప్రజా సంఘాల ఐక్య వేదిక ప్రశ్నిస్తూ అమలాపురంలో గురువారం సాయంత్రం నిరసన చేపట్టింది. పలు ప్రజా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో స్థానిక గడియారం స్తంభం సెంటరు నుంచి బుద్ధవిహార్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. శిరోముండనం కేసు తుది తీర్పునకు వస్తున్న సమయంలో.. కేసు 21 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిగి.. ఇప్పుడు నిందితులను కాపాడేందుకు ఈ కేసులోని బాధితులు అసలు ఎస్సీలే కాదని.. బీసీలని తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్నారని ఐక్య ప్రజాసంఘాల ప్రతినిధులు ఆరోపించారు. ఆ ఆరోపణలను అధికారులు క్షేత్ర స్థాయిలో విచారించకుండా నిందితుల ప్రలోభాలకు లొంగిపోయి బీసీలుగా తప్పుడు నివేదిక ఇస్తున్నారని దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్‌ కొంకి రాజామణి ధ్వజమెత్తారు.

జిల్లాలో 18 ప్రజా సంఘాల నాయకులు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి ఆ ఆధారాలు, ఆరోపణలు నకిలీవని వారి బాగోతం బయట పెట్టామని ఆమె స్పష్టం చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన రామచంద్రపురం ఆర్డీవో, ఎమ్మార్వోలను సస్పెండ్‌ చేయాలని, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను ఆ పదవి నుంచి తొలగించాలని ర్యాలీలో ప్రజా సంఘాల ప్రతినిధులు నినాదాలు చేశారు. తీర్పు ఏ విధంగా వచ్చినా అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిను రూపాందించామని రాజామణి అన్నారు. ఈ ర్యాలీలో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల్ల మనోహర్, ఉపాధ్యక్షుడు అమలదాసు బాబూరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావు, పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దీపాటి శివప్రసాద్, రైతు కూలీ సంఘం నాయకుడు మచ్చా నాగయ్య, మమత స్వచ్ఛంద సేవా సంస్థ నాయకుడు కోరుకొండ జాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top