భీమవరానికి తృటిలో తప్పిన ముప్పు

Protection measures In Bhimavaram West Godavari - Sakshi

యువకుల అప్రమత్తతతో గట్టు రక్షణ చర్యలు

భీమవరం టౌన్‌: భీమవరం పట్టణానికి తృటిలో పెద్ద జలగండం తప్పింది. రెస్ట్‌హౌస్‌ రోడ్డు శివారు జలవనరుల శాఖ కార్యాలయానికి అత్యంత సమీపంలో, వీఎస్‌కే డిగ్రీ కళాశాల ఎదురుగా యనమదుర్రు డ్రెయిన్‌పై ఏళ్ల తరబడి నిర్మాణంలోనే ఉన్న వంతెన కింద గట్టు డొల్లతనం గురువారం రాత్రి బయటపడింది. ఆ ప్రాంతమంతా తుప్పలు, పొదలతో నిండి ఉండడంతో అక్కడ గట్టు పరిస్థితి బయటకు కనిపించడంలేదు. అక్కడి నుంచి నీరు నెమ్మదిగా రోడ్డుపైకి వస్తుండడాన్ని స్థానిక యువకులు గుర్తించారు. అధికారులకు సమాచారం అందించినా జాప్యం జరుగుతుండడంతో కోరాడ కళ్యాణ్,కొప్పర్తి శ్రీను, మరో 30 మంది యువకులు ధైర్యంగా చీకట్లోనే సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో తుప్పలు, పొదలను తొలగించారు.

ఇదే సమయంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముదనూరి సూర్యనారాయణరాజు అక్కడికి వచ్చారు. జేసీబీతో పూర్తిగా తుప్పలు తొలగించగా అక్కడ గట్టు బాగా పల్లంగా ఉండడంతో దాన్నితాకుతూ యనమదుర్రులో నీరు ప్రవహిస్తు నెమ్మదిగా రోడ్డుపైకి చేరుతున్నాయి. పరిస్థితి గ్రహించిన యువకులు అప్పటికప్పుడు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. దాన్ని కూడా తాకుతూ డ్రెయిన్‌లో నీరు ప్రవహిస్తుండడంతో సర్వేబాదులు, వెదురుతడికలతో అడ్డుకట్టను మరింత ఎత్తు పెంచే పనులు చేపట్టారు. రాత్రి 9 గంటలకు కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు. వారి అప్రమత్తతతో పట్టణానికి పెద్దముప్పే తప్పింది. అధికారులు తక్షణం ఆ గట్టును పటిష్ట పర్చకపోతే ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top