ఏకపక్షంగా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌

ఏకపక్షంగా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌

- అందరి మద్దతు ఎన్డీయే అభ్యర్థి కోవింద్‌కే..

కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం కరువు

మధ్యాహ్నం 2 గంటలకే 100 శాతం పోలింగ్‌ నమోదు

ఓటు హక్కు వినియోగించుకున్న 174 మంది ఎమ్మెల్యేలు

మురిగిపోయిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లు?

 

సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఎన్నికలు రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిశాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యేలందరూ సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 174 మంది ఓటు వేశారు. రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ, వైఎస్సార్‌సీపీ, బీజేపీలు మూడూ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కే మద్దతు ప్రకటించడంతో పోలింగ్‌ పూర్తి ఏకపక్షంగా సాగింది. తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగా ఓటు వేశారు.జగన్‌ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలసి ప్రత్యేక బస్సులో అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ఒకేసారి ఎక్కువమంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెండు కంపార్టుమెంట్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఐఏఎస్‌ అధికారి కౌల్‌దార్‌ పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ తరఫున పోలింగ్‌ ఏజెంట్లుగా పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ), మంత్రి కాల్వ శ్రీనివాసులు (టీడీపీ) పోలింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని సంగతి తెలిసిం దే. పోలింగ్‌కు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నప్పటికీ మధ్యాహ్నం 2 గంట ల్లోపే అందరు ఎమ్మెల్యేలతో పాటు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇక్కడే తమ ఓటుహక్కు వినియోగించుకున్నా రు. నిర్ణీత గడువుకంటే ముందుగానే వంద శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల రిట ర్నింగ్‌ అధికారి సత్యనారాయణ తెలిపారు. 

 

రెండు చెల్లని ఓట్లు..?

తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బ్యాలెట్‌ పేపరులో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరు ఎదురుగా ఒకటి అంకె వేయడంతో పాటు తమ పేర్లు కూడా రాసినట్లు తెలిసింది. దీంతో ఆ రెండు ఓట్లు చెల్లకుండా పోయాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బ్యాలట్‌ పేపరులో తమ పేర్లు రాశారని తెలిసి పార్టీ అధినేత చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పలుమార్లు మాక్‌ పోలింగ్‌ నిర్వహించినా అలా ఎందుకు చేశారని చంద్రబాబు ప్రశ్నించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
Back to Top