అరుదైన ఘట్టం దిశగా.. జననేత అడుగులు

Praja Sankalpa Yatra Starts In Anandapuram Visakhapatnam - Sakshi

రెండు రోజుల్లో 3వేల కి.మీ. మైలురాయి చేరుకోనున్నసంకల్పయాత్ర

విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఆ అద్భుత ఘట్టం

ఒక మహోన్నతాశయం.. ఒక మహా సంకల్పం కలిసి.. ఒక మహోజ్వల ఘట్టం వైపు అడుగులు వేస్తున్నాయి.. మరో రెండు రోజుల్లో ఆవిష్కృతం కానున్న ఆ అద్భుతం వైపు జననేత వైఎస్‌ జగన్‌ అడుగులు వడివడిగా సాగనున్నాయి. భారీ వర్షాల కారణంగా రద్దయిన ప్రజాసంకల్పయాత్ర శనివారం నుంచి యథాతథంగా జరగనుంది. జిల్లాలో జననేత పాదయాత్ర చివరి అంకానికి చేరినప్పటికీ.. అత్యంత అరుదైన 3వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకునే అరుదైన ఘటన పేరుకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంటున్నప్పటికీ.. ఆ ప్రాంతం విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోదే కావడం.. జిల్లా ప్రజలకు గర్వకారణం. అందుకనే ఆ అరుదైన క్షణాల కోసం కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర మరో చారిత్రక ఘట్టం వైపు వడివడిగా దూసుకెళ్తోంది. జిల్లాలోని 11 నియోజకవర్గాలు దాటిన పాదయాత్ర.. గత వారం రోజులుగా భీమిలి నియోజకవర్గంలో అప్రతిహతంగా సాగుతోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో 40 కిలోమీటర్ల మేర పూర్తయిన పాదయాత్ర జిల్లా దాటే సమయానికి 50 కిలోమీటర్ల మార్కు అధిగమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మండుటెండలోనూ.. జోరువానలోనూ ప్రజలు సంకల్పధీరుడికి బ్రహ్మరథం పడుతున్నారు. అభిమాన వర్షం కురిపిస్తూ పూలదారులు పరిచి నడిపిస్తున్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలో జననేతకు లభిస్తున్న ప్రజాదరణ అధికార టీడీపీలో వణుకు పుట్టిస్తోంది.

నేటి నుంచి యథాతథం
వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీవర్షాల కారణంగా గురువారం రద్దయిన పాదయాత్ర.. శనివారం మళ్లీ యధాతథంగా కొనసాగనుంది. భీమిలి నియోజకవర్గంలో జననేత అడుగుపెట్టింది మొదలు ప్రతి రోజు వర్షం కురుస్తూనే ఉంది. ఒకటి రెండ్రోజులైతే  కుండపోత వర్షమే కురిసింది. అయినా లెక్కచేయక జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రను కొనసాగించారు. ఆనందపురం మండలంలోని దాదాపు 90 శాతం పల్లెలను ఆయన స్పృశించారు. ఆత్మీయత పంచారు. భరోసా నింపారు.  కొండ ప్రాంతాలు.. ఇరుకుదారులను సైతం పట్టిం చుకోకుండా పల్లెల్లో గుండా సాగుతున్న ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి అప్రతిహతంగా సాగుతున్న పాదయాత్ర మరో రెండు రోజుల్లో విజయనగరం జిల్లాలో అడుగుపెట్టనుంది. విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గంలో చారిత్రక అడుగులు పడబోతున్నాయి.

కొత్తవలస సమీపంలో బహుశా చరిత్రలోనే మొదటిసారి 3వేల కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించడం ద్వారా అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించనున్నారు. సోమవారం విశాఖ జిల్లా దాటి విజయనగరంలో అడుగుపెట్టబోతున్న జననేత వెంట జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులు, ప్రజలు వేలాదిగా కదంతొక్కేందుకు, 3వేల కిలోమీటర్ల చారిత్రక ఘట్టంలో భాగస్వాములయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

నేడు పాదయాత్ర సాగనుందిలా..
267వ రోజు పాదయాత్ర ఆనందపురం మండల పరిధిలోని పల్లెల మీదుగా సాగనుంది. శనివారం ఉదయం ఏడున్నర గంటలకు పప్పల వానిపాలెం శివారు నుంచి  ప్రారంభం కానున్న పాదయాత్ర కోలవానిపాలెం క్రాస్, భీమేంద్రపాలెం, యర్రవానిపాలెం క్రాస్‌ రామవరం మీదుగా గండిగుండం క్రాస్‌ వరకు సాగుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top