శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి

Power generation at Srisailam Project - Sakshi

దిగువకు భారీగా నీటిని తరలిస్తున్న తెలంగాణ 

దాంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం పెరగని వైనం 

సీమ, నెల్లూరు ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకోలేని పరిస్థితి 

విద్యుదుత్పత్తిని ఆపాలన్న బోర్డు ఆదేశాలను పట్టించుకోని తెలంగాణ 

సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు సమావేశంలో ఇచ్చిన హామీని పట్టించుకోకుండా శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం ద్వారా తెలంగాణ సర్కార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ దిగువకు భారీగా నీటిని వదిలేస్తోంది. ఈనెల 19న శ్రీశైలం ప్రాజెక్టులో 840.9 అడుగుల్లో 68.71 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి కేవలం 87,280 క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి చేరుతోంది. అయినా సరే.. తెలంగాణ సర్కార్‌ విద్యుదుత్పత్తిని ప్రారంభించడంతో కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎ.పరమేశంకు కర్నూలు జిల్లా ప్రాజెక్ట్‌ సీఈ మురళీనాథ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. 

విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తే ప్రాజెక్టులో నీటి మట్టం పెరగదని.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు నీళ్లందవని వివరించారు. దీంతో ఏకీభవించిన బోర్డు తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని సోమవారం తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. కానీ.. వాటిని పట్టించుకోని తెలంగాణ సర్కార్‌ 20న 24,079, 21న 39,701 క్యూసెక్కులను విద్యుదుత్పత్తి చేస్తూ తరలించింది. బుధవారం ఏకంగా ఆరు యూనిట్ల ద్వారా 900 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 41,626 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది.  

ఉమ్మడి ప్రాజెక్టయిన శ్రీశైలంలో కుడి గట్టున 770 మెగావాట్లు, ఎడమ గట్టున 900 మెగావాట్ల సామర్థ్యం గల జలవిద్యుత్కేంద్రాలు ఉన్నాయి. కుడి గట్టు కేంద్రం ఏపీ పరిధిలో, ఎడమ గట్టు కేంద్రం తెలంగాణ పరిధిలో ఉన్నాయి. ఇక్కడి ఉత్పత్తయ్యే విద్యుత్‌ రెండు రాష్ట్రాలు చెరిసగం పంచుకోవాలని కేంద్ర విద్యుత్‌ శాఖ 2014లో మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ వాటిని తెలంగాణ సర్కార్‌ పట్టించుకోవడంలేదు.      

శ్రీశైలంలోకి వారంలో 45.64 టీఎంసీలు 
శ్రీశైలం ప్రాజెక్టులోకి వారం రోజుల్లో 45.64 టీఎంసీల నీరు చేరింది. జూలైలో ఈ స్థాయిలో ప్రాజెక్టులకు వరద ప్రవాహం చేరడం పుష్కరకాలంలో ఇదే ప్రథమం. బుధవారం ప్రాజెక్టులోకి 70,532 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 41,626 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్‌ వినియోగించుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 74.98 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే రోజు నాటికి ప్రాజెక్టులో 31.52 టీఎంసీలు నిల్వ ఉండేవి. అంటే గతేడాది ఇదే రోజు నాటి కంటే ఈ ఏడాది 43.46 టీఎంసీలు అధికంగా నిల్వ ఉండటం గమనార్హం.

బలహీనపడిన ద్రోణి
మహారాణిపేట(విశాఖ దక్షిణ): కర్ణాటక, ఆ ప్రాంత పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్లు ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా  రానున్న 48 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top