భక్తులతో భలే వ్యాపారం

Pooja Item Rates Increased In Sravanamasam - Sakshi

సాక్షి, విజయనగరం :  కార్తీకమాసం అనంతరం ఏడాదిలో అత్యంత పవిత్రంగా పూజాధికాలు నిర్వహించేది శ్రావణ మాసంలోనే. ఈ మాసంలో నాలుగు వారాల పాటు ప్రతీ శుక్రవారం వరలక్ష్మీ దేవికి మహిళలు పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించారు. కుటుంబ సభ్యులంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని భక్తి ప్రవత్తులతో పూజలు నిర్వహిస్తారు. అయితే, మహిళల భక్తి భావాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పూజాసామగ్రికి ఇష్టారాజ్యంగా ధరలు పెంచి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. 

పెరిగిన ధరలు... 
హిందువుల భక్తి భావాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కువగా పూజలు నిర్వహించే సీజన్‌లో పండ్లకు కృత్రిమ కొరత సృష్టించి ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 1వ తేదీ వరకు ఆషాడ మాసమే. 2వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. ఆషాడం ముగిసిన వెంటనే వచ్చే మొదటి శుక్రవారం కావడంతో వినియోగదారుల తాకిడిని గమనించిన వ్యాపారులు ఒక్క సారిగా ధరలు పెంచేశారు. డజను అరటి పళ్లు రూ.50 నుంచి రూ.60కి విక్రయించారు. అదే టెంకాయలు అయితే రూ.30 నుంచి రూ.35 ధరల్లో సైజ్‌ను బట్టి అమ్మకాలు చేశారు. ఇక అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పండ్ల ధరలు సైతం ఆకాశన్నంటాయి. కిలో యాపిల్‌ ధర రూ.150 నుంచి రూ.170కు విక్రయించారు. వాస్తవానికి ఆషాడం రోజుల్లో పూజలు నిర్వహించడం తక్కువగా ఉండటంతో  వీటికి అంత డిమాండ్‌ ఉండేది కాదు. అయితే, శ్రావణ మాసం ఆరంభంలో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్న ధరలను నియంత్రించేలా అధికారులు  చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

దారుణంగా పెంచేశారు.. 
నిన్నటి వరకు అందుబాటులో ఉన్న పండ్ల ధరలను ఒక్కసారిగా వ్యాపారులు పెంచేశారు. డజను అరటి పళ్లు రూ.50 చెబుతున్నారు. అరడజను అయితే రూ.30కి తగ్గదంటున్నారు. నచ్చితే కొనండి లేదంటే పొమ్మంటున్నారు. ధరల నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం అధికారులైనా దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి.
– ఎన్‌.నాగభూషణం,  ప్రైవేటు ఉద్యోగి, విజయనగరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top