పండుముసలి దీన గాథ

Ponnuru Old Woman Deenamma Is Living Sad Life Guntur  - Sakshi

సాక్షి, గుంటూరు : ఎండిన ఎముకలను కప్పేసిన ముతక శరీరం.. ఆ శరీరానికి చుట్టుకుని ఉన్న పాత చీర.. అది చీరో.. ఏదైనా పరదానో కూడా ఆమెకు తెలియదు. తొమ్మిది పదుల వయసు దాటి.. కాల పరీక్షలో    కట్టెగా మారి జీవన పోరాటం చేస్తోంది. నలభై ఏళ్ల క్రితం ఇంటాయన ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయాడు. కడుపు కూడా పండకపోవడంతో ఆమె జీవితం మోడుగా మారింది. అప్పటి నుంచి ఏ కష్టమొచ్చినా చెప్పుకోవడానికి నా అనే వాళ్లు లేక పొంగుకొచ్చే దుఃఖాన్ని చీర కొంగులో దాచుకొనేది. ఇలా తొంభై ఏళ్ల సంధికి చేరింది. ఇప్పుడు ఆమె ఒంట్లో ఓపిక లేదు.. ఎక్కడికైనా వెళ్లాలన్నా కాళ్లలో సత్తువ లేదు.. తింటానికి తిండి లేదు.. అందుకే జీవం లేని ఆ గాజు కళ్లలో నిత్యం ఏదో వెతుకులాట.. ఏ మధ్యాహ్నపు ఎండ వేళకో.. ఏ చీకటి సంధ్యకో.. తాటాకు చప్పుడు అలికిడైతే చాలు... ఎవరైనా గుప్పెడు మెతుకులు తీసుకొస్తున్నారేమోనని ఆశగా చూసేది.

చుట్టుపక్కల మనసున్న తల్లులు నాలుగు ముద్దలు తీసుకొస్తే ఆమె ఎండిన డొక్కల్లో కాస్త కదలిక వచ్చేది. ఆ సమయంలో ఆ ఇంకిన కళ్లలో కన్నీటి చెమ్మ చెంపలపై కాలువలయ్యేది. అప్పుడప్పుడూ ఆ నాలుగు ముద్దలు లేక.. ఆమె చేసే ఆర్తనాదం.. కడుపులో మెలిపెట్టే పేగుల రొదల్లో కలిసిపోతుండేది. ఇలా ఊరి చివర చిన్న పూరి గుడిసెలో బతుకీడుస్తున్న ఆ అభాగ్యురాలిని జడివాన మరింత కష్టాల్లో ముంచేసింది. ఉన్న గుడిసెను కూల్చేసి.. ఆమెను రోడ్డున పడేసింది. ఇప్పడు ఎండ మండినా, వాన తడిపినా తల దాచుకోవడానికి నీడ లేదు. అవ్వా.. ఏమైనా తిన్నావా అని అడిగితే.. వెంటనే ఒక చేత్తో పొట్ట తడుముకుంటూ.. మరో చేత్తో వచ్చిన వాళ్ల రెండు చేతులు గట్టిగా పట్టుకుని తేరిపారా చూస్తుంది.. తనను వాళ్ల వెంట తీసుకెళతారేమోనని.. పొన్నూరు మండలం తాళ్లపాలేనికి చెందిన దీనమ్మ అనే ఈ వృద్ధురాలు.. ఇలా మలి సంధ్యలో జీవచ్ఛవమై..  కనిపించిన ప్రతి ఒక్కరికీ రెండు చేతులు జోడిస్తోంది... ఎవరైనా మనసున్న మారాజులు మానవత్వపు నీడన తనను అక్కున చేర్చుకుంటారని.. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top