పచ్చపాతం

Police Negligence on Narendra Modi Tour in Guntur - Sakshi

 మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకుల నిరసన

గుంటూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా నానా హంగామా

అనేక చోట్ల టైర్లు, బీజేపీ జెండాలు తగలబెట్టిన వైనం

ఆందోళనలను అడ్డుకోకుండా చోద్యం చూసిన ఖాకీలు

గతంలో ప్రతిపక్షాల నిరసనలపై ఉక్కుపాదం

ఇప్పుడు ప్రేక్షకపాత్ర వహించడంపై ప్రజల మండిపాటు

గుంటూరు నగరంలో ఒక చోట నడి రోడ్డుపై టైర్లు తగలబెట్టి నానాయాగీ చేశారు.. మరో చోట వచ్చిపోయే వాహనాలను నిలువరించి గాలి తీసి గందగోళం సృష్టించారు. ఇంకో చోట ఆర్టీసీ బస్సులను అడ్డుకుని ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆదివారం గుంటూరులో మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకులు ధర్నాలు, నిరసనలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. వీటిని అడ్డుకోవాల్సిన పోలీసులు చేతులు కట్టుకుని చోద్యం చూశారు. ట్రాఫిక్‌ స్తంభించిపోతున్నా క్రమబద్ధీకరించాలనే స్పృహ మరిచారు. టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా నానా హంగామా సృష్టిస్తున్నా.. దగ్గరుండి ప్రోత్సహించారు.  పోలీసుల తీరు చూసిన ప్రతిపక్షాలు, ప్రజలు మాత్రం.. వీరు లాఠీ పట్టిన రక్షణభటులా.. ఖాకీ దుస్తులు వేసుకున్న టీడీపీ కార్యకర్తలా అని మండిపడుతున్నారు.

సాక్షి, గుంటూరు: వాళ్లకు చట్టాలు చుట్టాలుగా మారాయి.. వాళ్లు ఏం చేసినా అడిగే నా«థుడే లేకుండా పోయాడు.. నిరసనల పేరుతో రోడ్లపైకి వచ్చి గందరగోళం చేస్తున్నా నియంత్రించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ప్రతిపక్షాలు, ప్రజా, కార్మిక, ఉద్యోగ సంఘాలు తమ సమస్యలపై నిరసనకు పిలుపునిస్తే గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్ట్‌లు చేసే పోలీస్‌లు ఆదివారం అధికార పార్టీ నేతలు రోడ్లపై గందరగోళం సృష్టిస్తుంటే కళ్లప్పగించి చూశారు. కనీసం అడ్డుకునే ప్రయత్నం చూడా చేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటననను నిరసిస్తూ టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. శాంతియుతంగా నిరసన తెలపాలన్న కనీస ధర్మాన్ని విస్మరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపై టైర్లు, ఫ్లెక్సీలు తగులబెట్టారు. వాహనాలను అడ్డుకుని మోదీ సభలకు వెళుతున్న వారిని దుర్భాషలాడారు. ఇదంతా దగ్గరుండి చూస్తున్న పోలీసులు చూపీచూడనట్టు వదిలేశారు. పోలీస్‌లు పచ్చకండువా వేసుకున్న టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.

నిరసనలకు పిలుపునిచ్చిన వెంటనే అరెస్ట్‌లు..
గతంలో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు ప్రజా నిరసనలు, ఆందోళనలకు పిలుపునిచ్చిన వెంటనే పోలీసులు గృహ నిర్బంధాలు చేశారు. నిరసనల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చట్టాలు వల్లెవేశారు. అగ్రి గోల్డ్, జూట్‌ మిల్లు, ఛలో దాచేపల్లి, ప్రత్యేక హోదా బంద్‌లు వంటి నిరసన ప్రదర్శనలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చినప్పుడు పోలీసులు ఓవరాక్షణ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను ఇళ్లలో నుంచి బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ప్రతిపక్షాలు శాంతియుతంగా నిరసనలు తెలుపుతామన్నా అంగీకరించకుండా ఏకపక్షంగా వ్యవహరించారు.

దగ్గరుండి నిరసనలు చేయించిన వైనం...
గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్, హిందూ కాలేజీ సెంటర్, శంకర్‌విలాస్, నాజ్‌ సెంటర్, మంగళగిరి, తెనాలి పట్టణాలతో సహా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మోదీ గో బ్యాక్‌ అంటూ గంటల తరబడి రోడ్లపై బైఠాయించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. గుంటూరు నగరంలోని డొండ రోడ్డులో టైర్లు తగలబెట్టారు. శంకర్‌ విలాస్‌ వద్ద రోడ్డుపై ఆందోళనలు చేస్తూ వచ్చిపోయే వాహనాలను నిలువరించారు. అయినా పోలీసులు మాత్రం కొంచెమైనా చలించలేదు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎస్సీ మోర్చా మాజీ ఉపాధ్యక్షుడు దారా సాంబయ్య వాహనాన్ని అడ్డుకున్నారు. టీడీపీ మైనార్టీ నేత లాల్‌ వజీర్‌ ఆయనపై దాడికి యత్నించారు. కార్యకర్తలు దుర్భాషలాడారు.పరిస్థితి ఇంత దిగజారినా పోలీస్‌లు దారా సాంబయ్యను అక్కడి నుంచి పంపించాక టీడీపీ నేతల నిరసనలను పోలీసులే దగ్గరుండి చేయించారు.

ప్రత్యేక దళాలు ఎక్కడ ?
ప్రతిపక్ష, ప్రజా, కార్మిక సంఘాల నాయకులు శాంతియుతంగా నిరసనలకు దిగిన గంటలోపే ఎన్డీఎఫ్, ఏఆర్, స్పెషల్‌ బలగాలను రంగంలోకి దింపారు. ఆదివారం మాత్రం టీడీపీ నేతలు గందరగోళం సృష్టించినా కేవలం సివిల్‌ పోలీసులను మాత్రమే ఆయా నిరసనల వద్ద విధులకు కేటాయించారు. శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో పోలీసుల ఎదుటే ఫ్లెక్సీలు తగలబెట్టారు. ప్రధాని మోధీ సభలకు వెలుతున్న వాహనాలను ఆపి టైర్లలో గాలి తీస్తూ అద్దాలు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. సభకు వెళుతున్న బస్సుల్లో వారిని దింపేసినా అడ్డుకోలేదు. పోలీసుల తీరపై బీజేపీ నాయకులు తీవ్రంగా మండి పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా ? టీడీపీ నిరంకుశ పాలనలో ఉన్నామా ? అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని స్పష్టం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top