సరిహద్దులో అప్రమత్తత చర్యలు  

Police Checking Borders In Srikakulam District - Sakshi

ఏఓబీలో వరుస ఎన్‌కౌంటర్లు

మావో అగ్రనేతలు తప్పించుకున్నారనే అనుమానం

సాక్షి, భామిని: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విశాఖ మన్యంలో వరుసగా ఎన్‌కౌంటర్లు జరగడంతో మన జిల్లాలోనూ కూంబింగ్‌లు ముమ్మరం చేశారు. ఏఓబీ పరిధి విశాఖ మన్యంలోని దారకొండ అటవీ ప్రాం తం, మాదిగమళ్లు అటవీ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు మావోయిస్టులు చనిపోయిన సం గతి తెలిసిందే. ఈ ఎదురు కాల్పుల్లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పలువురు మావోలు తప్పించుకున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. దీంతో మన మన్యం వద్ద పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. సీపీఐ(ఎంఎల్‌)మావోయిస్టు పార్టీ ఆవిర్భావ 16వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలోనే ఈ పోలీసు దాడులు జరిగాయని భావిస్తున్నారు. ఇదే సభలో అగ్ర మావోలు పాల్గొన్నారనే ప్రచారం జరుగుతోంది. రెండు ఎన్‌కౌంటర్లలో దెబ్బతిన్నమావోలు ప్రతీకార దాడులకు దిగుతారనే అనుమానాలతో పోలీస్‌ యంత్రాంగం రెడ్‌ అలర్ట్‌ చర్యలు చేపట్టింది.

మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని బోర్డర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తుగా ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి పూట బస్సులను నిలిపివేస్తున్నారు. సరిహద్దులోని రోడ్లు వెంబడి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల రాకపోకలపై ఓ కన్నేసి ఉంచారు. సరిహద్దు ఒడిశా నుంచి వచ్చి పోయే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఏఓబీలో కీలకమైన తివ్వాకొండల్లోనూ సాయుధ పోలీస్‌ బలగాలు ముమ్మర కూంబింగ్‌లతో జల్లెడ పడుతున్నాయి. అనుమానిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ కొనసాగుతోంది. 

ఆవిర్భావ దినోత్సవంలో.. 
ఈ నెల 21 నుంచి సీపీఎం ఎంఎల్‌ మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా సరిహద్దులో ఆ అలజడి కనిపిస్తోంది. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పార్టీ ఆవిర్భావం పేరున సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2004 సెప్టెంబర్‌ 21న ఏర్పడిన సీపీఐ(ఎంఎల్‌)మావోయిస్టు పార్టీ పదహారేళ్లలో సాధించిన పోరాటాలను గుర్తు చేస్తూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఏఓబీలో ప్రత్యేక పోలీస్‌ బలగాలు మోహరించి మావోల సమావేశాలపై దాడులు జరపడంతో ఉద్రిక్తత నెలకొంది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top