2018కి పోలవరం పూర్తికాదు

Polavaram is not completed in 2018 - Sakshi

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

సాక్షి, రాజమహేంద్రవరం/ఏలూరు: పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు చేయడంలో ఏ విధమైన అవకతవకలు లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధుల వినియోగంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. గురు వారం ఆయన పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణంలో పెట్టిన ఖర్చుల్లో ఎక్కువ తినేశారని, నిధులు దారి మళ్లించారన్న అనుమానంతోనే బీజేపీ ప్రభుత్వం నిధులు విడుదల నిలిపివేసిందన్నారు. అన్ని పార్టీలతో కమిటీని ఏర్పాటు చేసి ప్రాజెక్టుకి పిలిచి వివరాలు వెల్లడించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తుందన్న నమ్మకం ఉందా అని విలేకర్లు ప్రశ్నించగా ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి కాదన్నారు. ఇంత వరకు అసెంబ్లీ కట్టలేకపోయారని విమర్శించారు.

మేనిఫెస్టో.. బ్రహ్మవాక్కు లాంటిది
రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు ప్రకటించే మేనిఫెస్టోలోని ప్రతీ పదం బ్రహ్మవాక్కు లాంటిదిగా ఉండాలని, అందులో ప్రతీ హామీ అమలు చేయాలని పవన్‌ అన్నారు. ఆశలు చూపించి చేయకపోవడం వల్లే తునిలాంటి ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీలతో కలసి హామీలు ఇస్తున్నప్పుడు సిగ్గేసిందని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తనను తొలిచిందన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో కాపులకు 15 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని చెప్పి ఇప్పుడు 5 శాతమంటూ తీర్మానం చేసి పంపితే ఎలా? అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని ఓ హోటల్‌లో ఉభయగోదావరి జిల్లాల కార్యకర్తల సమావేశంలో పవన్‌ మాట్లాడారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top