దారుణ మేళాలు!

Play of government in the name of Subsidy loans - Sakshi

ప్రతీసారీ లక్ష మందికి సబ్సిడీ రుణాలంటూ ప్రచారం 

మొదటి మేళాలో పంపిణీ చేసింది 17 వేల మందికే..

రెండో రుణమేళాలో 15 వేల మందికి

మెగా రుణ మేళాల పేరుతో సర్కారు మాయ

ఆదరణ కింద దరఖాస్తులు చేసుకున్న వారు 7,47,649 మంది

వీరిలో 2,68,580 మంది అర్హులుగా గుర్తింపు

వీరిలో 32వేల మందికి కూడా సరిగ్గా చేకూరని లబ్ధి

డిమాండ్‌కు తగ్గ నిధులు విడుదల చేయని సర్కార్‌

ప్రచారం మాత్రం కొండంత

సాక్షి, అమరావతి : సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని గప్పాలు కొట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం అభాసుపాలవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మెగా రుణమేళాల పేరుతో రెండు నెలలుగా చేస్తున్న హడావుడి అంతా పేరు గొప్ప తీరు దిబ్బలా తయారైంది. నాలుగున్నరేళ్లుగా ఒక్క పైసా రుణం ఇవ్వకుండా ఇప్పుడు ఒక్కో రుణమేళాలో లక్ష మందికి సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన అంతా బోగస్‌గా తేటతెల్లమవుతోంది. నవంబరు 12, డిసెంబరు 6న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెండు మెగా రుణమేళాల్లో కేవలం 32వేల మందికే రుణాలిచ్చినట్లు తెలుస్తోంది. మూడో విడత రుణమేళాడిసెంబరు 28న ప్రారంభించారు.

డిమండ్‌ కొండంత.. మంజూరు పిసరంత
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ, వైశ్య, ఈబీసీ, క్రిస్టియన్, దివ్యాంగులు, మహిళా అభివృద్ధి, సీనియర్‌ సిటిజన్స్, అత్యంత వెనుకబడిన కులాల కార్పొరేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వడమనేది ఏటా సాధారణంగా జరిగే కార్యక్రమమే. ఈ కార్పొరేషన్‌లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కార్పొరేషన్లు తప్ప మిగిలిన వాటికి వంద కోట్లు కూడా కేటాయించని పరిస్థితి. కానీ, నాలుగున్నరేళ్లపాటు వాటి ఊసే ఎత్తని సర్కారు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో వాటిపై హడావుడి చేస్తోంది. మరోవైపు.. ఇప్పటివరకు అన్ని సంక్షేమ శాఖలకు మొత్తం 7,47,649 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 2,68,580 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో కనీసం 32వేల మందికి కూడా సరిగ్గా లబ్ధి చేకూరలేదు. అలాగే, లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులను బట్టి చూస్తే మొత్తం రూ.1,66,174.95కోట్ల మేర డిమాండ్‌ ఉన్నట్లు ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డులో ప్రభుత్వం పేర్కొంది. కానీ, ఇప్పటివరకు రూ.3,694.36కోట్లు మాత్రమే సర్కారు విడుదల చేసింది. ఇందులో కేవలం పదిశాతం నిధులు మాత్రమే మంజూరుచేశారని అధికారులు చెబుతున్నారు. అంటే కేవలం రూ.369కోట్లే సబ్సిడీ రుణాలు ఇచ్చారన్న మాట. మరోవైపు.. వాషర్‌మెన్, వాల్మీకి/బోయ, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, వడ్డెర, బట్రాజ, కుమ్మరి, కృష్ణబలిజ/పూసలి, మేదర, గీత కార్మిక, సగర బీసీ ఫెడరేషన్‌లు ఉన్నా ఉపయోగంలేదు. వాటి ద్వారా పేదలకు ప్రభుత్వ సాయం నామమాత్రంగా కూడా అందటంలేదు. ఒక్కో ఫెడరేషన్‌కు రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్లలోపు మాత్రమే నిధులు కేటాయిస్తుండడం ఇందుకు కారణం.

టీడీపీ వారికే ఆదరణ
ఇదిలా ఉంటే.. ఎంపీడీవోలు టీడీపీ కార్యకర్తలనే రుణాలకు ఎంపిక చేస్తున్నారనే విమర్శలు కోకొల్లలు. ఆదరణ వస్తువుల కోసం రూ.30వేల యూనిట్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో టీడీపీ వారినే ఎంపిక చేశారని మిగిలిన వారు ఆరోపిస్తున్నారు. ఇతరులను రూ.పదివేల యూనిట్లకు ఎంపిక చేస్తున్నట్లు వారు తెలిపారు. దీంతో ఎమ్మెల్యేల చేతుల్లో ఎంపీడీవోలు కీలుబొమ్మలుగా మారారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, 30వేల యూనిట్‌ మాకెందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తే ఇచ్చింది తీసుకోవాలని అధికారులు అంటున్నట్లు దగాపడ్డ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక అధికారులైతే.. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరించడంలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీనే వారికి పంపిణీ చేసి రుణం ఇవ్వకుండా దాటవేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాక, సరఫరాదారులు సకాలంలో సరఫరా చేయకపోవడంవల్లే ఆదరణ వస్తువులు సరిగ్గా అందడంలేదంటున్నారు. కానీ, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యలన్నీ పరిష్కరించవచ్చని లబ్ధిదారులు అంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top