‘సీమ’ను చీల్చేందుకు కుట్రలు..కుయుక్తులు


సాక్షి ప్రతినిధి, కడప:రాష్ట్ర విభజనను ప్రజానీకం శాపంగా పరిగణిస్తుంటే శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా రాజకీయ నాయకులు వారి ఉన్నతి కోసం పాకులాడుతున్నారు.  రాయలసీమను విచ్ఛిన్నం చేయాలనే కుట్రలు ఊపుందుకున్నాయి.  ఇందుకోసం కర్నూలు, అనంతపురం జిల్లాల కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు కొందరు తెరవెనుక  ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వారి చర్యలను నియంత్రించాల్సిన జిల్లా నాయకులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ   రాయలసీమ ఉనికే  ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కల్పిస్తున్నారు. రాష్ర్టం విడిపోతున్నదనే బాధతోబాటు, రాయలసీమ కూడా చీలిపోతుందేమో అన్న ఆవేదనను సీమ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.  




ఎలా ఉంటే   తమ రాజకీయ భవిష్యత్ ఉంటుందనే ఆలోచనలో రాజకీయ నాయకులు ఉన్నారు.   ఇందుకోసం ఒకనాటి రతనాలసీమను రెండుగా చీల్చే కుట్రలో  భాగస్వాములవుతున్నారు.  ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన  కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, మంత్రి రఘువీరారెడ్డి ‘రాయలతెలంగాణ’ వైపు మొగ్గుచూపుతున్నటు

సమాచారం. వీరు ఓవైపు కాంగ్రెస్ అధిష్టానంతో అటువైపుగా మంతనాలు నిర్వహిస్తూ, సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమిస్తున్నామని మభ్యపెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు ఇలా ఉంటే, టీడీపీ నాయకులు వింత ధోరణిని ప్రదర్శిస్తున్నారు.  తెలంగాణకు అనుకూలంగా ఇచ్చినమాటను  తప్పలేమని  ఓవైపు ఆపార్టీ అధినేత చంద్రబాబునాయుడు  చెబుతున్నారు. మరోవైపు రాయలసీమ, కోస్తాంధ్రలో  తెలుగుతమ్ముళ్లు సమైక్యాంధ్ర అంటూ ఉద్యమిస్తున్నారు. ఇంకోవైపు  అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేతో ఆజిల్లాకు చెందిన ఓ మంత్రి రాయల తెలంగాణ విషయంలో ఒప్పించినట్లు తెలుస్తోంది.




ఆ ఎమ్మెల్యేకే ఆరెండు జిల్లాల టీడీపీ నాయకులను ఒప్పించే బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఇంతటి అన్యాయం చోటుచేసుకుంటున్నా జిల్లాకు చెందిన ఆయాపార్టీల నాయకులు నోరుమెదపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రాయలసీమ విభజన ఉంటే  వైఎస్సార్ జిల్లా  అన్ని విధాల తీవ్రమైన అన్యాయానికి గురవుతుందని  పలువురు పేర్కొంటున్నారు.




కమ్యూనిస్టులు, బీజేపీలదీ అదేపరిస్థితి

సమాజంలోని అసమానతలు, అన్యాయాల పట్ల ముందుండి నిలదీసే ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకుల్లో కూడా రాయలసీమ విభజనపై ఆశించిన స్పందన లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి మొదటి నుంచి సమ్యైదన గట్టిగా విన్పిస్తున్న పార్టీలల్లో సీపీఎం  మొదటి వరుసలో  ఉంది.   వారి నిర్ణయంలో మార్పు లేకపోయినా రాయలసీమను విభజన చేయాలన్నప్పుడు కూడా మెతక వైఖరి అవలంబించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.   బీజేపీ  తెలంగాణకు అనుకూలంగా నిలిచింది. అయితే  ఇక్కడి ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఆ పార్టీ ఆశించిన స్థాయిలో ఉద్యమించలేదనే చెప్పవచ్చు. ఇప్పటికే ఆపార్టీ రాయలసీమ నాయకులు శాంతారెడ్డి, చర్లపల్లి నరసింహారెడ్డి, కపిలేశ్వరయ్య తదితరులు ఇదే విషయమై రాష్ట్ర నాయక త్వం దృష్టికి  తీసుకెళ్లిన ట్లు సమాచారం. అయినప్పటీకీ రాష్ట్ర నాయకత్వంలో ఆశించిన చలనం లేనట్లు తెలుస్తోంది.




ఆ ప్రతిపాదన జిల్లాకు చేటు ...

రాయలతెలంగాణ ప్రతిపాదన ఎటుచూసినా చేటేనని   జిల్లావాసులు మదనపడుతున్నారు. వైఎస్సార్ జిల్లాలో రూపొందించిన సాగునీటి ప్రాజెక్టులన్నీ వరదజలాలపై  ఆధారపడి నిర్మిస్తున్నవేనని, అవన్నీ అలంకారప్రాయంగా మారే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. రాయలసీమ అస్థిత్వానికే ప్రమాదకారిగా మారనున్న రాయలతెలంగాణ నిర్ణయాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సి  ఉందని పలువురు భావిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top