హైకోర్టు విభజన నోటిఫికేషన్‌పై పిటిషన్‌

Petition on High Court Division Notification - Sakshi

రేపటి జాబితాలో చేర్చిన రిజిస్ట్రీ 

కోర్టును తప్పుదోవ పట్టించారంటూ పిటిషన్‌లో ఆరోపణ 

సాక్షి, నూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు భవన నిర్మాణం ఇంకా పూర్తికానందున రాష్ట్రపతి జారీ చేసిన ఉమ్మడి హైకోర్టు విభజన నోటిఫికేషన్‌ అమలును వాయిదావేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ బుధవారం విచారణకు రానుంది. ఏపీ న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు కె.సీతారాం, సభ్యుడు కాసా జగన్‌మోహన్‌రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా సుప్రీం కోర్టు రిజిస్ట్రీ జనవరి రెండో తేదీ నాటి విచారణాంశాల జాబితాలో చేర్చింది. జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో కూడిన ధర్మాసనం దీన్ని విచారించనుంది. పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘ఏపీలో భవన నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. న్యాయవాదులు, న్యాయస్థాన సిబ్బందికి తగిన వసతులు లేవు. మౌలిక వసతులు ఏర్పాటయ్యేంతవరకు సిబ్బంది, న్యాయవాదులు అక్కడికి నివాసాన్ని మార్చేందుకు సుముఖంగా లేరు.

ఇప్పటికీ సచివాలయ, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు పూర్తిస్థాయిలో హైదరాబాద్‌ నుంచి అమరావతికి తమ నివాసాలను మార్చలేదు. ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం సుప్రీం కోర్టునే తప్పుదోవ పట్టించేలా డిసెంబరు 15 కల్లా తాత్కాలిక భవన నిర్మాణం పూర్తవుతుందని అఫిడవిట్‌ వేసింది. ఇప్పుడు హైకోర్టు విభజన నోటిఫికేషన్‌ వెలువడ్డాక ఒక మెమో జారీచేసింది. సీఎం క్యాంపు కార్యాలయ భవన సముదాయంలో హైకోర్టు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఇక్కడి రాజకీయ వాతావరణం హైకోర్టు నిర్వహణకు ఇబ్బందికరంగా ఉంటుంది. భవన నిర్మాణం పూర్తికావడానికి మరో 10 నెలలు అవసరమని తెలుస్తోంది..  ఆ నిర్మాణం, వసతుల ఏర్పాటు పూర్తయ్యేంతవరకు నోటిఫికేషన్‌ అమలును వాయిదావేయాలి..’అని కోరారు. 

కేవియట్‌ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం 
హైకోర్టు విభజనకు చెందిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై వచ్చిన పిటిషన్లపై ఆదేశాలు జారీచేసేముందు తమ అభిప్రాయం తెలియపరిచే అవకాశం ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేవియట్‌ దాఖలు చేసినట్టు ప్రభు త్వ న్యాయవాది ఉదయ కుమార్‌ సాగర్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top