అన్నా.. నువ్వొస్తేనే మాకు మంచిరోజులు

Peoples Sharing Their Problems In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం :అధికార పార్టీ ఆగడాలతో అల్లాడిపోతున్న ప్రజలకు సాంత్వన చేకూర్చే ఆత్మీయుడిలా దర్శనమిచ్చారు జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్సార్‌సీపీకి ఓట్లేశామని వెయ్యిమంది మత్స్యకారుల పొట్టకొడుతున్నారంటూ ఓ గంగపుత్రుడి ఆవేదన.. తండ్రిది హత్య అని తెలిసినా టీడీపీ నాయకుల అండతో హంతకులకు శిక్ష పడటం లేదని కన్నీరుమున్నీరైన కుమార్తెలు.. సుగర్‌ఫ్యాక్టరీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఐదు నెలలుగా జీతాలకూ ఇబ్బంది పడుతున్నామన్న కార్మికులు .. ఇంటికో ఉద్యోగం పేరిట బాబు దగా చేశారంటూ నిరుద్యోగులు.. ఇలా అడుగడుగునా తమ సమస్యలను నివేదించారు. నీవు రావాలన్నా.. అప్పుడే మాకు మళ్లీ మంచిరోజులు అంటూ చెల్లెమ్మలు, తమ్ముళ్లు, మా రాజన్న బిడ్డ చల్లంగుండాలి అన్ని పెద్దల దీవెనలు పూలజల్లులా పలకరించగా అందరికీ భరోసా ఇస్తూ సాగారు జనహృదయ విజేత..

నా బిడ్డను మీరే ఆదుకోవాలన్నా..
నా బిడ్డకు మూడు సంవత్సరాలు. రెండేళ్లు బాగానే ఉన్నాడు. ఏడాదిగా పూర్తిగా వినికిడి కోల్పోయాడు. ఇప్పటివరకు తిరగని ఆస్పత్రి లేదు. మళ్లీ వినికిడి వచ్చేందుకు రూ.9లక్షలు ఖర్చు అవుతుందన్నారు. కూలి పనులు చేసుకునే మాకు అంత స్థోమత లేదు. ఆరోగ్యశ్రీ కూడా ఆదుకునేట్టు లేదు. నా బిడ్డను మీరే ఆదుకోవాలని కోరాను. ఆయన సానుకూలంగా స్పందించారు. జగనన్నపై మాకు నమ్మకం ఉంది.
– కుమారుడు చాంద్రిష్‌తో సుంకర జానకి,కె.గొట్టివాడ, కోటవురట్ల మండలం

మూగవాడైన మా అబ్బాయికిపింఛన్‌ ఇవ్వట్లేదు
మా అబ్బాయి మాతే ఉపేంద్రకుమార్‌ పుట్టుకతోనే మూగవాడు. బధిర పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. వాడికి వికలాంగ పింఛన్‌ కోసం తొమ్మిదేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా, కానీ ప్రభుత్వం కనికరించట్లేదు. నువ్వు వస్తేనే మాలాంటి వాళ్లకు ఆసరా ఉంటుంది.     – మాతే శ్యామల, చౌడువాడ గ్రామం, కోటవురట్ల మండలం

మీ తండ్రిలా ఉద్యోగులను ఆదుకోవాలి
ఏటికొప్పాక సుగర్‌ ఫ్యాక్టరీని మీ నాన్నగారు రాజశేఖరరెడ్డి ఆర్థికంగా ఆదుకుని, ఉద్యోగులకు వేతన సవరణ చేశారు. ఇప్పుడు ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు. మాకు ఐదు నెలలుగా జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఆయనలాగే మీరూ అధికారంలోకి వచ్చాక  కార్మికుల్ని ఆదుకోవాలని జగన్‌ని కలిసి వినతిపత్రం ఇచ్చాం. మాకు నమ్మకం ఉంది.  కార్మికులు కూడా దార్లపూడిలో ఫ్యాక్టరీ గేటు వద్ద జగన్‌ను కలిశారు.        – ఉప్పలపాటి రామచంద్రరాజు,ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి, ఏటికొప్పాక సుగర్‌ఫ్యాక్టరీ

వైఎస్సార్‌సీపీకి ఓట్లేశామనికరువుభత్యం ఆపేశారు
మా గ్రామంలో 4వేల మంది మత్స్యకారులకు చేపల వేటే ఆధారం. మా ఊళ్లో సుమారు వెయ్యిమందికి వేటనిషేధ సమయంలో ఇచ్చే కరువు భత్యాన్ని టీడీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లుగా ఆపేశారు. అధికారులను, నాయకులను అడిగితే గత ఎన్నికల్లో మీరు వైఎస్సార్‌సీపీకి ఓట్లేశారు, అందుకే ఇవ్వట్లేదని చెప్పారు. జగన్‌ను కలిసి చెబితే .. ‘ఆందోళన చెందకండి.. మీకు న్యాయం చేస్తా’ అన్నారు. – యజ్జల అప్పలరాజు, రాజయ్యపేట, నక్కపల్లి మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top