గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం

People Wish Village Secretariat System - Sakshi

పంచాయతీల్లో సచివాలయం ఏళ్ల నాటి కల

జగన్‌ హామీపై జనాల్లో ఆశలు   

సాక్షి, అరసవల్లి (శ్రీకాకుళం): భర్త చనిపోయి రోదిస్తున్న అభాగ్యురాలు పింఛన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాలా..? బిడ్డల్ని కోల్పోయి ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులు సాయం కావాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా..? ఇల్లు దాటలేని దివ్యాంగుడు తనకో ఆధారం కల్పించాలని అనామక కమిటీలను వేడుకోవాలా..? పేరుకు ప్రజాస్వామ్యమే అయినా దేశంలో సంక్షేమం అర్హుడి చెంత చేరాలంటే సిఫారసు తప్పనిసరైపోయింది. ఇలాంటి దుస్థితి పోవాలంటే గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలి. ఆ కల నెరవేరాలంటే సచివాలయాలు ఊరి ఒడిలో పురుడు పోసుకోవాలి. ఈ అంశం ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలో ఉన్నా పాలకులు పట్టించుకోనేలేదు. ప్రతి ఊరిలో సచివాలయం ఉంటే సంక్షేమ పథకాలు అర్హులకు చేరడం సులభమవుతుందనే విషయాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుర్తించారు.  ఆ మేరకు జనాలకు భరోసానిచ్చారు. గ్రామ సచివాలయం ఏర్పాటైతే ఏమవుతుంది..?

గాంధీ మాట..

‘పల్లెలన్నీ సంపూర్ణంగా అభివృద్ధి చెందితేనే గ్రామ స్వరాజ్య లక్ష్యం సాధించడంతో పాటు దేశం కూడా పురోగతిలో పయనిస్తుంది’ అని మహాత్ముడు ఎప్పుడో చెప్పాడు. కానీ ఆ విధానాన్ని ఏ ప్రభుత్వమూ ఆచరించలేదు. దీంతో పంచాయతీలు సమస్యల కేంద్రాలుగానే ఉండిపోయాయి. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీలు అనే అప్రజాస్వామిక కమిటీలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వానికి అర్హులకు మధ్య వీరు అడ్డుగోడగా నిలిచారు. సంక్షేమం సొంతవారికే అందేలా కుట్రలు చేశారు. వీరి తీరుతో పల్లె వాసులు విసిగిపోయారు. గ్రామాల్లో ఈ రాక్షస పాలనకు అంతమొందించేందుకు ‘పంచాయతీల్లో సచివాలయాలు (సెక్రటేరియట్‌లు) ఏర్పాటు చేస్తామ’ని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పాదయాత్రలో గ్రామగ్రామాన ఈ విషయాన్ని వివరించారు. ఈ హామీని ఆచరణలో పెడితే ప్రతి ఊరూ సంక్షేమాన్ని అందుకుంటుంది. అలాగే గ్రామంలో సుమారు 10 మంది వరకు నిరుద్యోగులకు అదే గ్రామపంచాయతీలో ఉద్యోగాలు దొరుకుతాయి. 

అరాజకీయాలకు చెక్‌..

రాష్ట్రంలో గత ఐదేళ్లలో గ్రామాల్లో జన్మభూమి కమిటీల అరాచకాలు దారుణంగా ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు అర్హులైనప్పటికీ పథకాలను పొందలేకపోయా రు. లబ్ధి పొందాలంటే టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని, పర్సంటేజీలు ఇచ్చుకోవాలని బెదిరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. ఇంటి నిర్మాణం నుంచి మరుగుదొడ్డి నిర్మాణం వరకు అన్నింటా హవా కొనసాగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సైతం వీరి కనుసన్నల్లో జరిగేవి. సచివాలయాలు ఏర్పాటైతే సామాన్యుడికి ఈ రాక్షస వ్యవస్థ నుంచి విముక్తి లభిస్తుంది.

 గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. గ్రామాల్లో నిజమైన అర్హులున్నప్పటికీ, వారికి కాదని, అనర్హులకు, అధికార పార్టీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలను కట్టబెట్టే పరిస్థితులున్నాయి. ఊరిలో సచివాలయం ఉంటే ప్రతి పంచాయతీకి ఓ సెక్రటేరియట్‌ వ్యవస్థ పనిచేస్తుంది.

 ఈ వ్యవస్థలో ముఖ్యమైన అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ప్రజలకు చేరాల్సిన సంక్షేమ పథకాలు నేరుగా ఎవ్వరి ప్రమేయం లేకుండా డోర్‌ డెలివరీ అయ్యేలా, అలాగే స్థానిక యువతకు అదే గ్రామంలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

 ఈ విధానంలో ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్పథం ఉన్న యువతీ/యువకుడికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్‌గా నియమిస్తారు. వీరు ఆ గ్రామ సచివాలయానికి అనుసంధాన కర్తగా ఉండి, ఆ యాభై ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందేలా, అర్జీ పెట్టుకున్న కేవలం 72 గంటల్లోనే వారి ఇంటి వద్దకు అందేలా డోర్‌ డెలివరీ చేస్తారు.

  ప్రతి గ్రామంలో 10 మంది యువతకు, వీలైతే అక్కడున్న అన్ని సామాజిక వర్గాలకు చెందిన యువతకు ఈ ఉద్యోగాల్లో భాగస్వామ్యం కల్పించనున్నారు. అలాగే ఈ వాలంటీర్లకు, ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చే వరకూ ఈ సేవలను ఆ గ్రామంలో కొనసాగించవచ్చు.

 ప్రభుత్వ పథకాల్లో భాగంగా రేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ, ఇళ్లు, పింఛన్‌ ఇలా ఏది కావాలన్నా ఎవరి వద్దకు సిఫారసు కోసం పరుగెత్తాల్సిన అవసరం లేదు.

 వాలంటీర్లే అర్హులను గుర్తించి ఆ పథకాలను డోర్‌ డెలివరీ చేస్తారు. దీని కోసం ఏ జన్మభూమి కమిటీ సభ్యుడిని, ఎమ్మెల్యేని అభ్యర్థించనవసరం లేదు. సరైన అర్హత ఉంటే చాలు అన్నింటికీ అతీతంగా పథకం అందుకుంది.

సచివాలయాలతో గ్రామాభివృద్ధి

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న ఆలోచన విధానం అద్భుతంగా ఉంది. పంచా యతీల్లో సెక్రటేరియట్‌లను ఏర్పాటు చేస్తే గ్రామ ప్రజల పాలన అంతా ఆ గ్రామంలోనే అందుతుంది. అలాగే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేశారు. ఈ సెక్రటేరియట్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తే లాంటి ఒత్తిళ్లు లేకుండా, ఎవ్వరి సిఫారసులు లేకుండానే ప్రభుత్వ పథకాలు, సేవలు కేవలం 72 గంటల్లోనే అందుతాయి. రాష్ట్రంలో ప్రస్తుత పాలన నుంచి ప్రజలు మార్పు కోరుతున్నారు.
– యెన్ని సూరిబాబు, మాజీ సర్పంచ్, కొత్తూరు సైరిగాం, గార

వాలంటీర్‌గా నేను సిద్ధం

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే పంచాయతీల్లో సచివాలయాలు పెడతామని అంటున్నారు. ఈ వ్యవస్థతో పంచాయతీల్లో పాలన మరింత సులభతరమవుతుంది. అందుకే దీన్ని స్వాగతిస్తున్నాం. గ్రామ వాలంటీర్‌గా పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. గ్రామంలోనే ఉంటూ నా పరిధిలో ఉన్న వారికి ప్రభుత్వ పథకాలను అందించడంలో నా వంతు కృషి చేస్తాను. జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై యువకులు కూడా ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు.
– అంబటి రమేష్, అంపోలు

మరుగుదొడ్లు బిల్లులోనూ రాజకీయమే

మా ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాను. బిల్లులు అడిగితే నా కార్డు పేరుతో ఇచ్చేసినట్లు చూపిస్తున్నారు. డబ్బులు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇందులోనూ రాజకీయమే. ఎన్ని సార్లో ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి అడిగినా పట్టించుకోలేదు. అలాగే నా తమ్ముడు వినోద్‌ కుమార్‌ పేరుతో బీసీ కార్పొరేషన్‌ లోన్‌కు దరఖాస్తు చేశాం. అర్హత ఉన్నా ఇవ్వ డం లేదు. గ్రామ సచివాలయాలు వస్తే ఇలాంటి సమస్యలు ఉండవు. అర్హులకు న్యాయం జరుగుతుంది.
– చెట్టు సూర్యనారాయణ, చెట్టువానిపేట, శ్రీకాకుళం మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top