అండా దండా నీవేనయ్యా

People support to ys jagan in praja sankalpa yatra - Sakshi

ధర్మవరం నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగుతున్న పాదయాత్ర

జగన్‌ను చూసేందుకు భారీగా తరలివస్తున్న రైతులు, మహిళలు

అర్హత ఉన్నా పింఛన్లు తొలగించారంటూ మొరపెట్టుకున్న 150మంది వృద్ధులు

రావులచెరువులో జెండా ఆవిష్కరణ... డ్వాక్రామహిళలతో ముఖాముఖి

12వరోజు 15.6కిలోమీటర్లు కొనసాగిన పాదయాత్ర

సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘అచ్చం వాళ్లనాన్నలాగే ఉన్నాడే! పాపం వాళ్ల నాన్న చనిపోయినప్పటి నుంచి బిడ్డ కష్టాలు పడుతున్నాడు. ఏడేళ్లుగా ఇంట్లో కంటే జనాల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఈ మారుమూల ఊళ్లకు ఇప్పటిదాకా ఏ నాయకుడు రాలేదప్పా! జగన్‌ వత్తాండు! ఈసారి కచ్చితంగా మనం ఆయనకు అండగా ఉండాలా!’ ...పాదయాత్రలో ప్రతీపల్లెలో జనాలు గుమికూడిన ప్రతీచోటా వినపడే మాటలు ఇవి.  జగన్‌ తమ ఊరికి వస్తున్నాడని తెలిసి ప్రతీ పల్లెలో ప్రజలు పనులు మానేసి, ఇళ్లకు తాళం వేసి రోడ్డుపై ఎదురుచూపులు చూశారు. దారి పొడవునా మహిళలు హారతి పట్టి దిష్టితీసి పట్టరాని సంతోషంతో ఆనందభాష్పాలు రాల్చారు. ఆప్యాయతలకు జగన్‌ చలించిపోయి అక్కున చేర్చుకున్నారు.

ప్రజాసంకల్పయాత్ర 12వరోజు(మొత్తంగా 37వరోజు) ఆదివారం గొట్లూరు శివారు నుంచి మొదలై తుమ్మల చేరుకుంది. అక్కడ నవ్య, అనిల్‌ దంపతుల చిన్నారికి విజయమ్మ అంటూ నామకరణం చేశారు. గ్రామస్తులు గజమాలతో సత్కరించారు. అక్కడే ఓబుళపతి ఆధ్వర్యంలో శాలివాహనసంఘం నేతలు జగన్‌ను కలిసి తలపాగాతో అలంకరించి, తిరుమల వేంకటేశ్వరుడి చిత్రపటాన్ని బహుకరించారు. తుమ్మల శివార్లలో  ప్రత్యేకంగా టెంట్‌ వేసుకుని వేచి ఉన్న బత్తలపల్లికి చెందిన 150మంది వృద్ధులను జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. ‘అయ్యా! మా అందరికీ పింఛన్లు వచ్చేవి! అర్హత ఉన్నా తొలగించారు’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న అవ్వా, తాతలకు పింఛన్లు ఇవ్వకపోవడంపై జగన్‌ తీవ్ర వేదన చెందారు.

తర్వాత నిరుద్యోగులు జగన్‌ను కలిసి కియా కార్ల పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడి నుంచి రావులచెరువుకు చేరుకున్నారు. జగన్‌ను చూసేందుకు ప్రతీ ఇళ్లు తరలివచ్చింది. గ్రామంలో రోడ్లపై ఎక్కడ చూసినా జనాలే! ట్రాక్టర్లు, ఆటోలతో పూలు తెచ్చిరోడ్డు కన్పించకుండా పరిచారు. తమ అభిమాన నేతను పూలపై నడిపించారు. గ్రామంలో వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జెండా ఆవిష్కరించారు. అక్కడే డ్వాక్రా మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. దారిపొడవునా భారీగా జనాలు తరలిరావడం, అందరినీ జగన్‌ పలకరిస్తూ ముందుకు సాగడంతో పాదయాత్ర ఆలస్యంగా సాగింది.

భోజనాన్ని సైతం త్యజించి
మధ్యాహ్నం 2.40గంటలకు భోజనవిరామ శిబిరానికి చేరుకున్నారు. ముందు వైపు ఉన్న పల్లెల్లో ఉదయం నుంచి జనాలు ఎదురు చూస్తుండటం, అప్పటికే ఆలస్యం కావడంతో భోజనాన్ని సైతం జగన్‌ త్యజించి యాత్రను కొనసాగించారు. ఎర్రగుంటపల్లి తండా, రావులచెరువు తండా మీదుగా వెంకట తిమ్మాపురం చేరుకున్నారు. గ్రామంలో వికలాంగులు జగన్‌ను కలిశారు. వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్లు ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదని వాపోయారు. అక్కడి నుంచి దర్శినమల చేరుకుని రాత్రి బస చేశారు. ఆదివారం మొత్తం 15.6కిలోమీటర్లు జగన్‌ నడిచారు. యాత్రలో జగన్‌ వెంట మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉంటూ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలను పరిచయం చేస్తూ ముందుకు సాగారు. 12వరోజు యాత్రలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్‌రెడ్డి, యవజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, సీఈసీ సభ్యుడు గిర్రాజు నగేష్, రాష్ట్రకార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, కోటి సూర్యప్రకాశ్‌బాబు, విద్యార్థి విభాగం నేత లింగారెడ్డి, కంచం లీలావతి, నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి, కసనూరు రఘునాథరెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

‘నవరత్నాల’ పట్టుచీర బహూకరణ
ధర్మవరంటౌన్‌: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు’ పేరుతో చేనేత నాయకులు పట్టుచీరను తయారు చేయించారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు గిర్రాజు నగేష్, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లపల్లి మోహనరావు, జిల్లా అధ్యక్షుడు బీరే ఎర్రిస్వామి జననేత జగన్‌ను తుమ్మల గ్రామం వద్ద కలుసుకున్నారు.  నవరత్నాల పట్టుచీరను బహూకరించారు. పట్టుచీరలో జగన్‌మోహనరెడ్డి ప్రజలకు ఇచ్చిన  నవరత్నాల హామీలను ఎంతో కళా నైపుణ్యంతో పొందుపర్చారు. ఈ చీరను చూసిన జగన్‌మోహనరెడ్డి, వారిని ప్రశంశించారు. వస్త్రం బాగుందని, మన పార్టీ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేసి, చేనేత రంగానికి  సముచిత ప్రాధాన్యతనిద్దామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.  కార్యక్రమంలో చిత్తూరు  జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు సత్య, ధర్మవరం చేనేత నాయకులు జింకా రాఘవేంద్ర తదితరులు ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ అని...
వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు అంటూ తమకు పింఛన్‌ అందకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ధర్మపురి గ్రామానికి చెందిన నాగులమ్మ, గంగాధర దంపతులు జగన్‌ ఎదుట వాపోయారు. ముగ్గురు పిల్లల సంతానముండగా పెద్ద కుమారుడు గౌతమ్‌ పుట్టుకతోనే మూగచెవిటి అని వివరించారు. తమ మామ మంగాలప్పకు 70 శాతం వైకల్యమున్నా పింఛన్‌ మంజూరు చేయడం లేదన్నారు. తమకు న్యాయం చేకూర్చాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top