రక్షగా ఉన్నందుకు కక్షగట్టారు!

People Support To YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఉన్నామని అధికార పార్టీ వేధింపులు

జగనన్నకు మొరపెట్టుకున్న బాధితులు

ప్రజా సంకల్పయాత్ర బృందం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉన్నామనే కక్షతో సంక్షేమ పథకాలు వర్తింపజేయకుండా అడ్డుకుంటున్నారని పలువురు బాధితులు జగనన్న ఎదుట మొరపెట్టుకున్నారు. జి.సిగడాం, పొందూరు మండలాల్లో కొనసాగిన పాదయాత్రలో భాగంగా బుధవారం ప్రతిపక్ష నేతను కలిసి తమ సమస్యలు విన్నవించారు. అధికార పార్టీకి మద్దతుగా ఉండనందుకు అడుగుగడుగునా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు.  

దగాపడ్డాం..
మేము మొదటి నుంచీ మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెంటే ఉంటున్నాం. నా ముగ్గురు కుమారుల్లో ఆరేళ్ల క్రితం ధర్మాన త్రినాథ, ఏడాది క్రితం ధర్మాన సూరిబాబులు రాజకీయ కారణాలతో మృతిచెందినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. మేము దగాపడి వీధిన పడ్డాం.  ఆదుకోవాలి నాయనా..   – ధర్మాన ఆదిలక్ష్మి, సంతవురిటి, జి.సిగడాం మండలం

ఉద్యోగం తొలగించారన్నా..
గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఉండలేదని నాపై కక్షగట్టి ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం నుంచి తొలగించారన్నా.. 2007 నుంచి మొత్తం 14 మందిని ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనిచేసేవాళ్లం. 2015లో 75 శాతం పనులు జరగలేదని సాకు చూపించి ఉద్యోగం నుంచి అందరినీ తొలగించారు. తర్వాత కొందరిని భయపెట్టి, మభ్యపెట్టి మళ్లీ ఉద్యోగాల్లో తీసుకున్నారు. నన్ను మాత్రం తిరిగి తీసుకోలేదు. కోర్టు తీర్పు ఉన్నప్పటికీ ఎంపీడీవో స్థాయి అధికారులు జన్మభూమి కమిటీల సిఫారసులు కావాలని నేరుగా తేల్చి చెప్పేస్తున్నారు. నాకు ఉద్యోగం లేకపోయినా పరవాలేదు గానీ వాళ్ల దగ్గరకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే నాకు న్యాయం చేస్తావనే ఆశతో ఉన్నాను.   – కంచాన కళ్యాణి, ధవళపేట, జి.సిగడాం మండలం

ధవళపేటపై వివక్ష
సుమారు 30 ఏళ్ల కిందట ధవళపేట గ్రామం పంచాయతీగా ఏర్పాటైంది. ఇప్పటికీ సంతవురిటి రెవెన్యూ పరిధిలోనే ఉంది. మాకు వీఆర్‌వో సైతం అందుబాటులో ఉండరు. ఆర్థిక సంఘం నిధుల విషయంలో కూడా వివక్షకు గురవుతునే ఉంది. మడ్డువలస నుంచి మా చెరువులకు అనుసంధానిస్తూ ఇప్పటికీ లింక్‌ కాలువలు తవ్వలేదు. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. రైతు పక్షపాతిగా ముద్రవేసుకున్న దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు జగనన్న మా గ్రామానికి, ఇక్కడి ప్రజానీకానికి న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. వచ్చే ఎన్నికల్లో తోడుగా ఉంటాం.– పేడాడ రాజారావు, మాజీ సర్పంచ్, ధవళపేట

పింఛన్‌ ఆపేశారయ్యా..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుడినని నా పింఛన్‌ నిలిపేశారు. పింఛన్‌ మంజూరు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. వయస్సు 70 దాటినా అర్హత లేదంటున్నారు. నాకంటూ ఎవరూ లేరు. అధికార పార్టీ నాయకులు చేసిన పనికి కడుపు మండుతోంది. ఇప్పటికీ నా కష్టంపైనే జీవిస్తున్నా. రాజన్న హయాంలోపింఛను వచ్చేది. నువ్వు ముఖ్యమంత్రివై మాలాంటి వృద్ధుల కష్టాలు తీర్చాలయ్యా..– వై.సూరి, ధవళపేట

 ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా..
పింఛన్‌  కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా ప్రయోజనం లేదు. పేద ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధుల కార్యాలయాలు చుట్టూ ఫలితం ఉండటం లేదు. టీడీపీ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడం లేదు.– సయ్యద్‌ సలీం, పాలఖండ్యాం, జి.సిగడాం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందడం లేదు
విద్యార్థులకు ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం సకాలంలో అందజేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు మా వద్ద ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందలేదన్నా..– ఇప్పిలి విజయ్‌ కుమార్, రాపాక, పొందూరు

పేదలకు ఇళ్లు ఇవ్వాలి
 పేదలకు ఇళ్లు మంజూరు చేయాలి. టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో మాకు ఇళ్లు మంజూరు చేయలేదు. చిన్నపూరిపాకలో మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాం. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలి నాయనా..      – శిరిపురం సరోజిని, పొందూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top