కావాలి జగన్‌ రావాలి జగన్‌

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

నినదించిన యలమంచిలి

ప్రజా సంకల్పయాత్రలో వినతుల వెల్లువ

విశాఖపట్నం: ‘పరిశ్రమలు వస్తే అభివృద్ధి చెందుతామని భూములిచ్చాం. కానీ నిలువునా మునిగిపోయాం. నష్టపరిహారం లేదు. ఉపాధి కరువైంది. నిరుద్యోగం పెరిగింది. ఇచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా కష్టాలు తీరాలంటే జననేత జగన్‌ ముఖ్యమంత్రి కావాలి. జగన్‌తోనే మాకు మంచి రోజులు’ అని ఎస్‌ఈజెడ్‌ బాధితులు నినదించారు. ప్రజా సంకల్పయాత్రలో వివిధ రూపాల్లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి ఇక్కడ సమస్యలు తీసుకెళ్లారు.

రుణమాఫీ పూర్తిగా జమ కాలేదు
నేను రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాను. కేవలం రూ.40 వేలు మాత్రమే మాఫీ అయింది. నేను తీసుకున్న రుణానికి వడ్డీ దాదాపు రూ. 60 వేలు అయింది. ఆరు మాసాలకొకసారి వడ్డీ లెక్కకట్టి అసలుకు కలిపి వేయడం వల్ల వడ్డీ పెరిగిపోయింది. మాఫీకి అని ఇచ్చిన  సొమ్ము వడ్డీకే చాల్లేదు. ఐదు విడతల్లో రుణం మొత్తం మాఫీ చేస్తానని చెప్పి మూడు విడతల సొమ్మే బ్యాంకులో జమ చేశారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పకపోతే ఏటా వాయిదాలు సక్రమంగానే చెల్లించుకునేవాళ్లం. చంద్రబాబు మోసం చేశారు. అతని మాటలు నమ్మే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో జగనే గెలవాలి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాదే.    – జి.రాజశేఖర్‌రాజు, రాంబిల్లి

400 కుటుంబాలకు ఉపాధి పోయింది
ఎస్‌ఈజెడ్, ఎన్‌ఏవోబీల వల్ల తమ ప్రాంతంలోని వేలాది ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తాటి, ఈతచెట్లు పోవడం వలన ఉపాధి కోల్పోయాం. కల్లుగీతపై ఆధారపడి సుమారు 400కి పైగా కుటుంబాలు జీవిస్తున్నాం. ఇప్పుడు ఉపాధి లేక రోడ్డున పడ్డాం. ప్రభావిత కుటుంబాలుగా చేర్చి మాకు పరిహారం ఇవ్వాల్సి ఉన్నా.. ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. జీవో 68 ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. పట్టించుకోలేదు. మాగోడు జగనన్నకు చెప్పుకునేందుకు వచ్చాం. సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే తప్పక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. –అండిబోయిన సతీష్, కల్లుగీత కార్మికుడు, రాంబిల్లి

‘కేరళ’ బాధితులకు రూ.40 వేల విరాళం
ప్రజా సంకల్పయాత్ర బృందం: యలమంచిలికి చెందిన కలపాల విజయ అనే మహిళ అస్వస్థత కారణంగా ఏడేళ్లుగా మంచానికే పరిమితమైపోయారు. ఇటీవల కేరళను వరదలు ముంచెత్తడంతో చలించిపోయిన ఆమె బాధితులకు అందజేయాలని రూ.40 వేల చెక్కును తన భర్త డాక్టర్‌ సత్యనారాయణతో  వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి పంపించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అంతా మంచే జరుగుతుందని ఆశీర్వదిస్తూ ఆమె లేఖ కూడా పంపారు.   

డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడు?
నేను బీఈడీ పూర్తి చేసి టెట్‌ క్వాలిఫై అయ్యాను. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీలో జాప్యం చేస్తోంది. నాలా ఎంతో మంది నిరుద్యోగులు నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని జగనన్నకు తెలిపాను. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానని అన్న హామీ ఇచ్చారు.        – డి. శాంతి, అచ్యుతాపురం

జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
ప్రజాసంకల్పయాత్ర బృందం: అచ్యుతాపురంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని పలువురు యువకులు ప్లకార్డులు చేతపట్టి జననేత జగన్‌ను కోరారు. పలుగ్రామాలకు చెందిన యువకులు ప్రజా సంకల్పయాత్రకు ర్యాలీగా వచ్చారు. ఇక్కడ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేక ఉన్నత విద్యకు దూరమవుతున్నామని అన్నారు. బీసీ ఏ కేటగిరి వారిని ఎస్‌టీ జాబితాలో చేర్చాలని కోరారు.

హామీల అమలెక్కడ?
‘మాది మత్స్యకార నిర్వాసిత గ్రామమైన లోవపాలెం. ఎస్‌ఈజెడ్‌కు మా భూములు సేకరించారు. ఆ సమయంలో ఎకరానికి రూ.5.5 లక్షలు పరిహారం ఇచ్చారు. వీటితోపాటు ఇంటికో ఉద్యోగం, పాడి గేదెలు, ఐదు సెంట్ల స్థలం ఇస్తామన్నారు. తీరా భూములు తీసుకుని పదేళ్లు దాటుతున్నా ఇప్పటికీ ఆ హామీలు అమలు చేయలేదు. ప్రభుత్వం ఈ హామీలను పట్టించకోవడం లేదు. మీ ప్రభుత్వం రాగానే ఈ హామీలన్నీ నెరవేర్చాలంటూ’ మాజీ సర్పంచ్‌ చెల్లూరి మసేనుతల్లి గ్రామస్తులతో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలసి విన్నవించారు. తమకు న్యాయం చేయాలని జననేతను కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top