వెలుగు దివ్వెగా జననేత అడుగు

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

సాంత్వన ఇస్తున్న చిరునవ్వు

ధైర్యం చెబుతున్న అమృతహస్తం

ఉపశమనం పొందుతున్న ప్రజలు

భరోసా కోసం కదిలివస్తున్న బాధితులు

ఆత్మీయతతో తరలివస్తున్న జనం

ప్రజా సంకల్పయాత్రతో పల్లెల్లో జనజాతర

‘అర్హులమైనా పింఛన్లు ఇవ్వడం లేదు. ప్రతిపక్షం ముద్రేసి పథకాలకు దూరం చేశారు. వికలాంగులమనే కనికరం కూడా లేదు. పేదవారమైనా ఇళ్లు ఇవ్వలేదు. సొమ్ములు కట్టించుకుని మొండి చెయ్యి చూపించారు. భూములను తీసేసుకుని రైతులను నట్టేట ముంచారు. కౌలు రైతుల కష్టాలు తీరడం లేదు. ఆరోగ్య శ్రీ నిర్వీర్యమైంది.  గతుకులమయమైన రోడ్లతో నరకయాతన అనుభవిస్తున్నాం. అధికారులు పట్టించుకోవడం లేదు. నాయకులు చెప్పినోళ్లకే పనులు చేస్తున్నారు..’ ఇలా అడుగడుగునా ఓ కన్నీటి గాథ. ఆ హృదయం చలించిపోతోంది. ఆ అమృతహస్తం ధైర్యం చెబుతోంది. ఆ చిరునవ్వు రానున్నవి మంచి రోజులనే భరోసా కల్పిస్తోంది.

సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి , కాకినాడ: ప్రతి అడుగూ... నిరాశను పారదోలే ప్రభంజనమవుతోంది. జనంలో నమ్మకం పెంచుతోంది.  ఆ అడుగే వెలుగు దివ్వెగా మారుతోంది. వేల దీవెనలతో ముందుకు సాగుతోంది. అందరికీ ఆప్యాయత పంచుతోంది. ప్రతి ఇంటా నమ్మకాన్ని నింపుతోంది. విలువలకు, విశ్వసనీయతకు చిరునామా అవుతోంది.  వాస్తవాలకు అద్దం పడుతూ ఆత్మస్థైరాన్ని  కల్గిస్తోంది.   అడుగులో అడుగేసిన వారికి కొత్త భరోసానిస్తోంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తలపెట్టిన   ప్రజా సంకల్పయాత్రలో ఆద్యంతం ఇదే కనిపిస్తోంది. దారి పొడవునా కన్నీటి కథలే. ఎవరిని కదిలించినా తీరని వెతలే. ఉబికి వచ్చే వేదన...ఊరూ వాడను కదిలిస్తోంది. అడుగులో అడుగులు వేయిస్తోంది. ఆసరా దొరికిందని పల్లెలన్నీ పాదయాత్రలో కలుస్తున్నాయి. బురదమయమైనా.. ఇరుకు, గతుకుల రోడ్లు అధ్వానంగా ఉన్నా..నడవడానికి వీల్లేని పరిస్థితులున్నా.. లెక్క చేయకుండా జననేత వద్దకు ప్రజలు పరుగులు తీస్తూ వస్తున్నారు. వ్యవసాయ కూలీలు...మహిళలు.. నిరుద్యోగులు.. ఇలా ఇబ్బందులతో సతమవుతున్న వారంతా జననేతతో అడుగులో అడుగు వేస్తున్నారు. తమ బాధలు చెప్పుకొని ఉపశమనం పొందుతున్నారు.  అశేషంగా జనం తరలిరావడంతో పాదయాత్ర సాగుతున్న గ్రామాలన్నీ జనజాతరను తలపిస్తున్నాయి.  

ఊరూరా బారులు తీరిన జనం
ప్రతి గ్రామంలోనూ జననేతకు హారతులిచ్చేందుకు బారులు తీరారు. వైఎస్సార్‌ వేషధారణతో పిల్లలు సందడి చేయగా.. జగనన్నకు రాఖీలు కట్టి,  స్వీటు తినిపించేందుకు చెల్లెమ్మలు పోటీ పడ్డారు. ఇక దారి పొడవునా సెల్ఫీలు తీసుకునేందుకు  విద్యార్థులు ఎగబడ్డారు. మొత్తానికి ఆదివారం పాదయాత్ర సాగిన పల్లెలన్నీ సందడితో కన్పించాయి.

ఈ కష్టాలకు తెర దించన్నా..
దివ్యాంగుడైన తన బిడ్డకు మామూలు పింఛన్‌ ఇస్తున్నారు తప్ప రూ.1500 వచ్చే వికలాంగ పింఛను ఇవ్వడం లేదని వాకాడ శ్రీనివాసరావు జననేతను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్‌ తమ్మవరం, సూర్యాపేట, పెనుమర్తి గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు 295 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏపీఐఐసీకి ధారాదత్తం చేసి, రోడ్డున పడేసిందని  జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.  
2006లో రాజీవ్‌ గృహకల్ప పథకంలో ఇల్లు మంజూరైందని, ఆ తర్వాత 2012 నుంచి ప్రతి నెలా రూ.6 వేలు చొప్పున ఇప్పటి వరకు రూ. 3 లక్షలకు పైగా చెల్లించినా ఇంతవరకూ ఇల్లు కేటాయించలేదని కాకినాడకు చెందిన పర్వీన్‌ గోడు వెళ్లబోసుకుంది. పంటలు నష్టపోతున్నా నాలుగేళ్లుగా  కౌలు రైతులకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదని, పంట చేతికందకపోయినా కౌలు మాత్రం చెల్లించాల్సి వస్తోందని, రుణాలు సక్రమంగా అందడం లేదని పలువురు కౌలు రైతులు మొర పెట్టుకున్నారు.  అచ్చంపేటలో చంద్రపాలెంకు చెందిన సీతారామ దొర గ్రామంలోని సమస్యలు చెప్పుకున్నాడు. తమ బాధలు గుర్తించి, పరిష్కారానికి చొరవ చూపాలని వేడుకున్నాడు. పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం కూల్చివేతపై జగన్‌కు పలువురు  ఫిర్యాదు చేశారు. సామర్లకోట మండలానికి చెందిన గ్రామ పంచాయతీ ఉద్యోగులు జగన్‌కు తమ సమస్యలు వివరించారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా సర్వీసును క్రమబద్ధీకరించడం లేదని, వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని , పీఎఫ్‌ వంటి సౌకర్యాల్లేవని మొర పెట్టుకున్నారు. గొంచాల వద్ద ముస్లిం యువకులు జగన్‌ను కలిసి ప్రస్తుతం అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లను 8 శాతానికి పెంచాలని, ప్రభుత్వ పథకాల్లో తగిన ప్రాధాన్యం దక్కేలా చూడాలని వేడుకున్నారు. కేబుల్‌ ఆపరేటర్లు  జగన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. పన్నుల మోత ఎక్కువైందని, వాటిని తగ్గించేలా చూడాలని కోరారు.

పాదయాత్రలో పార్టీ శ్రేణులు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పినిపే విశ్వరూప్, తలశిల రఘురాం, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లాల అ«ధ్యక్షులు కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్, సమన్వయకర్తలు తోట సుబ్బారావునాయుడు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్య ప్రకాశరావు, ఆకుల వీర్రాజు, అనంత ఉదయ భాస్కర్, కొండేటి చిట్టిబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, పార్టీ నాయకులు పితాని అన్నవరం, దవులూరి దొరబాబు, దవులూరి సుబ్బారావు, మిండగుదిటి మోహన్, కర్రి పాపారాయుడు, గంధం గోపాల్, మేడపాటి షర్మిలారెడ్డి, ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీర రాఘవరావు, తోట సత్య తదితరులు పాల్గొన్నారు.  

218వ రోజు పాదయాత్ర సాగిందిలా...
కాకినాడలోని అచ్చంపేట జంక్షన్‌ నుంచి ఆదివారం ఉదయం ప్రారంభమైన  పాదయాత్ర అచ్చంపేట, గొంచాల, బ్రహ్మానందపురం, పి.వేమవరం క్రాస్‌ మీదుగా ఉండూరు శివారు వరకు కొనసాగింది. అచ్చంపేట చేరుకున్న జగన్‌ పెద్దాపురం నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు. రోజంతా అదే నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. ఆదివారం 6.6 కిలోమీటర్లు నడిచారు. జగన్‌ రాకతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది.

వైఎస్సార్‌ సీపీలో చేరికలు
రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో నగరంలోని 29వ డివిజన్‌ కార్పొరేటర్‌ కురిమిళ్ల అనురాధతో పాటు పలువురు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరికి  జగన్‌ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. విశాఖ జిల్లా చోడవరానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు వడ్డాది నర్సింహమూర్తి పంతులు, సీహెచ్‌ గుప్తా, సూర్యనారాయణ, గోవింద్‌ తదితరులు జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top