రంగవల్లులు.. పూల జల్లులు

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పచ్చని సీమలో ఆహ్లాదంగా ప్రజాసంకల్ప యాత్ర

ముగ్గులు వేసి, హారతులు, పూలదారులతో వైఎస్‌ జగన్‌కు స్వాగతం

జననేత జగన్‌ కర స్పర్శతో పులకిస్తున్న అభిమానులు

అభిమాన నేతతో సెల్ఫీలు దిగుతున్న అక్కచెల్లెమ్మలు

ఐదో రోజు 12.2 కిలోమీటర్లు సాగిన యాత్ర

నేటి నుంచి పి.గన్నవరం నియోజకవర్గంలో...

సాక్షి, తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం: గోదావరి డెల్టా కాలువలు, కొబ్బరిచెట్లు, అరటి తోటల మధ్య కోనసీమలో ప్రజాసంకల్ప యాత్ర ఆహ్లాదంగా సాగుతోంది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర 191వ రోజు జిల్లాలో ఐదో రోజు ఆదివారం రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామం నుంచి ప్రారంభమైంది. కేతరాజుపల్లి, దేవరపల్లి శివారు, గంధంవారిపాలెం, ఈతకోట, కొత్తపేట మండలం పలివెల క్రాస్‌ పూజారిపాలెం, రావులపాలెం మండలం ముమ్మిడివరంపాడు క్రాస్, పలివెల క్రాస్, జంటిపల్లిపాలెం క్రాస్, గంటి మీదుగా 12.2 కిలోమీటర్ల మేర సాగింది. ప్రతి గ్రామంలో మహిళలు వైఎస్‌ జగన్‌ రాక సందర్భంగా తమ లోగిళ్లను రంగవల్లులతో అలంకరించారు. కొత్త దుస్తులు ధరించి, హారతులతో వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు.

గ్రామాల్లోని రోడ్లపై పూలు చల్లి తమ అభిమాన నేతను వాటిపై నడిపించారు. ప్రతి గ్రామంలో అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, పిల్లలను వైఎస్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. అక్కచెల్లెమ్మలకు స్వయంగా సెల్ఫీలు తీసి ఇచ్చారు. యువత తమకు కూడా సెల్ఫీలు కావాలని పట్టుబట్టడంతో పలుచోట్ల వారితో సెల్ఫీలు దిగారు. వైఎస్‌ జగన్‌ను చూసేందుకు, ఆయన స్పర్శ కోసం యువత ఉవ్విళ్లూరింది. వైఎస్‌ జగ¯Œన్‌ అనే నినాదాలతో పాదయాత్ర పొడవునా హోరెత్తించింది. వెదిరేశ్వరంలో అక్కచెల్లెమ్మలు వైఎస్‌ జగన్‌కు పిండివంటలు తినిపించారు. పలువురు రాఖీ కట్టి తమ సోదరుడు వచ్చాడని మురిసిపోయారు. ముస్లిం సోదరులు ఖురాన్‌ను బహూకరించారు. అభిమానులు బాహుబలి కాజా అందించారు. చంటి పిల్లల్ని ముద్దాడుతూ, మిద్దెలు, మేడలపై ఉన్నవారికి అభివాదం చేస్తూ జననేత ముందుకు సాగారు.

పాదయాత్రలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ నేతలు
పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, యువజన విభాగం ముఖ్యనేత జక్కంపూడి గణేష్, వైఎస్సార్‌ సీపీ అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కవురు శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యేలు ఎ.అమర్‌నాథ్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, గొల్లబాబూరావు, పాముల రాజేశ్వరి, పొన్నాడ సతీష్‌కుమార్, రౌతు సూర్యప్రకాశరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి, గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, ఎలిజా, నాగులపల్లి ధనలక్ష్మి, అనంత ఉదయ్‌భాస్కర్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వివిధ విభాగాల జిల్లా అధ్యక్షులు యనమదల మురళీకృష్ణ, జున్నూరి వెంకటేశ్వరరావు, మార్గాని గంగాధర్‌రావు, దూనబోయిన సత్యనారాయణ, మంతెన రవిరాజు, పార్టీ నేతలు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, కర్రిపాపారాయుడు, విప్పర్తి వేణుగోపాల్, రాష్ట్ర కార్యదర్శులు కర్రి నాగిరెడ్డి, మిండగుదిటిమోహన్, గిరిజాల బాబు, కొమ్మిరెడ్డి బాలకృష్ణ, సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర సేవాదళ్‌ కార్యవర్గ సభ్యుడు చల్లా ప్రభాకర్‌రావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యుడు మద్దూరి సుబ్బరాజు, రావులపాలెం వైస్‌ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యంవర్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు బొక్కా వెంకటలక్ష్మి, అత్తారు విజయ్‌కుమార్, పార్టీ రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల కన్వీనర్లు జొన్నేటి అర్జునరావు, ముత్యాల వీరభద్రరావు, తమ్మన శ్రీను, కనూమూరి శ్రీనివాసరాజు, జిల్లా కార్యదర్శి రెడ్డి చంటి, యువజన విభాగం నేతలు పిల్లి సిరిబాల, ఆర్‌వీవీఎస్‌ చౌదరి, గుర్రంగౌతమ్, వాచచర్ల కృష్ణ, మేడపాటి అనిల్‌రెడ్డి, చిక్కాల బాబులు పాల్గొన్నారు.

పల్లెల్లో పండగ వాతావరణం
ప్రజాసంకల్ప యాత్ర 191వ రోజు జిల్లాలో ఐదవ రోజు రావులపాలెం మండలం వెదిరేశ్వరం నుంచి ఉదయం 8:45 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు రాత్రి బస చేసిన ప్రాంతంలో వివిధ వర్గాల ప్రజలు వైఎస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. అభిమానులు సెల్ఫీలు దిగారు. అనంతరం బయలుదేరిన వైఎస్‌ జగన్‌కు వేదిరేశ్వరం గ్రామంలో వీధివీధినా రంగవల్లికలు, పూలతో స్వాగతం పలికి హారతులిచ్చారు. గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. గ్రామాల్లో అడుగడుగునా మహిళలు హారతులతో ఘన స్వాగతం పలకడంతో మధ్యాహ్నం నిర్ణీత సమయం కన్నా పాదయాత్ర 25 నిమిషాలు ఆలస్యంగా భోజన విరామ ప్రాంతానికి చేరుకుంది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన యాత్ర రాత్రి బస ప్రాంతమైన పి.గన్నవరం నియోజకవర్గంలోని జి.పెదపూడి గ్రామానికి సాయంత్రం 6:15 గంటలకు చేరుకుంది. అక్కడ పలువురు పార్టీ నేతలు అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. 

సమస్యలు విన్నవించిన వివిధ వర్గాలు
ఐదోరోజు పాదయాత్రలో దారిపొడవునా వివిధ వర్గాల వారు వైఎస్‌ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. అరటికి ధర లేమి, ఈదురుగాలులతో పంట పాడైనా బీమా లేకపోవడంతో నష్టాలపాలవుతున్నామని అరటి రైతులు వాపోయారు. మీ నాన్నగారి హయాంలో గెల రూ.300 పలికిందని, ఇప్పుడు రూ.200 కూడా రావడంలేదని వైఎస్‌ జగన్‌కు చెప్పుకున్నారు. ఏడాదికి తమకు రూ.10 వేలు ప్రోత్సాహకం ప్రకటించిన వైఎస్‌ జగన్‌ను రావులపాలెం ఆటోయూనియన్‌ నేతలు కలసి కృతజ్ఞతలు చెప్పారు. ఆటో ఇన్సూరెన్స్‌ భారమవుతోందని, ఆ విషయంపై కూడా దృష్టి సారించాలని విన్నవించారు. దస్తావేజులేఖర్లు, ముస్లిం హక్కుల పోరాట సమితి, డ్వాక్రా యానిమేటర్లు, గోపాలమిత్రలు, అగ్నికుల క్షత్రియ సంఘ నేతలు తమ సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను జననేతకు ఇచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బిల్లులు నెలల తరబడి మంజూరు చేయడంలేదని, వంటసామగ్రి ఇవ్వడంలేదని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. కిరాణా దుకాణాల్లో అప్పులు పెరిగిపోతున్నాయని, వడ్డీకి డబ్బులు తెచ్చి కట్టాల్సి వస్తోందని వాపోయారు. కొబ్బరికాయల దింపు కార్మికులు తమ కష్టాలను చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సంక్షేమం కోసం కృషి చేయాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఏఎన్‌ఎం వర్కర్లు విన్నవించారు. ఇలా పాదయాత్ర పొడవునా వినతులు స్వీకరిస్తూ, సమస్యలు వింటూ వారికి వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top