అలుపెరుగని పథికుడికి అపూర్వ స్వాగతం

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

జానపద కళారూపాలతో ఆహ్వానం

గోదావరిలో పడవల హారం

గుమ్మడికాయలతో  హారతులిచ్చిన ఆడపడుచులు

కడియం: తూర్పుగోదావరి జిల్లాకు ప్రజాసంకల్పయాత్రతో విచ్చేసిన వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి మంగళవారం రాజమహేంద్రవరంలో వినూత్న స్వాగతం లభించింది. వివిధ సాంస్కృతిక, జానపద కళారూపాలతో పార్టీ నాయకులు స్వాగతం పలికారు. పార్టీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజుల సంయుక్త ఆధ్వర్యంలో అడుగడుగునా నీరాజనాలతో తూర్పునకు ఆహ్వానం పలికారు.  జిల్లాలో గరగనృత్యానికి పేరుగాంచిన గొర్రిపూడి, ద్రాక్షారామం, కాకినాడ, తాపేశ్వరం తదితర ప్రాంతాల నుంచి బృందాలను తీసుకువచ్చారు.

గరగనృత్యాలతో పాటు డప్పులు, వీరనాట్యం,  తంబర్కాలు, తప్పెటగుళ్ళు, థింసా నృత్య బృందాలు, కోయడ్యాన్సులు తీన్‌మార్, గారడీ తదితర సాంస్కృతిక బృందాలకు చెందిన వందలాది మంది కళాకారుల ప్రదర్శనలు జగన్‌ స్వాగత కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పార్టీ జెండా రంగులతో కూడిన బెలూన్‌లను రోడ్‌కం రైలు వంతెన మీదుగా గాల్లోకి విడిచిపెట్టారు. రోడ్‌కం రైలు బ్రిడ్జికి ఇరువైపులా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. బ్రిడ్జికి ఒకవైపు భారీ పార్టీజెండాను ఏర్పాటు చేశారు. జగన్‌ 25 అడుగుల కటౌట్‌ను ట్రాక్టరుపై ఏర్పాటు చేసి, జై జగన్‌ నినాదాలతో పాదయాత్ర ముందు నడిపించారు. రాజమహేంద్రవరం వైపునకు చేరుకోగానే పెద్దఎత్తున మహిళలు పూర్ణకుంభాలను చేత పట్టుకుని జగన్‌కు స్వాగతం పలికారు. సంప్రదాయ, ఆధునిక రీతులతో కూడిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

గుమ్మడికాయలతో దిష్టి తీసిన ఆడపడుచులు
ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ప్రజా సంక  ల్పయాత్ర నిర్వహిస్తూ తూర్పుగోదావరి జిల్లాకు మొట్టమొదటి సారిగా రాజమహేంద్రవరం విచ్చేసిన జగన్‌మోహన్‌రెడ్డికి గుమ్మడికాయలతో దిష్టితీసి ఆడపడుచులు స్వాగతం పలికారు. పార్టీ జెండా రంగులతో చీరలు ధరించిన 108 మంది మహిళలు గుమ్మడికాయలపై హారతి కర్పూరం వెలిగించి బ్రిడ్జి మీదుగా నడిచి వస్తున్న జగన్‌ను ఘన స్వాగతం పలికారు. పార్టీ జెండాలు చేతబూని, టీషర్ట్‌లు ధరించిన కార్యకర్తలు గుర్రాలపై కూర్చుని జగన్‌కు స్వాగతం పలికారు. పచ్చ, తెలుపు, నీలం రంగుల చీరలు ధరించిన మహిళలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి జగన్‌కు స్వాగతం పలకడం ప్రత్యక ఆకర్షణగా నిలిచింది.

గోదావరిలో పడవల హారం
జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర ప్రత్యేకతను చాటి చెప్పేందుకు గోదావరిలో సుమారు 600లకు పైగా పడవలను మూడు వరుసల్లో నిలిపారు. వాటిపై పార్టీ జెండాలు చేతబూని మత్స్యకారులు, పార్టీ కార్యకర్తలు నిలబడి బ్రిడ్జి మీదుగా జిల్లాకు విచ్చేస్తున్న జగన్‌కు స్వాగతం పలికారు. పడవల వరుసను సెల్ఫీలో చిత్రీకరించుకునేందుకు యువకులు పోటీపడ్డారు. పశ్చిమ నుంచి విచ్చేస్తున్న జగన్‌కు వీడ్కోలు పలికేందుకు ఆ జిల్లా నాయకులు, స్వాగతం పలికేందుకు తూర్పు నాయకులు పెద్దఎత్తున వంతెనపైకి చేరుకున్నారు.

వెండి ఫ్యాన్‌ బహూకరణ
వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డికి ఆ పార్టీ గుర్తు అయిన ఫ్యాన్‌ను సుమారు రెండుకేజీల వెండితో తయారు చేయించి బహూకరించారు. కోటిపల్లి బస్‌స్టాండ్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గుర్రం గౌతమ్‌ వెండి ఫ్యాన్‌ను జగన్‌కు అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top