మా రాజై నువ్వుండాలయ్యా..

People Suopport to YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సంక్షేమమంటే ఎలా ఉంటుందో నీ తండ్రి పాలనలో చూశాం. ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయాం. పేదోళ్లకి పింఛన్లు ఇవ్వాలన్నా, ఇళ్లు ఇవ్వాలన్నా తమ పార్టీ వాళ్ల మెప్పు పొందాలంట. ఇదేమి విపరీతం బాబూ. ఆరోగ్యశ్రీతో పేదలను ఆదుకున్న దేవుడు మీ నాన్నగారు. ఇప్పుడు అన్నీ కండిషన్లే. ఫీజురీయింబర్స్‌మెంట్‌లోనూ కోతలే. ఇలాగైతే మాలాంటివాళ్లం బతికేదెలా ఆందోళన చెందుతున్నవేళ చీకటిలో చిరుదీపంలా కనిపించావు. మా రాజన్నే మళ్లీ వచ్చాడనిపించేలా మా గురించి ఆలోచిస్తున్నావు. నువ్వే మా రాజై ఉండాలంటూ విశాఖ నగరవాసులు ప్రజాసంకల్పసారథి జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం అడుగడుగునా నీరాజనాలు పలికారు. అవిశ్రాంత పథికుడితో పదం కలిపారు.  – ప్రజాసంకల్ప యాత్ర బృందం

లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తేనే నిరుద్యోగులకు న్యాయం
‘రాష్ట్రంలో నిరుద్యోగులకు 20 వేల ఉద్యోగాలు ఎటూ సరిపోవు. లక్ష ఉద్యోగాలైనా భర్తీ చేయవలసిన అవసరం ఉంది. తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేసి గ్రూప్‌–2కు సంబంధించి 622, 623 జీవోలను రద్దు చేసేందుకు సహకరించండి. రాష్ట్రంలో పోటీ పరీక్షల సిలబస్, విధానాలను మారిస్తే నిరుద్యోగులు ఇబ్బంది పడతారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆన్‌లైన్‌ పరీక్ష విధానంలో లోపాలను సవరించాలి. గతంలో గ్రూపులకు ఉన్న కటాఫ్‌ను యథాతథంగా 1:50 గానే కొనసాగించాలని మనవి చేస్తున్నాం. తెలంగాణ రిజర్వేషన్‌తో సమానంగా ఏపీలో కూడా నాన్‌ లోకల్‌ రిజర్వేషన్లు అమలు చేయాలి. జూనియర్‌ లెక్చరర్ల నోటిఫికేషన్‌ విడుదలకు చర్యలు తీసుకోవాల’ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌ కుమార్‌ వినతిపత్రం అందించారు.

జీవీఎంసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి...
మేమంతా విశాఖ నగరపాలక సంస్ధలో ఎన్‌ఎంఆర్, కన్సాలిడేటెడ్‌ వర్కర్స్‌గా 1989వ సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం. మమ్మల్ని నేటికీ రెగ్యులర్‌ చేయలేదు. గ్రేటర్‌ విశాఖలో వివిధ కేటగిరీల్లో సుమారు 10 వేల మంది పనిచేస్తున్నాం. 2004 తరువాత ఉద్యోగాల్లో చేరిన వారికి అమలు చేసే సీపీఎస్‌ను జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేయాలని కోరాం. 24 సంవత్సరాలుగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా మిగిలిపోయిన వారికి కనీసం సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశాం. మా సమస్యలపై కమిటీ వేసి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.       – జీవీఎంసీ స్టాఫ్, వర్కర్స్‌ యూనియన్‌ సభ్యులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top