వెతికే వెలుగు నీ ద్వారా రానీ..

People Sharing Their YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

ప్రజా సంకల్పయాత్రలో ప్రజల మనోభిప్రాయం ఇదీ..

విశాఖపట్నం ;  15 ఏళ్ల కిందట వైఎస్సార్‌ మా కల్లంలోనే బస చేశారు. అందరితోపాటు నేను వెళితే నా బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రుణభారం గురించి చెప్పుకుంటే ‘మనం అధికారంలోకి వస్తే ఆ భారం లేకుండా చేస్తానమ్మా’ అని ఊరడించారు. అన్నట్లుగానే రెండు దఫాలు రుణమాఫీ ద్వారా మాకు రూ.లక్ష భారం తగ్గించారు. ఆయన చనిపోయిన రోజు మా ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. కొద్ది రోజులు నేను మనిషిని కాలేకపోయాను. ఈ రోజు ఆయన బిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మా వద్దకు రావడం ఆనందంగా ఉంది. ఆయన అధికారంలోకి వస్తే ఆ మహానుభావుడి పాలన తిరిగి వస్తుందని ఆశిస్తున్నాం.     – వంటాకు సూర్యకుమారి

పెన్షన్‌ కోసం ఎదురు చూస్తున్నా
భర్త చనిపోయి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పుడు నా వయసు 70 ఏళ్లు దగ్గరగా ఉంది. నేను వితంతు, వృద్ధాప్యపు పెన్షన్‌కు అర్హురాలిని. పదేళ్లుగా నాయకుల చుట్టూ తిరుగుతున్నా పెన్షన్‌ ఇవ్వలేదు. జగన్‌బాబు ముఖ్యమంత్రి అయితే పెన్షన్‌ వస్తాదని ఆశతో ఎదురు చూస్తున్నాను.– సీకు సింహాచలం, లక్కవరం

జగనన్న చేత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ  
మాది అనకాపల్లి. మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసి పర్యావరణానికి మేలు చేకూర్చేందుకు 2006లో వినాయక ఉత్సవ సామూహిక నిమజ్జన కమిటీను స్థాపించాను. మట్టితో తయారు చేసిన విగ్రహాలనే పూజించాలని ప్రచారం చేయడంతో పాటు ఈ విగ్రహాలను పంపిణీ చేపడుతున్నాం. ఈ ఏడాది 25 వేల మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టాం. ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న జననేత జగనన్న చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఎప్పటికీ మర్చిపోలేం.– అడారి కుమారస్వామి, బృందం సభ్యులు,వినాయక ఉత్సవ సామూహిక నిమజ్జన కమిటీ, అనకాపల్లి

లక్కవరం మదినిండా వైఎస్సార్‌
‘దశాబ్దన్నర కిందట మహానుభావుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మా ఊరు వచ్చారు. మా కల్లాల్లోనే రాత్రి బస చేశారు. ఆయన వచ్చారని మా ఊళ్లో వాళ్లందరం ఉదయాన్నే వెళ్లాం. అందరినీ పలకరించి మా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు, మహిళలను వారు పడుతున్న ఇబ్బందులను అడిగారు. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారమే రైతులకు, డ్వాక్రా మహిళలకు మేలు జరిగేలా రుణమాఫీ చేసి మా ఊళ్లో ప్రతీ ఇంటికీ మేలు చేశారు. ఆయన మరణించిన రోజు మా ఉళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. దాదాపు రెండు రోజుల పాటు ముద్ద దిగలేదు. ఆ మహానేత మరణించిన తొమ్మిదేళ్ల తరువాత అదే రోజు ఆయన కుమారుడు మా గ్రామంలోకి మళ్లీ రావడం మరిచిపోలేం. వైఎస్సారే మళ్లీ మా ఊరికి వచ్చారన్న సంబరంగా ఉంది. ఆయన లాగే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా అధికారంలోకి వచ్చాక అందరికీ మేలు చేస్తారు’ ఇదీ చోడవరం మండలం లక్కవరం గ్రామస్తుల మనోగతం. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ఆదివారం లక్కవరం క్రాస్‌కు రావడంతో గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేవు. ఊరంతా తరలివచ్చి జననేతకు భారీ ఎత్తున స్వాగతం పలికారు. రైతులు, మహిళలు తాము పడుతున్న ఇబ్బందులను జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పుకున్నారు. రాజన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.   

వైఎస్సార్‌ సీపీలోకి వలసల వెల్లువ
ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమక్షంలో పలువురు పార్టీలోకి చేరారు. శాసన సభాపక్ష ఉపనేత బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో దేవరాపల్లి మండలం కొత్తపెంటలో కాంగ్రెస్, టీడీపీ, జనసేన నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్‌ మాజీ మండల అధ్యక్షుడు సేనాపతి కొండలరావు, ఎంపీటీసీ సభ్యుడు బొడ్డపాటి శ్రీరామమూర్తి, నాయకులు కరణం అప్పారావు, అంగార సూర్య నారాయణ, మట్టా కొండబాబు, ఎస్‌.గంగాధరరావు, కోట్ని రామారావు, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, పట్నాల అప్పారావు, రెడ్డి దేముడుబాబు, పాల సొసైటీ మాజీ అధ్యక్షుడు గండి రామునాయుడు, రొంగలి వెంకటరావు తదితరులు ఉన్నారు. వీరి అనుచరులతో పాటు మొత్తం 600 మంది వరకు పార్టీలో చేరినట్టు నాయకులు తెలిపారు.

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి..  
చోడవరం మండలం జి.జగన్నాథపురానికి చెందిన పలువురు టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో వీరంతా జి.జగన్నాథపురం జంక్షన్‌ వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పార్టీలో చేరిన వారిలో పాల సంఘం మాజీ డైరెక్టర్లు అవుగడ్డ కోటేశ్వరరావు, చిటిమిరెడ్డి అప్పారావు తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top