నిలువ నీడనిచ్చిన దేవుడు వైఎస్సార్‌

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : శంభూనగర్‌లోని ఐఓసీఎల్‌ కాలనీలో పేదలమైన మాకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇల్లు ఇచ్చారు. నేను, నా భార్య బోదవ్యాధితో బాధపడుతున్నాం. నా వయస్సు 65, నా భార్య వయస్సు 62. పింఛను ఇవ్వాలని కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు. రెండేళ్ల క్రితం నేను పడిపోవడంతో నడవలేని స్థితిలో ఉన్నాను. ఈ ప్రభుత్వానికి మమ్మల్ని ఆదుకునేందుకు మనసు రావడంలేదు.

ఇల్లు లేదయ్యా– పంచదార్ల నూకరత్నం, ధవళేశ్వరం
ధవళేశ్వరంలో దీర్ఘకాలంగా అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాం. సొంత ఇల్లు ఇప్పించమని దరఖాస్తులు చేసుకున్నా మంజూరు కాలేదు. నా భర్త కూలిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తరచూ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఖర్చులు ఎక్కువవుతున్నాయి. కనీసం సొంత ఇల్లు సమకూరితే అద్దె ఖర్చులేకుండా ఉంటుందయ్యా. జన్మభూమిలో దరఖాస్తు చేసుకున్నా ఫలితంలేకుండా పోయింది...

స్వయం ఉపాధికి కరెంటు బిల్లు సమస్యగా మారింది– మురపాక రత్నకుమారి, ధవళేశ్వరం
ధవళ్వేరం సాయిబాబా గుడి సమీపంలో సోంపాపిడి తయారీ చేసి అమ్ముకుంటున్నాం. నేను, నా భర్త, కుటుంబ సభ్యులమంతా కష్టపడి పనిచేస్తాం. సార్‌కు సోంపాపిడి అందించాం. మా కష్టాలు చెప్పుకున్నాం.  నెలకు రూ.2200 కరెంటు బిల్లు రావడంతో షాపు నిర్వహణ సమస్యగా మారింది. బీసీ రుణానికి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు.

గుండె ఆపరేషన్‌ చేయించుకున్నా.. పింఛను నిలిపివేశారు– బి.తాతారావు, నామవరం
నేను 1982లో ఒకసారి, 1992లో మరోసారి గుండెకు శస్త్ర చికిత్సలు చేయించుకున్నాను. సుమారు 8 ఏళ్ల పాటు నెలకు రూ.200 పింఛను ఇచ్చేవారు. నాలుగేళ్ల నుంచి పింఛను ఇవ్వడం లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత పింఛను ఇప్పించడంతో పాటు గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి వికలాంగుల మాదిరిగా కోటా ఇవ్వాలన్నా.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top