సంక్షేమం మరిచిన సర్కారు

People Sharing Their Problems to YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

పథకాల అమలులో వివక్ష

ప్రతిపక్ష నేతకు కష్టాలు చెప్పుకున్న బాధితులు

శ్రీకాకుళం: రాజన్న హయాంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తే, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో అందుకు విరుద్ధంగా అర్హులకు అన్యాయం చేస్తున్నారని పలువురు బాధితులు ప్రతిపక్ష నేత ఎదుట వాపోయారు. జన్మభూమి కమిటీ సిఫారసులకే పెద్దపీట వేస్తూ దరఖాస్తులను బుట్టదాఖలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నరసన్నపేట నియోజకవర్గంలో సోమవారం జరిగిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు.– ప్రజాసంకల్పయాత్ర బృందం

అభివృద్ధికి నోచుకోని పల్లెలు
టీడీపీ ప్రభుత్వ హయాంలో పల్లెలు అభివృద్ధి కాలేదు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి సమస్యలతోపాటు పంటలకు గిట్టుబాటు ధర ఉండడం లేదు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యలు పరిష్కరించి అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలి.– గొల్లంగి రామలత, బొడ్డపాడు, జలుమూరు మండలం.

ఆస్పత్రి లేక అవస్థలు
మా గ్రామం(టెక్కలిపాడు) అభివృద్ధికి నోచుకోవడం లేదు. గ్రామ సమీపంలో ఆస్పత్రి లేకపోవడంతో రాత్రివేళల్లో అత్యవసర వైద్యానికి ఇబ్బందులు ఎదురువుతున్నాయి. గ్రామంలో పేదలు ఉన్నా ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం లేదు. మా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలి.– గొండ్రు లక్ష్మి, టెక్కలిపాడు, జలుమూరు

వితంతు పింఛన్‌ ఇవ్వడం లేదు
మా ఆయన మృతి చెంది మూడేళ్లవుతుంది. వితంతు పింఛన్‌ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటున్నా స్పందించడం లేదు. మా గ్రామంలోని కొందరు అధికార పార్టీ నాయకులకు లంచం ఇస్తేనే పింఛన్‌ మంజూరు చేస్తున్నారు. మూడు సంవత్సరాలుగా  జన్మభూమి మాఊరు గ్రామసభల్లో  దరఖాస్తులు చేసుకున్నా న్యాయం చేయలేదు. మీరు అధికారంలోకి రాగానే మాలాంటి వారికి న్యాయం చేయాలన్నా.
– పలిశెట్టి అనూరాధం,రావిపాడు, జలుమూరు

అంత్యో‘దయ’ ఏదీ?
అంత్యోదయ కార్డుకు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయడం లేదు. ఎటువంటి ఆధారం లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. ఈ ప్రభుత్వానికి పేదలపై దయలేదు. దళితులను ఆదుకోవడానికి  ఎటువంటి పథకాలు  కూడా ప్రవేశ పెట్టడం లేదు. మీరు దయతలచి దళితులను ఆదుకోవడానికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి.– ఎస్‌.మోహనరావు, నారాయణవలస, జలుమూరు మండలం

పరిహారం అందలేదు
నేను దివ్యాంగుడిని. నాకున్న మూడు ఎకరాల పొలంలో వరి పంట సాగు చేశాను. తిత్లీ తుఫాను సమయంలో పంట మొత్తం పాడైంది. అధికారులు వచ్చి నష్టాన్ని అంచనా వేసుకుని వెళ్లారు. అయినా ఇంతవరకు పరిహారం మాత్రం అందలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పందించే వారు కరువయ్యారు. తిత్లీ బాధితులను ఆదుకోవాలయ్యా– రెడ్డి పాపినాయుడు, పెద్ద దూగాం, జలుమూరు

పింఛన్‌ రద్దు చేశారు
నాకు పూర్తిగా కళ్లు కనిపించవు. రాజన్న హయాంలో నాకు పింఛన్‌ అందేది. ప్రస్తుత  ప్రభుత్వం పింఛ న్‌ రద్దు చేసింది. దరఖాస్తు చేసుకుంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు. దివ్యాంగులపై ప్రభుత్వానికి దయలేదయ్యా. మీ పాలనలో దివ్యాంగులందరికి న్యాయం చేయాలయ్యా..– కిమిడి సూర్యనారాయణ,రాణా గ్రామం, జలుమూరు మండలం

ఉద్యోగ అవకాశాల్లో అర్హత కల్పిండి
నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎస్‌.సీ ఉద్యానశాఖ, ల్యాండ్‌ స్కోప్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు(ఎం.ఎస్‌.సి హెచ్‌.సి.ఎల్‌.ఎం) 2009 సంవత్సరంలో పూర్తి చేశాను. ఈ గ్రూపునకు యు.జి.సి గుర్తింపు ఇస్తామని వైఎస్సార్‌ హామీ ఇచ్చారు. ఆయన మరణానంతరం ఈ అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. యు.జి.సి. గుర్తింపు లేనందున వ్యవసాయ, ఉద్యానశాఖ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. మీరు అధికారంలోకి వచ్చాక ఈ గ్రూపు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి సార్‌.– కూన సుశీల, ఊడిగలపాడు, జలుమూరు మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top