బాధలు వింటూ.. భరోసా ఇస్తూ!

People Sharing Their Problems With YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతుల వెల్లువ

అధికారంలోకి వచ్చిన వెంటనే

ఆదుకుంటానని హామీ

పింఛన్లు అందడం లేదని ఒకరు..
ఇల్లు మంజూరు చేయడం లేదని మరొకరు.. కిడ్నీ బాధితులను ఆదుకోవడం లేదని ఇంకొకరు.. ఇలా అన్ని వర్గాల వారు తమ సమస్యలను రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించుకున్నారు. ఆదివారం రాజాం నియోజకవర్గంలో కొనసాగిన పాదయాత్రలో భాగంగా జగనన్న అడుగులో అడుగు వేస్తూ తమ గోడు వెల్లబోసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి
కష్టాలు తీర్చుతానంటూ ప్రతిపక్ష నేత వారికి భరోసా ఇచ్చారు.– ప్రజా సంకల్పయాత్ర బృందం

నాన్నకు పింఛన్‌ అందడం లేదు
ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా తన తండ్రికి పింఛన్‌ మంజూరు చేయడం లేదని సంతకవిటి మండలం పుల్లిట గ్రామానికి చెందిన మడ్డు పార్వతి వాపోయింది. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్య విన్నవించింది. పింఛన్‌ కోసం జన్మభూమి మా ఊరు గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకోలేదని, తన తండ్రి వృద్ధాప్యం కారణంగా కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది.  

న్యాయం జరగలేదు..
టీడీపీ ప్రభుత్వ హయాం లో న్యాయం జరగడం లేదని రేగిడి మండలం అంబకండి గ్రామానికి చెందిన దివ్యాంగుడు గులివిం దల సత్యం నాయుడు వాపోయారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన గోడు వెల్లబోసుకున్నారు. పది నెలల కిందట రోడ్డు ప్రమాదం కారణంగా కాలు తొలగించారని, అయినా చంద్రన్న బీమా మంజూరు చేయలేదని వాపోయారు. కనీసం పింఛనైనా మంజూరు చేయాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీరే మాకు న్యాయం చేయాలని విన్నవించారు.
 
కక్ష సాధిస్తున్నారు..
ఇల్లు నిర్మించుకుని నాలుగేళ్లయినా ఇంతవరకూ పైసా బిల్లు కూడా మంజూరు చేయలేదని రేగిడి మండలం నాయిరాలవలస గ్రామానికి చెందిన కొవ్వాడ గౌరమ్మ వాపోయింది. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన సమస్య వివరించింది. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులం కావడం వల్లే బిల్లు మంజూరు కాకుండా టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఏడాది పరిమితితో ఇబ్బందులు
వికలాంగ ధ్రువీకరణకు సంబంధించి సదరం పత్రం ఏడాదికి మాత్రమే మంజూరు చేస్తున్నారని రేగిడి ఆమదాలవలసకు చెందిన దివ్యాంగుడు పతివాడ చిన్నంనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన సమస్య చెప్పుకున్నాడు. ఏడాది పరిమితికి మాత్రమే ధ్రువీకరణ పత్రం ఇవ్వడం వల్ల బస్సు, రైల్వేపాస్‌ వంటి సౌకర్యాల మంజూరుకు ఇబ్బంది పడుతున్నానని వాపోయారు.

కాళ్లరిగేలా తిరుగుతున్నా..
ఎన్‌టీఆర్‌ గృహ కల్ప ఇంటి కోసం జన్మభూమి కమిటీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని రేగిడి ఆమదాలవలస మండలం నేయిరాలువలసకు చెందిన బెజ్జిపురపు రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్య విన్నవించారు. టీడీపీ ప్రభుత్వంలో అర్హులకు ఇళ్లు మంజూరు చేయటం లేదని, కేవలం రాజకీయ జోక్యంతో ఇలా చేస్తున్నారని వాపోయారు.

కిడ్నీ రోగులను ఆదుకోవాలయ్యా..
కిడ్నీ వ్యాధితో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని రేగిండి మండలం అంబకండి గ్రామానికి చెందిన పి.పైడమ్మ వాపోయింది. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి గోడు వెల్లబోసుకుంది. కిడ్నీ వ్యాధి సోకడంతో ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేసింది. రెండు నెలల క్రితం శస్త్రచికిత్స చేసుకున్నా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని, కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయింది. కిడ్నీ రోగులను ఆదుకోవాలని విన్నవించింది.  

పేదోళ్ల కష్టాలు తీర్చాలి
‘నిన్ను దేవుడు చల్లగా చూడాలి. అధికారంలోకి రావాలి. ప్రస్తుతం అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మా మనవళ్లకు ఉద్యోగాలు లేవు.ఇలాంటి పరిస్థితిలో మీ తండ్రిలాగే మీరు కూడా మా పేదోళ్ల కష్టాలు తీర్చాలి బాబూ..’ అంటూ రేగిడి మండలం కుమ్మరి అగ్రహారం గ్రామానికి చెందిన ఓగిపల్లి లక్ష్మమ్మ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top