ఓ పూట గంజినీళ్లు మరో పూట పస్తులు

People Sharing Their Problems To YS Jagan - Sakshi

జననేత వద్ద వాపోయిన వృద్ధ దంపతులు

ప్రజా సంకల్పయాత్రలో వినతుల వెల్లువ

విశాఖపట్నం :‘జగన్‌ బాబు.. నా వయసు 70.. నా భర్త వయసు 75 ఏళ్లు. మా పిల్లలు ఎవరిదారి వారు చూసుకున్నారు. ప్రభుత్వమే మాకు దిక్కు అనుకుంటే.. ఇద్దరికి పింఛన్లు కూడా మంజూరు చేయడం లేదు. ఒక పూట గంజినీళ్లు.. మరో పూట పస్తులతో కాలం వెళ్లదీస్తున్నాం. నీవు అధికారంలోకి వచ్చాకైనా మాలాంటి ప్రజల కష్టాలు తీర్చాలయ్యా..’ ‘ఆరోగ్యశ్రీలో నాకు గుండె శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు గుండెకు రంధ్రం పడింది. రెండో సారి ఆరోగ్యశ్రీలో చికిత్స లేదంటున్నారు.’. ‘వైఎస్సార్‌ సీపీలో ఉన్నామని టీడీపీ నేతలు వేధింపులకు గురిచేస్తున్నారు.’ ఇలాంటి బాధితులు వందల సంఖ్యలో ప్రజా సంకల్పయాత్రకు వచ్చారు. తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. తమ కష్టాన్ని చెప్పుకున్నారు. తమ భవిష్యత్‌కు భరోసా కోరారు.–ప్రజా సంకల్పయాత్ర బృందం

వసతి గృహంలో అన్నీ సమస్యలే..
మేమంతా పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం దివ్యాంగుల కళాశాల విద్యార్థులం. మా వసతి గృహంలో కనీస సదుపాయాలు లేవు. తాగునీరు, మంచి భోజనం అందడం లేదు. మరుగుదొడ్లు లేవు. వైద్యసేవలు అందుబాటులో లేవు. మా సమస్యలను కాగితం మీద రాసి జగనన్న దృష్టికి తీసుకెళ్లాం. సమస్యలు పరిష్కరించాలని కోరాం.– బధిర విద్యార్థులు

యాదవుల సమస్యలపై చిన్నచూపు
‘విజయనగరం జిల్లాలో 40 శాతం మంది యాదవులు నివసిస్తున్నారు. ఒక్క విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలోనే 40 వేల మంది ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వీరికి ఏ ప్రయోజనాలూ వర్తింపజేయలేదు. ఫెడరేషన్, కార్పొరేషన్‌ వంటివి ఏర్పాటు చేయలేదు. పాడి వృత్తిని, గొర్రెల పెంపకాన్ని నమ్ముకున్న వారికి మేలు జరగలేదు. బీసీ– డి కేటగిరీకి చెందినందున విద్య, ఉద్యోగ విషయాలలో కూడా పెద్దగా ప్రయోజనం లేదు.  చేతివృత్తులు చేసుకుంటున్న యాదవులకు బీసీ కార్పొరేషన్‌ ఎటువంటి రుణాలు ఇవ్వడం లేదు. డెయిరీ పదవులను వేరే సామాజిక వర్గాలకు ఇస్తున్నారు. నామినేటెడ్‌ పదవులు యాదవులకు కేటాయించడంతో పాటు వీరిని బీసీ ఏ కేటగిరీకి మార్చి న్యాయం చేయాలి.’ అని అఖిల భారత యాదవ మహాసభ విజయనగరం జిల్లా కన్వీనర్‌ గదుల వెంకటరావు జగన్‌ను కోరారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇద్దరికీ పింఛన్లు ఇవ్వలేదు
మాది ఎస్‌ఆర్‌పురం, పెందుర్తి మండలం. నా వయసు 70 ఏళ్లు. నా భర్త వయసు 75 ఏళ్లు పైబడే ఉంటుంది. మా పిల్లలు ఎవరి దారి వారు చూసుకున్నారు. మేమిద్దరమే గంజి నీళ్లు ఓ పూట తాగితే మరో పూట పస్తులుంటూ జీవిస్తున్నాం. మా ఇద్దరికీ పింఛన్లు లేవు. ఇద్దరిలో ఒకరికైనా పింఛన్‌ ఇవ్వాలని నాలుగేళ్లుగా అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ ఎవరు కనికరించలేదు. పింఛన్‌ మంజూరు చేయడం లేదు. జన్మభూమి కమిటీ సిఫారసు ఉన్న వాళ్లకే ఇస్తామంటున్నారు. వాళ్ల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు.–నీటిపల్లి లక్ష్మి, ఎస్‌ఆర్‌పురం,పెందుర్తి మండలం

ఇప్పటి వరకు పీఆర్సీ ఇవ్వలేదు
మాది సీతంపేటలోని కనకవారివీధి. నేను రెవెన్యూ విభాగంలో సర్వేయర్‌ (చైన్‌మన్‌)గా ఉద్యోగ విరమణ చేసి అయిదేళ్లు అయింది. 2017 లోనే పీఆర్సీ, డీఏ ఇవ్వాల్సి ఉన్నా... ఇప్పటి వరకు అందలేదు. కలెక్టర్‌కు విన్నవించుకున్నా. మంత్రులకు వినతిపత్రం ఇచ్చా. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. మూడో బాబు డిగ్రీ పూర్తి చేశాడు. నోటిఫికేషన్‌ లేక నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇదే విషయాన్ని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించాను.
–జోగా అప్పలనర్సయ్య, కనకవారి వీధి, సీతంపేట

కిడ్నీ మార్పిడికి సహకరించండి
మా నాన్న వానపల్లి సూర్యనారాయణరాజు స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు రెండేళ్ల కిందట రెండు కిడ్నీలు పాడైపోయాయి. జీవన్‌దాన్‌ పథకం కింద కిడ్నీల మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఆయనది ఓ పాజిటివ్‌ అయినా కూడా ఇప్పటి వరకు మా వంతు రాలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మీరు దయతో సహకరించి కిడ్నీల మార్పిడికి సహకరించాలి’ అని స్టీల్‌ప్లాంట్‌కు చెందిన వానపల్లి కిశోర్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు. తన నాన్నను బతికించాలని వేడుకున్నారు.

ఆరోగ్యశ్రీలో చికిత్స లేదంటున్నారు
2015లో గుండె సంబంధిత వ్యాధితో బాధపడితే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేశారు. ఇప్పుడు గుండెలో రంధ్రం మూసుకుని పోవడంతో మళ్లీ ఆపరేషన్‌ చేయాలని, అందుకు రూ.50 వేలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. నడిస్తే ఆయాసం, మాట్లాడలేకపోతున్నాను. వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని అంటున్నారు. రెండోసారి ఆరోగ్యశ్రీ కుదరదని చెబుతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని గుండె ఆపరేషన్‌ చేయించేలా చర్యలు తీసుకోవాలి.   –పాము సంతోషి, మాడుగుల

ఆమరణ దీక్షకు మద్దతివ్వండి
వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తించే రిజర్వేషన్‌ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి. ఇదే డిమాండ్‌తో కర్నూలులో నవంబర్‌ 9న ఆమరణ దీక్ష చేపట్టనున్నాం. ఈ దీక్షకు మద్దతు తెలపాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించాను.–ఎం.సుభాష్‌ చంద్రబోస్, అధ్యక్షుడు,వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయండి
‘మాది గండిగుండం గ్రామం ఆనందపురం మండలం. నేను అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌గా పనిచేస్తూ మా గ్రామస్తులు, బంధువులతో సుమారు రూ.60 లక్షల వరకు డిపాజిట్‌ చేయించాను. నా భర్త, నేను కష్టపడి సంపాదించిన రూ.30 లక్షలూ డిపాజిట్‌ చేశాను. ఈ పాలసీలకు 2014లో చెల్లింపులు జరగాలి. కానీ నేటికీ చెల్లింపులు లేవు. డిపాజిట్‌దారులు మా ఇంటికొచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని దాటవేస్తుంది.’ అని మోదపాక దేవి డిపాజిట్‌దారులతో కలసి జననేతకు తమ సమస్యనువివరించారు. మీరే న్యాయం చేయాలి అని వేడుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top