నీ సంకల్పబలమే మా భవితకు భరోసా

People Sharing Their Problems To YS Jagan - Sakshi

విశాఖపట్నం :అదే ఆప్యాయత.. ఆత్మీయ పలకరింపు.. జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే అచ్చంగా తండ్రి రాజశేఖరరెడ్డినే తలపిస్తున్నారంటూ గుర్తు చేసుకుంటున్న వృద్ధులు, మధ్య వయస్కులు.. సంకల్పబలానికి నిలువెత్తు నిదర్శనమంటూ తన్మయులవుతున్న యువత..అభిమానంలో పెద్దన్నయ్యే అంటూ చెల్లెళ్ల ఆదరణ ప్రతి అడుగులో మేమున్నామంటూ పలకరిస్తుండగా కె.కోటపాడు మండలంలో సాగింది సంకల్పసారథి జగన్‌ పాదయాత్ర. ప్రతి ఒక్కరి కళ్లలో వ్యక్తమవుతున్న అనురాగంలో తడిసిముద్దవుతున్నారు జనహృదయ విజేత. నువ్వొస్తేనే మా జీవితాల్లో మంచిరోజులు అంటూ ఎంతో నమ్మకంతో ఉన్న వారందరికీ  త్వరలోనే రాజన్నరాజ్యం వస్తుందంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు.– పాదయాత్ర ప్రత్యేక బృందం

రెండేళ్లుగా సగం పెన్షనే ఇస్తున్నారు
పొడుగుపాలెంలో నాతో పాటు పదిమందికి అభయహస్తం పథకం కింద కేవలం రూ.500 పెన్షనే ఇస్తున్నారు. వాస్తవానికి రూ.వెయ్యి ఇవ్వాలి. పంచాయతీ కార్యదర్శిని అడుగుతున్నా స్పందించలేదు. మాకు రెండేళ్లుగా ఈ అన్యాయం జరుగుతోంది. మాకు పూర్తి పెన్షన్‌ రూ.వెయ్యి వచ్చేలా చూడాలని జగన్‌బాబును కోరాను.– కర్రి పెదరాములమ్మ, పొడుగుపాలెం

వికలాంగులకు వంద శాతం ప్రయాణ రాయితీ ప్రకటించాలి
రాష్ట్రంలో వికలాంగులకు ప్రత్యేకంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయడంతో పాటు నూరుశాతం రాయితీతో బస్సులు, రైళ్లలో ప్రయాణ వసతులు, మూడు చక్రాల వాహనాలకు నూరుశాతం రాయితీతో డీజిల్, పెట్రోల్‌ సరఫరా చేయాలి. ఇప్పుడిస్తున్న పెన్షన్లను రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రూరల్‌ జిల్లా అధ్యక్షుడు జి.రాము, ప్రధాన కార్యదర్శి పి.శ్రీరామమూర్తి జననేత జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు.

వైఎస్సార్‌సీపీ గూటికి కాంగ్రెస్‌ నాయకులు
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. దేవరాపల్లి మండలం కొత్తపెంటలో మాడుగులకు చెందిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సయ్యపురెడ్డి సత్తిబాబు, బొబ్బాది జగన్నాథం, చంద్రాన అప్పారావు, కేపీ నాగేశ్వరరావు, డి.పి.బాబూరావు, కుదర నాగేశ్వరరావు, సేనాపతి గంగునాయుడు, సామంతుల అప్పారావు, దాసరి కొండలరావును జగన్‌మోహన్‌రెడ్డి కండువా వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. కె.కోటపాడు మండలం ఎ.కోడూరు వద్ద ఎం.అలమండకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు పోతుల అనిల్‌కుమార్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరంతా శాసనసభా పక్ష ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.  
టీడీపీ నాయకుల చేరిక : మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో సోమవారం టీడీపీకి చెందిన తాడిపర్తి  మాజీ సర్పంచ్‌ సీర రామలక్ష్మి–సన్నమ్మ, యూత్‌ నాయకుడు కరణం రాము శాసనసభ ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఎస్‌.కోట నియోజకవర్గం మోపాడ మండలం వావిలపాడు మాజీ సర్పంచ్‌ బీల సతీష్‌ కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు.

న్యాయవాదులకు అండగా నిలవండి
న్యాయవాదులకు వెల్ఫేర్‌ ఫండ్‌ బెనిఫిట్‌ రూ.10లక్షలు అమలయ్యేలా చూడాలి. జూనియర్‌ లాయర్లకు లైబ్రరీ సదుపాయం కోసం రూ.10వేల వరకు రుణాలు, రూ.5వేలు స్టైపెండ్‌ అమలు చేయాలి. న్యాయవాదులందరికీ హెల్త్‌కార్డులు వచ్చేలా చూడాలని సుధీర్, వర్మతో కలిసి జగన్‌కు వినతిపత్రం అందించాను.       – కాండ్రేగుల జగదీష్,విశాఖ బార్‌ అసోసియేషన్‌ మాజీ కార్యదర్శి

పెద కల్యాణం ఆనకట్టపునర్నిర్మిస్తామన్నారు
మండలంలోని కోనాం పంచాయతీలో పెదకల్యాణం ఆనకట్ట తుపానుకు కొట్టుకుపోయింది, దానిని మళ్లీ నిర్మిస్తామని జగన్‌ హామీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. కోనాంలో జలాశయం ఉన్నా కోనాం ఆయకట్టుకు పారదు. పెదకల్యాణం ఆనకట్టతో కోనాంతో పాటు శిరిజాం, గదబూరు, మంచాల, చీడికాడ గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది.15 ఏళ్ల క్రితం దెబ్బతిన్న ఆయకట్టు వివరాలను జగన్‌కు పాదయాత్రలో వినతిపత్రం అందించాం. ఆయన స్పందించడం, నిర్మాణంపై వెంటనే హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది.– సలుగు పెదసత్యనారాయణ, ఆయకట్టు రైతు, కోనాం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top