చెదరని దరహాసం.. నువ్వే మా ఆశాదీపం

People Share Their Problems In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం :పింఛన్లు కావాలంటే జన్మభూమి కమిటీల సిఫార్సులు.. ఏ పని చేయాలన్నా లంచాల మేత.. భూమి కనిపిస్తే గద్దల్లా వాలిపోతున్న టీడీపీ నేతల బినామీలు .. ఇలా.. అధికార పార్టీ అకృత్యాలతో విసిగిపోయిన ప్రజలకు ఓ చల్లని ఓదార్పు నిలువెత్తు రూపంలో సాక్షాత్కరించింది. వేల కిలోమీటర్ల నడకైనా చెక్కు చెదరని చిరునవ్వులో సాంత్వన దొరికింది. ఇచ్చిన మాటకోసం ఎన్ని కష్టాలైనా ఎదురొడ్డి నిలబడే ఆత్మవిశ్వాసంలో భవిష్యత్‌ భరోసా కనిపించింది. తమ కోసం వచ్చిన రాజన్నబిడ్డకు తమ గోడు చెప్పుకున్నారు ప్రజలు. మా పిల్లల భవిష్యత్‌ బాగుండాలంటే నువ్వే రావాలన్నా అంటున్న యువత.. మీ నాన్నలా ఉన్నావు.. ఆయనలాగే ప్రజారంజక పాలన చేయి బిడ్డా అంటూ అవ్వాతాతల ఆశీర్వచనాలు అడుగడుగునా తోడు రాగా సాగింది పెందుర్తి నియోజకవర్గంలో సాగింది జననేత ప్రజాసంకల్పయాత్ర. 

పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చూడాలి
నేను రాజశేఖరరెడ్డి అభిమానిని. నాకు 83 ఏళ్లు. నడవలేను. ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకునేందుకు నువ్వు తొమ్మిది నెలలుగా పాదయాత్ర చేస్తున్నావని విన్నాను. నిన్ను చూడాలని మా జిల్లాకు వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. పట్టణ సమీపంలోకి వచ్చావని తెలిసి ఓపిక చేసుకుని గుల్లేపల్లి వచ్చాను. నిన్ను కలిశాను. చాలా సంతోషంగా ఉంది. నువ్వు పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండాలి బాబూ.– వర్రి అప్పలనాయుడు, మురళీనగర్‌

మరుగుదొడ్డి మంజూరుకు పదివేలు లంచం
మా గ్రామంలో టీడీపీ నాయకుల అరాచకాలు ఎక్కువైపోయాయి. మరుగుదొడ్డి మంజూరు చేయాలంటే పదివేల రూపాయలు లంచం ఇచ్చుకోవాలన్నా. బిల్లు చేస్తే పదివేలు తీసుకుని ఐదువేలు చేతిలో పెడుతున్నారు. మా గ్రామంలో 500 ఇళ్లు ఉన్నాయి. అన్నీ ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్నవే. ఏ ఇంటికీ ఇంటిపన్ను రసీదు గానీ, విద్యుత్‌మీటర్‌ గానీ ఇవ్వడం లేదు. హుద్‌హుద్‌ తుపానుకు సుమారు 30 పూరిళ్లు నేలమట్టమయ్యాయి. ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. లబ్ధిదారుల జాబితా కూడా వచ్చింది, అయితే  స్థానిక నాయకులు అడ్డుకుని ఇళ్లు కట్టుకోకుండా చేస్తున్నారు. అధికారులు కూడా వారికే వంత పాడుతున్నారు. మీరే న్యాయం చేయాలని జగనన్నను కోరాను.        – పిట్ల పైడిరెడ్డి, పిట్టవానిపాలెం, పెదగంట్యాడ మండలం

మా బాబుకు ‘అన్న’ప్రాసన చేశారు
మా కుటుంబానికి జగనన్న అంటే ప్రాణం. మా బాబు భగన్‌దీప్‌కు పది నెలలు. అన్న చేతులమీదుగా అన్న ప్రాసన చేయించాలని ఇక్కడికి వచ్చాం. వీలవుతుందా, లేదా అని ఆందోళన పడ్డాం. కానీ అన్న మా కోరిక తీర్చారు. బాబుకు అన్నప్రాసన చేశారు. ఆయన దీవెనలే మా బాబుకు శ్రీరామరక్ష.  – పైల నరేష్, గాయత్రి దంపతులు, పరవాడ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top