నువ్వే మా ధైర్యం

People Shanring THeir Problems To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం :‘మీ ఫొటోతో ఫ్లెక్సీ పెట్టామని పింఛన్‌ తొలగించేశారు’. ‘నేను వైఎస్సార్‌ వీరాభిమానిని. అందుకే చంద్రన్న బాండు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు’. ‘జన్మభూమి కమిటీలు నా ఖర్మకొచ్చాయి. నా నోటి కాడ కూడును లాగేసుకున్నాయి.’ ‘గత ఎన్నికల్లో తెలుగుదేశంకు ఓటు వేయలేదని రేషన్‌ కార్డు ఇవ్వలేదు.’ ‘అటవీ భూములను సాగు చేసుకుంటున్నాం. వైఎస్సార్‌ సీపీ వాళ్లమని పట్టాలు ఇవ్వడం లేదు.’ ఏం అన్న.. ఇంత దారుణం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అర్హులందరికీ పథకాలు అందాయి. ఈ ప్రభుత్వంలో ఇంత కక్ష సాధింపా.! అంటూ ములగపూడి, డొంకాడ గ్రామాలకు చెందిన వృద్ధులు, మహిళలు, గిరిజనులు జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు. టీడీపీ ఎన్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా అధైర్య పడటం లేదని.. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నామని వారంతా స్పష్టం చేశారు.  

80 ఏళ్లు వచ్చినా పింఛన్‌ రాలేదు
నా వయసు 80 ఏళ్లు. అయినా పింఛన్‌ రాలేదు. నాకంటే తక్కువ వయసు ఉన్న వారికి పింఛన్లు ఇస్తున్నారు. నాయకుల చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్నాను. పింఛన్‌ మాత్రం ఇవ్వలేదు. ఇప్పటికి పది సార్లు దరఖాస్తు చేశాను. జగన్‌ బాబు సీఎం అయితే పింఛన్‌ వస్తుందని ఆశిస్తున్నాను. ఆ బాబుతో నా బాధ చెప్పుకుందామని వచ్చాను. – గవిరెడ్డి మహాలక్ష్మి, ములగపూడి

వైఎస్సార్‌ సీపీ వోళ్లకి ఏమీ ఇవ్వరా?
నేను చంద్రన్న బీమా పథకంలో ప్రీమియం చెల్లించాను. రసీదు ఇచ్చారు. కాని బాండు ఇవ్వలేదు. ఇదే విషయం సీఏను అడిగితే తిప్పుతున్నారు. బాండ్‌ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. నేను పక్కా వైఎస్సార్‌ అభిమానిని. వైఎస్సార్‌ సీపీకి చెందిన వ్యక్తిని కాబట్టే నాకు బాండు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. నాకు ఈ పథకం వర్తించకుండా కుట్రపన్నారు. అందరూ తెలుగుదేశంలోనే ఉండాలా.. వేరే పార్టీలో ఉండకూడదా.. వైఎస్సార్‌సీపీ వోళ్లకి ఏమీ ఇవ్వరా.? ఇదెక్కడి న్యాయం? రాజశేఖరరెడ్డి హయాంలో టీడీపీ వోళ్లే ఎక్కువ లబ్ధి పొందారు. – కేతవరపు వెంకటరమణ, ములగపూడి

జగన్‌ ఫొటోతో ఫ్లెక్సీ పెట్టామని..
‘గతేడాది ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఫొటోతో మా ఊర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశామయ్య. దీంతో కక్ష కట్టిన టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు మా మావయ్య పింఛన్‌ తీసేశారు. మరీ ఇంత దారుణమా. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో టీడీపీ వోళ్లంతా పింఛన్లు, ఇళ్లు తీసుకున్నారు. ఎప్పుడూ మన వాళ్లు ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. ఇలా అయితే ఎలా బాబూ? అయినా మేం బాధపడటం లేదు. మా జగనన్న వస్తాడు, మాకు పింఛన్‌ వస్తుందని గర్వంగా చెబుతున్నాం. మీరు సీఎం కావాలి. అదే మా ఆకాంక్ష ’అని ములగపూడికి చెందిన గొడిది సునీత ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తన గోడును చెప్పుకున్నారు.

పింఛన్‌ మంజూరు చేయించండి బాబూ..
‘నా వయసు 70 ఏళ్లు. వృద్ధాప్య పింఛన్‌కు అన్ని విధాలుగా అర్హుడిని నేను. కానీ నాకు పింఛన్‌ మంజూరు చేయలేదు. పలుకుబడి ఉన్నోళ్లకే పింఛన్‌ మంజూరు చేస్తున్నారు. నేను మాత్రం ప్రతి మీటింగ్‌లోనూ కాగితం పెడుతున్నా.. పింఛన్‌ ఇవ్వడం లేదని’ ములగపూడికి చెందిన ఒడిగల పెంటయ్య అనే వృద్ధుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద మొరపెట్టుకున్నాడు. నాబోటోళ్లకి మీలాంటోళ్లే సాయం చేయాలి నాయన అంటూ వేడుకున్నారు. నాయకుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

రెండేళ్లయినా బిల్లులు చెల్లించలేదు
‘గృహ నిర్మాణ పథకంలో రెండేళ్ల కిందట ఇల్లు నిర్మించుకున్నాం. రూ.50 వేలు మాత్రమే బిల్లు చెల్లించారు. మేమంతా వైఎస్సార్‌ సీపీ అని చెప్పి మిగతా బిల్లులు చెల్లించడం మానేశారు. అడిగితే అదిగో, ఇదిగో అంటున్నారు. కేవలం మాపై కక్ష సాధింపు చర్యలతోనే బిల్లులు చెల్లించడం లేదు. తెచ్చిన అప్పులకు వడ్డీకట్టలేకపోతున్నాం. మీరు రావాలి, మా కష్టాలు తీరాలి.’అని ములగపూడికి చెందిన గొడిది గీతావాణి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తన కష్టాన్ని చెప్పుకున్నారు.

పింఛన్‌ ఇవ్వడం లేదయ్యా..
‘తన భర్త అనారోగ్యంతో చనిపోవడంతో అప్పటి ప్రభుత్వం తనకు వితంతు పింఛన్‌ మంజూరు చేసింది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఏడాది వరకు పింఛన్‌ ఇచ్చి, తర్వాత కారణం లేకుం డా తొలగించారు. మూడేళ్లగా వితంతు ఫింఛన్‌ ఇవ్వడం లేదు’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలసి తన సమస్యను చెప్పుకుంది డొంకాడ గ్రామం చికకోట్ల రాజరత్నం. తన సమస్యను జగన్‌బాబు విన్నారని, సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఆమె తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top